UPSC Civils Ranker Donaka Prithviraj Success Story: ఎటువంటి కోచింగ్ లేకుండానే మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు.. ఈ విషయాలపై దృష్టి సారిస్తే..!
పార్వతీపురం: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలే సివిల్ సర్వీసెస్. ఇటీవలె, విడుదలైన ఫలితాల్లో ఎంతోమంది పాస్ అయ్యి, ఉత్తీర్ణులయ్యారు. అందులో ఒకరే పార్వతీపురంకు చందిన యువకుడు దొనక పృథ్వీరాజ్. పార్వతీపురంలో నివాసం ఉంటున్న దొనక విజయ్‌కుమార్, వెంకటరత్నం దంపతుల కుమారుడు ఇతను. మంగళవారం విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో ఇతను తన సత్తా చాటాడు. దేశవ్యాప్తంగా 493వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఈ విజయం తన మూడో ప్రయత్నంలో రెండో ఇంటర్వ్యూతోపాటు ఎటువంటి కోచింగ్ లేకుండానే సాధ్యం కావడం విశేషం.. దీంతో తన కుటుంబం ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పృథ్వీ సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన ప్రయాణాన్ని వివరించాడు..
Civils Ranker Vineesha Badabhagni Success Story: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన ఉదయగిరి యువతి
తండ్రిని చూసి స్ఫూర్తి పొందా..
మా స్వప్రాంతం కురుపాం. చిన్నతనంలోనే పార్వతీపురం వచ్చి స్థిరపడ్డాం. అప్పట్లోనే నాన్న ఎంఈఓగా పని చేశారు. ప్రభుత్వ శాఖల్లో పరిపాలన, ప్రజలకు సేవ చేసే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుంచి ప్రభుత్వ సర్వీసుల్లోకి రావాలని అనుకున్నా. పదో తరగతి వరకు పార్వతీపురంలో, ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్(ఆర్ట్స్) చదువుతున్నప్పుడే పూర్తిస్థాయిలో సివిల్స్‌పై దృష్టి సారించా.
కోచింగ్ లేదు.. ఇంటి వద్దే కష్టపడ్డా
సివిల్స్ లక్ష్య సాధన కోసం ఎక్కడా ప్రత్యేకించి కోచింగ్ తీసుకోలేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆప్షనల్‌గా తీసుకున్నా. రోజుకు 8 గంటలు ఇంటి వద్దే ఉండి కష్టపడి చదివా. పరీక్షల సమయంలోనే 10–11 గంటల సమయం వెచ్చించా. మూడో ప్రయత్నంలోనే సాధించా. ఇది రెండో ఇంటర్వ్యూ. ఎక్కువగా మెయిన్స్ మీద దృష్టి సారించాను. ఈ ఏడాది స్కోరింగ్ రావాలని కష్టపడ్డాను. ప్రజెంటేషన్, ఇతర అంశాలపై దృష్టి సారించి విజయం సాధించాను. సివిల్స్ లక్ష్యంగా చదువుతున్న వారూ ఇదే దృష్టిలో పెట్టుకుంటే మంచిది. త్వరగా గమ్యం చేరుకోవచ్చు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే...
నా విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. వారు అడుగడుగునా అండగా నిలిచారు. ప్రస్తుతం, నాన్న ఎం.ఆర్.నగరం జెడ్పీహెచ్‌ఎస్‌లో హెచ్‌ఎంగా చేస్తున్నారు. అమ్మ ప్రభుత్వ పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.