ఇంటర్‌తో టీచర్ అవ్వచ్చు..
రెండేళ్ల డీఈడీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షలు రాసేందుకు అర్హత లభిస్తుంది. టెట్‌లో ప్రతిభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు. స్కూల్ టీచర్‌గా మంచి వేతనం, అనుభవనానికి తగిన పదోన్నతులు పొందే వీలుంది.
అర్హతలు
- ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
- వయసు: 17 ఏళ్ల వయసు నిండిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం
మొత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం మూడు పార్ట్‌లుగా ఉంటుంది. పార్ట్1 జనరల్ నాలెడ్జ్, టీచింగ్ అప్టిట్యూడ్ 10 ప్రశ్నలు–10 మార్కులకు; పార్ట్ 2 జనరల్ ఇంగ్లిష్ 10 ప్రశ్నలు–10 మార్కులు, జనరల్ తెలుగు 20 ప్రశ్నలు–20 మార్కులకు; పార్ట్ 3 మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు–20 మార్కులు, ఫిజికల్ సైన్స్ 10 ప్రశ్నలు–10 మార్కులు, బయలాజికల్ సైన్స్ 10 ప్రశ్నలు–10 మార్కులు, సోషల్ స్టడీస్ 20 ప్రశ్నలు–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
సిలబస్
- టీచింగ్ ఆప్టిట్యూడ్: టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి ఉపాధ్యాయ వృత్తిపట్ల అభ్యర్థులకు ఉన్న ఆసక్తి, అభిరుచి, సామర్థ్యాలను పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. మారుతున్న విద్యావిధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి రూపొందిస్తున్న పథకాలు, విద్యాహక్కు చట్టం, జాతీయ ప్రణాళిక చట్టం–2005 వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
- జనరల్ నాలెడ్జ్: జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలు, దేశాల రాజధానులు, మారిన పేర్లు, ఆయా దేశాల కరెన్సీలు, క్రీడలు, అవార్డులు, జనరల్ సైన్స్, అంటువ్యాధులు తదితర అంశాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. వీటికోసం ఎక్కువగా వార్తపత్రికలు చదవడం, టీవీల్లో ప్రసారమయ్యే వార్తలు, రాజ్యసభ టీవీ వంటివి అనుసరించడం మేలు చేస్తుంది. ముఖ్యమైన వాటిని నోట్ బుక్‌ల్లో ప్రత్యేకంగా రాసుకొని.. వాటిని ప్రతీరోజు ఒకసారి రివిజన్ చేసుకోవడం లాంటివి చేయాలి.
- జనరల్ ఇంగ్లిష్: ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్‌పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. పదో తరగతి స్థాయి గ్రామర్ అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్, టెన్సెస్, వాయిస్, వొకాబ్యులరీ, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ మొదలైన అంశాలపై పట్టుసాధించాలి.
- జనరల్ తెలుగు: మాతృభాషలో అభ్యర్థికి ఉన్న ప్రావీణ్యతను పరిశీలించే విధంగా ప్రశ్నలను అడుగుతారు. దీనికోసం ముఖ్యంగా 8,9,10 తరగతుల తెలుగు పాఠ్యాంశాలను పరిశీలించాలి. కవి పరిచయాలు, సం«ధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సులు, అర్థాలు, నానార్థాలు, పారిభాషిక పదాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, సామాన్య సంక్లిష్ట సంయుక్త వాక్యాలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు, ఇతి వృత్తాలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
- పార్ట్ 3లో... మ్యాథమెటిక్స్,ఫిజిక్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్టులకు సంబంధించి 8, 9, 10 తరగతి స్థాయిలో ఉన్న పాఠ్యాంశాలను ప్రిపేర్ కావాలి. ఈ విభాగంలో సిలబస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లోని ప్రాథమిక అంశాలపై∙పట్టు పెంచుకోవాలి.
ర్యాంకుల కేటాయింపు
డీఈఈసెట్‌లో ఓసీ, బీసీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి కనీస మార్కుల నిబంధన లేదు.
దరఖాస్తు ఫీజు
ఈ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అన్ని కేటగిరిల అభ్యర్థులు రూ.450ను దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చివరితేదీ: 08.04.2020
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 30.04.2020
- పరీక్ష తేదీ: 22.05.2020
- ఫలితాల వెల్లడి: 29.05.2020
- వెబ్‌సైట్: http://deecet.cdse.telangana.gov.in
ప్రిపరేషన్ ఇలా
- గతంలో అడిగిన ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ప్రశ్నలు అడిగిన తీరు తెన్నులను తెలుసుకోవాలి.
- ప్రిపరేషన్‌కు సంబంధించి పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టుగా నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి.
- ప్రతిరోజు పూర్తిచేసిన సబ్జెక్టును మరుసటి రోజు తప్పకుండా రివిజన్ చేసుకోవాలి.
- ప్రాక్టిస్, రివిజన్, రెస్ట్.. ఈ మూడు చాలా ముఖ్యమైనవి.