ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..

ఇంటర్‌లో బైపీసీ చదివే విద్యార్థుల ప్రధాన లక్ష్యం మెడిసిన్ (ఎంబీబీఎస్)లో చేరడం..! అందుబాటులో ఉన్న సీట్లు, పోటీ పడుతున్న విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాచిలర్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిద్వారా చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునే వీలుంది. బీహెచ్‌ఎంఎస్ నుంచి బీఎస్సీ(బీజెడ్‌సీ) వరకూ... అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ అవకాశాల వివరాలు ఇలా...
బీఏఎంఎస్
మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులో ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఉన్నత విద్య పరంగా ఎండీ ఆయుర్వేద, ఎంఎస్ ఆయుర్వేద కోర్సుల్లో చేరొచ్చు. అంతేకాకుండా ఎంబీబీఎస్‌లోని జనరల్ మెడిసిన్‌కు సరితూగే విధంగా కాయ చికిత్స కోర్సు.. జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర కోర్సు పీజీ స్పెషలైజేషన్లుగా ఉండటం విశేషం.

యునానీ(బీయూఎంఎస్)
ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో వైద్య సంబంధ కోర్సు.. బీయూఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీయూఎంఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే ఎండీ, ఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బీహెచ్‌ఎంఎస్
బ్యాచిలర్ ఆఫ్ హొమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్).. గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్ కరికులంలో ఉండే అనాటమీ, ఫిజియాలజీలను బోధిస్తారు. దీన్ని పూర్తి చేసిన వారు ఉన్నత విద్య పరంగా మెటీరియా మెడికా, హొమియోపతిక్ ఫిలాసఫీ తదితర డిమాండింగ్ స్పెషలైజేషన్లలో చేరొచ్చు. బీహెచ్‌ఎంఎస్ అభ్యర్థులకు భవిష్యత్తులో కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా ఉండదనే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ల పరిధిలో పలు కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్ కోర్సు అందుబాటులో ఉంది.

బీఎన్‌వైఎస్
బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలోప్రత్యామ్నాయంగా నిలుస్తున్న మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ యోగిక్ సెన్సైస్(బీఎన్‌వైఎస్). ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా తదితర విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది.

సీట్ల భర్తీ
ఆయుష్ (ఆయుర్వేద, హొమియోపతి, యునానీ, నేచురోపతి అండ్ యోగా, సిద్ధ మెడిసిన్) కోర్సుల ఔత్సాహిక విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్- యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. నీట్ స్కోర్ ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్ యూహెచ్‌ఎస్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతాయి.
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్స్: ntruhs.ap.in, knruhs.telangana.gov.in

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మరో చక్కటి ప్రత్యామ్నాయ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సును పూర్తి చేస్తే ఫిజియోథెరపిస్ట్‌లుగా రాణించొచ్చు. స్వయం ఉపాధి అవకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఆర్థోపెడిక్ సర్జరీలు జరిగిన వారికి ఫిజియోథెరపీ తప్పనిసరిగా మారుతోంది. కాబట్టి ఫిజియోథెరపీ కోర్సు చేసిన వారికి ఉపాధి పరంగా ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు.

పారా మెడికల్ కోర్సులు
బైపీసీ విద్యార్థులకు సత్వర ఉపాధి అందించేవి.. పారా మెడికల్ కోర్సులు. వీటిలో బీఎస్సీ(నర్సింగ్),న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పెర్‌ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వ్యాస్కులర్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ డిగ్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు ముఖ్యమైనవి. వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్స్‌లో వివిధ విభాగాల్లో టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి పారామెడికల్ కోర్సులను భర్తీ చేస్తాయి.

బీవీఎస్‌సీ
డాక్టర్ హొదాతో పాటు కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అందుకునేందుకు బైపీసీ విద్యార్థుల ముందున్న మరో ప్రత్యేక ప్రత్యామ్నాయ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్‌సీ). జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో నైపుణ్యం అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేస్తే పౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆస్పత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపక కేంద్రాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్స్: www.tsvu.nic.in, www.SVVU.edu.in

అగ్రికల్చర్ బీఎస్సీ
ఇది వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం తదితర నైపుణ్యాలను అందించే కోర్సు. దీన్ని పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకుల్లో సైతం రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ల విభాగంలో కొలువులు అందిపుచ్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.angrau.ac.in, pjtsau.ac.in

హార్టికల్చర్ సైన్స్
పర్యావరణంపై ఆసక్తి కలిగిన వారికి సరితూగే కోర్సు.. బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వారికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ సహా పలు బ్యాంకుల్లో అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లకు కొలువులు దక్కుతాయి. ఉన్నత విద్య పరంగా పీజీ స్థాయిలో ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్, ప్లాంటేషన్ అండ్ స్పైస్ క్రాప్ ప్రత్యేక అంశాలుగా ఎమ్మెస్సీ చదివేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.drysrhu.edu.in, skltshu.ac.in

బీఎఫ్‌ఎస్‌సీ
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సంక్షిప్తంగా.. బీఎఫ్‌ఎస్‌సీ. ఇది చేపల పెంపకం, సేకరణకు సంబంధించి ప్రత్యేక పద్ధతులు అనుసరించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సు. దీన్ని పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.svvu.edu.in, tsvu.nic.in

బీటెక్ - ఫుడ్ టెక్నాలజీ
ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా బెస్ట్‌గా నిలుస్తున్న మరో కోర్సు.. బీటెక్-ఫుడ్ టెక్నాలజీ. ఇది ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు. దీన్ని పూర్తి చేయడం ద్వారా ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువుదీరొచ్చు.

బీఎస్సీ(సీఏబీఎం)
బీఎస్సీ(సీఏబీఎం).. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్. బైపీసీ విద్యార్థులకు కార్పొరేట్ కొలువులకు మార్గం వేసే కోర్సు ఇది. ఈ కోర్సు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అన్వయించడం, వాటిద్వారా లాభదాయకత పెరిగేలా చేయడానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ పొడక్షన్ కంపెనీల్లో మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

బీఎస్సీ అగ్రి-బయోటెక్
ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన మరో కోర్సు.. బీఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ. అగ్రి బయోటెక్‌గా పిలిచే ఈ కోర్సు ద్వారా టిష్యూ కల్చర్, జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ తదితర అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు.

బీఎస్సీ-న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్
బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా మంచి అవకాశాలను అందిస్తున్న మరో కోర్సు.. బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ ఫుడ్‌సైన్స్. ఆహార పదార్థాల నాణ్యతతోపాటు ఎక్కువ కాలం మన్నే విధంగా ప్రాసెసింగ్ నైపుణ్యాలను అందించే ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీస్, రీసెర్చ్ ల్యాబ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో, హొటల్స్‌లో డైటీషియన్స్ గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

బీఎస్సీ (బీజెడ్‌సీ)
బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు... బీఎస్సీ(బీజెడ్‌సీ). ప్రస్తుతం ఈ కోర్సులోనూ వినూత్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బయో టెక్నాలజీ, మైక్రోబయాలజీ తదితర కాంబినేషన్లతో బీజెడ్‌సీ గ్రూప్‌ను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

సీట్ల భర్తీ ఇలా..
వ్యవసాయ సంబంధ కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. ఎంసెట్(అగ్రికల్చర్ స్ట్రీమ్) ర్యాంకు ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల భర్తీ చేస్తాయి. సాధారణంగా ఈ ప్రక్రియ జూలై చివరి వారంలో ఉంటుంది.

ముఖ్యాంశాలు
  • ఆయుష్ కోర్సుల్లో సీట్ల భర్తీ - నీట్ స్కోర్ ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది.
  • పారామెడికల్ కోర్సుల్లోని సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఏపీలో 2019 నుంచి ఎంసెట్ (ఏ అండ్ ఎం స్ట్రీమ్) ర్యాంకు ఆధారంగా పారా మెడికల్ సీట్ల భర్తీ జరుగుతోంది.
  • వెటర్నరీ సీట్లకు సంబంధిత యూనివర్సిటీలు ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారు.
  • వ్యవసాయ సంబంధిత కోర్సులకు అగ్రికల్చర్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఎంసెట్ (ఏ అండ్ ఎం స్ట్రీమ్) ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది.
  • ఆయుష్ మినహా అన్ని కోర్సులకు ఎంసెట్(ఏ అండ్ ఎం స్ట్రీమ్)లో ర్యాంకు తప్పనిసరి.








































#Tags