యువతరానికి ‘స్మార్ట్’ జాబ్స్

మొబైల్ ఎకానమీ ఇండియా-2013 పేరిట అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య రూపొందించిన నివేదిక ప్రకారం 2020 నాటికి మొబైల్ ఫోన్ల రంగంలో 41 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాకుండా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ రంగం వాటా 400 బిలియన్ డాలర్ల మేర ఉండనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల పరిశ్రమ అపార అవకాశాలకు వేదిక కానుంది. ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న అభ్యర్థులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల రంగంలో ఉద్యోగావకాశాలపై ఫోకస్..

ఒకప్పుడు మొబైల్ అంటే మాటల ముచ్చట్లకే! కానీ, ఇప్పుడది హస్తాభరణమై భాసిల్లుతోంది. అందుకే నిన్నామొన్నటి వరకు మొరటుగా ఉన్న మొబైల్ ఇప్పుడు ‘స్మార్ట్ ఫోన్’గా ముస్తాబై యువత మనసుల్లో కొలువుదీరింది. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు చాలా వరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ నైపుణ్యాలను సొంతం చేసుకున్న యువతకు ఉన్నత కొలువులు ఆహ్వానం పలుకుతున్నాయి. అంతేకాకుండా ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, నోట్ బుక్స్, ఐప్యాడ్ వంటి గాడ్జెట్స్ వినియోగం పెరగడంతో వాటిల్లో ఉపయోగించే అప్లికేషన్స్‌ను రూపొందించడానికి అవసరమైన మానవవనరుల అవసరం పెరుగుతోంది. దీంతో గాడ్జెట్ ప్రపంచం కొలువుల ఖజానాగా మారుతోంది.

ఎవరికివారు తమ వ్యక్తిగత, ఉద్యోగ అవసరాలకు తగ్గట్లు వివిధ ఆపరేటింగ్ సిస్టిమ్స్ (ఓఎస్) ఆధారంగా పనిచేసే ఫోన్లను వాడుతున్నారు. ఈ అప్లికేషన్స్‌ను ఎక్కువ మంది వినియోగించే ఫ్లాట్‌ఫామ్స్ (ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్, బ్లాక్‌బెర్రీ మొదలైన) ద్వారా మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇటీవల బ్లాక్‌బెర్రీ మెసెంజర్ (బీబీఎం)ను యాప్‌ను ప్రారంభించిన ఒక్కరోజులోనే కోటికిపైగా డౌన్‌లోడ్‌లు జరిగాయని కెనడాకు చెందిన బ్లాక్‌బెర్రీ తెలిపింది. ఈ యాప్ అమెరికాతో సహా మొత్తం 75 దేశాల్లో మొదటిస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మొబైల్ కంపెనీలన్నీ వినియోగదారులను ఆకట్టుకునేలా తాజా అప్లికేషన్స్‌ను రూపొందించే నిష్ణాతుల కోసం జల్లెడ పడుతున్నాయి. మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు తాజాగా మంచి ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. ఈ మొబైల్ అప్లికేషన్స్‌ను సాధారణ వినియోగదారులకు మాత్రమే కాకుండా బిజినెస్, ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా, రైల్వే, బ్యాంకులు, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, సోషల్ మీడియా, మార్కెటింగ్, యానిమేషన్ అండ్ గేమింగ్ వంటివాటి కోసం కూడా రూపొందిస్తున్నారు.

మొబైల్ ఫోన్ల పరిశ్రమల్లో వివిధ ఉద్యోగావకాశాలు:
  • మొబైల్ ఫోన్ సిస్టమ్ ఇంజనీర్
  • ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, ఐఫోన్, విండోస్ మొబైల్ అప్లికేషన్స్ డెవలపర్
  • గేమ్ డెవలపర్
  • మొబైల్ ఆర్కిటెక్ట్/మొబైల్ సాఫ్ట్‌వేర్ ఫ్లాట్‌ఫాం ఆర్కిటెక్ట్
  • మొబైల్ టెక్నీషియన్స్
  • మొబైల్ ప్లాంట్ ఎక్విప్‌మెంట్ మెకానిక్
  • మొబైల్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్
  • మొబైల్ ఫోన్ వెరిఫికేషన్ మేనేజర్
  • మొబైల్ ఆర్కిటెక్ట్
  • కస్టమర్‌కేర్ ఆఫీసర్/కాల్ సెంటర్స్
  • మార్కెటింగ్ మేనేజర్
  • టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్
  • కేపీఐ (కీ పెర్‌ఫార్మెన్స్ ఇండికేర్) ఇంజనీర్
  • జూనియర్/సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ - 3జీ
  • ఎంబడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీఎస్‌ఎం/జీపీఆర్‌ఎస్
  • నెట్‌వర్క్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్/టెక్నికల్ ఎనలిస్ట్
ప్రవేశం ఇలా:
మొబైల్ ఫోన్ల రంగంలో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలంటే బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ఈసీఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (మొబైల్ టెక్నాలజీ సబ్జెక్టుగా లేదా స్పెషలైజేషన్‌గా); ఎంసీఏ వంటి కోర్సులను అభ్యసించాలి. ఈ కోర్సులే కాకుండా ఇతర డిగ్రీ కోర్సులు చేసినవారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే. అయితే సైన్స్, ఇంజనీరింగ్‌లపై పరిజ్ఞానం ఉండాలి. డిగ్రీ తర్వాత మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రత్యేక కోర్సులను చదవాలి. ఈ కోర్సులను అనేక ప్రైవేటు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్లు అందిస్తున్నాయి. కోర్సుల కనీస వ్యవధి దాదాపు రెండు/మూడు నెలలు ఉంటుంది. కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో కోర్సులు అందిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో కోర్సులు చేసేకంటే ప్రత్యక్షంగా ఇన్‌స్టిట్యూట్‌లో చేయడం మేలు. ఎందుకంటే ప్రాక్టికల్స్ చేసే వీలుండటంతోపాటు ఫ్యాకల్టీని అడిగి సందేహాల నివృత్తి చేసుకోవచ్చు.

మనదేశంలో:
మనదేశంలో ఎక్కువ (దాదాపు 65 శాతం) ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సును దేశవ్యాప్తంగా వివిధ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు అందిస్తున్నాయి. కోర్సు వ్యవధి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది. కోర్సులో భాగంగా హిస్టరీ ఆఫ్ ఆండ్రాయిడ్ నుంచి పబ్లిషింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. అవి..
  • అప్లికేషన్ ఫండమెంటల్స్
  • కాంపోనెంట్స్ అండ్ లే అవుట్స్
  • స్టైల్ అండ్ థీమ్స్
  • మల్టీమీడియా సపోర్టెడ్
  • క్రియేటింగ్ డైలాగ్స్
  • యాడింగ్ మెనూస్ అండ్ ఐకాన్స్
  • బేసిక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ అడ్వాన్స్‌డ్ యూజర్ ఇంటర్‌ఫేస్
  • యానిమేషన్ గ్రాఫిక్స్
  • నెట్‌వర్కింగ్, ఆండ్రాయిడ్ సర్వీసెస్
  • లొకేషన్ బేస్డ్ సర్వీసెస్
  • వై-ఫై, టెలిఫోనీ, బ్లూటూత్ మొదలైన అంశాలపై శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా థియరీ, ప్రాక్టికల్స్ ఉంటాయి. తరగతి గదిలో చెప్పిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా అన్వయించి అభ్యర్థులు నైపుణ్యం సాధించాలి.
ఐఫోన్ యాప్స్: కోర్సు కరిక్యులంలోని కొన్ని అంశాలు..
  • ఐఫోన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ (ఎస్‌డీకే)
  • ఇంట్రడక్షన్ టు ఎక్స్‌కోడ్
  • ఇంట్రడక్షన్ టు యూఆర్‌ఎల్ లోడింగ్ సిస్టమ్
  • ఇంటిగ్రేట్ ఐఫోన్ యాప్ విత్ అడ్రస్ బుక్, మ్యాప్
  • యూఐ నేవిగేషన్ బార్, యూఐ నేవిగేషన్ కంట్రోలర్
  • వెబ్ సర్వీసెస్
  • మల్టీమీడియా
  • స్క్రీన్ ఓరియెంటేషన్స్
  • వ్యూ కంట్రోలర్స్
  • ప్రాపర్టీ లిస్ట్ టైప్స్ అండ్ ఆబ్జెక్ట్స్
విండోస్ ఫోన్-8 యాప్స్ డెవలప్‌మెంట్:
ఆరు మాడ్యూల్స్‌గా ఉండే కోర్సులోని అంశాలు
  • విండోస్ ఫోన్ 8 ఫ్లాట్‌ఫాం
  • విండోస్ ఫోన్ 8 డెవలప్‌మెంట్ టూల్స్
  • డౌన్‌లోడింగ్ అండ్ ఇన్‌స్టాల్ ది టూల్స్
  • విండోస్ ఫోన్ 8 ఎస్‌డీకే ఓవర్‌వ్యూ
  • అప్లికేషన్ లైఫ్ సైకిల్
  • అప్లికేషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్
  • ఫ్రేమ్స్ అండ్ పేజ్ స్ట్రక్చర్
  • సిస్టమ్ ట్రే అండ్ నేవిగేషన్
  • డిజైన్ విండోస్ ఫోన్ 8 కంట్రోల్ యూసేజ్
  • యూజింగ్ సిస్టమ్ థీమ్స్ అండ్ స్క్రీన్ ఓరియెంటేషన్
  • లొకేషన్ అవేర్‌నెస్ సిస్టమ్ సెట్టింగ్
అన్నిరంగాలకూ విస్తరిస్తోంది
కమ్యూనికేషన్‌కే పరిమితమైన మొబైల్ ఇప్పుడు వ్యాపార లావాదేవీల్లో కీలకంగా మారింది. రిటైల్ మార్కెటింగ్‌లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమవుతోంది. గతంలో కేవలం కార్పొరేట్ సెక్టార్‌లో మాత్రమే మొబైల్ టెక్నాలజీను విరివిగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్, ఎం కామర్స్, హోటల్ తదితర చోట్ల మొబైల్ కీలకమవుతుంది. రాబోయే పదేళ్లలో మొబైల్ రూపకల్పనలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, యాప్స్‌తో వ్యాపారాత్మకంగా మొబైల్ ఇండస్ట్రీ పురోగతిలో ఉంది. దీనికి తగినట్టుగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే దీనికి కావాల్సిందల్లా టెక్నాలజీ పట్ల ఆసక్తి, సృజనాత్మకత. సాధారణంగా ఈ ఇండస్ట్రీలో స్థిరపడాలంటే ‘జావా’ కోర్సు చేస్తే సరిపోతుంది. కానీ.. మొబైల్ అప్లికేషన్స్ పెరుగుతున్న కొద్దీ టెక్నాలజీను లోతుగా స్టడీ చేయాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటుండాలి. జీపీఆర్‌ఎస్, వెహికల్ ట్రాకింగ్‌కు డిమాండ్ పెరుగుతుంది. దీనికి హై లెవల్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, ఐ.ఓ.యస్ వాటికి ప్రత్యేకమైన కోర్సులున్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువతీ, యువకులు సీరియస్‌గా మనసులగ్నం చేసి కోర్సులు చేస్తే ప్రయోజనం ఉంటుంది. సేవారంగంలో మొబైల్ అప్లికేషన్స్ మరింత విస్తరిస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలం. ఆయా కంపెనీలు వాటి స్థాయికి అనుగుణంగా వేతనాలు అందజేస్తున్నాయి. జాబ్‌లో చేరిన మొదటి సంవత్సరం నెలకు రూ.8వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంటే.. మరుసటి ఏడాది నుంచి రెట్టింపు వేతనం అందుకునే అవకాశం ఉంది.
-నాయుడు ఏ విన్నకోట,
ప్రొడక్ట్ మేనేజర్, యాప్ థాట్స్

కావల్సిన నైపుణ్యాలు:
  • సీ, సీ++లపై పట్టు ఉండాలి.
  • హెచ్‌టీఎంఎల్ 5పై లోతైన, విశ్లేషణాత్మకమైన పరిజ్ఞానం అవసరం.
  • జావా స్క్రిప్ట్‌పై పట్టు తప్పనిసరి.
  • కొత్త అప్లికేషన్‌‌సను అభివృద్ధి చేయగల నైపుణ్యం ఉండాలి.
  • మిగిలినవారికంటే ముందంజలో ఉండాలంటే సృజనాత్మకత తప్పనిసరి.
  • వివిధ రకాల మొబైల్ అప్లికేషన్స్ కోసం అల్‌గారిథమ్‌ను అభివృద్ధి చేయడంతోపాటు, విశ్లేషించగల సామర్థ్యం ఉండాలి.
  • ఆండ్రాయిడ్ ఎస్‌డీకేలపై ప్రాథమిక అవగాహన అవసరం.
  • బ్లూటూత్, వైర్‌లెస్ డేటా లింక్ లేయర్, వై-ఫై, వైమాక్స్‌లపై కనీస అవగాహన ఉండాలి.
  • మొబైల్ నెట్‌వర్క్స్ ప్రొటోకాల్స్, జీఎస్‌ఎం, 2.5జీ, 3జీలపై రీసెర్చ్ ఓరియెంటేషన్ ఉండాలి.
  • మొబైల్ సెక్యూరిటీ, సమాచార భద్రతలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను గుర్తించి, పరిష్కరించగలగాలి.
కెరీర్:
మొబైల్ సంబంధిత కోర్సులు నేర్చుకున్నవారికి మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. విదేశీ కంపెనీలతోపాటు స్వదేశీ కంపెనీలు కూడా దాదాపు నెలకో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఆకట్టుకునే రూపం, కొత్త ఫీచర్లతో వీటిని రూపొందించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. డిమాండ్‌కు తగిన విధంగా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు లేరు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు నేర్చుకుంటే చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. సృజనాత్మకమైన ఆలోచనలతో అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేస్తే సొంతంగా కంపెనీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

వేతనాలు:
అప్లికేషన్స్ డెవలపర్‌కు ప్రారంభంలో ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వేతనాలు లభిస్తాయి. పనితీరు, అనుభవం ఆధారంగా నెలకు రూ.50 వేలకుపైగా పొందొచ్చు. ఇతర విభాగాల్లో పనిచేసేవారు కూడా ప్రారంభంలో ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పొందొచ్చు.

యాప్స్‌లో రకాలు:
అవకాశాలు ఎన్ని ఉన్నప్పటికీ అప్లికేషన్స్ డిజైన్స్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలోనే 60 శాతంపైగా ఉద్యోగావకాశాలున్నాయి. యాప్స్‌ను చూసే స్మార్ట్‌ఫోన్‌లను ఎంచుకునేవారెందరో. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల యాప్స్..
  • లైఫ్‌స్టైల్ యాప్స్
  • హెల్త్, మెడికల్ యాప్స్
  • గేమ్స్ యాప్స్
  • హెల్త్ అండ్ మెడికల్ యాప్స్
  • ట్రావెల్ యాప్స్
  • మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్
  • ఎడ్యుకేషన్ యాప్స్
  • ఈ-బుక్స్ పబ్లిషింగ్ యాప్స్
  • బిజినెన్ యాప్స్
  • మల్టీమీడియా యాప్స్
  • మ్యాప్స్ అండ్ నేవిగేషన్ యాప్స్
టాప్ రిక్రూటర్స్:
  • గూగుల్
  • బ్లాక్ బెర్రీ
  • హెచ్‌టీసీ
  • శామ్‌సంగ్
  • పానాసోనిక్
  • సోనీ ఎరిక్సన్
  • మైక్రోమ్యాక్స్
  • ఎల్‌జీ మొబైల్స్
  • కార్బన్ మొబైల్స్
  • ఆర్థిక సేవల సంస్థలు
  • నోకియా
  • వీడియోకాన్




















#Tags