ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఇంటర్వూ రోజు కోసం సిద్ధమవ్వండిలా..!

ప్రస్తుతం ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్‌ఆర్‌బీ)లో.. ఆఫీసర్స్ స్కేల్ 2,3 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

ఇందులో అగ్రికల్చర్ ఆఫీసర్స్, మార్కెటింగ్ ఆఫీసర్స్, ట్రెజరీ ఆఫీసర్స్, లా, చార్టర్డ్ అకౌంటెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు.. తమ అర్హతలను బట్టి ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకొని ఉంటారు. కాబట్టి, బ్యాంకింగ్ రంగంలో ఆయా విభాగాల పాత్రపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.

దుస్తులు హుందాగా..
ఇంటర్వ్యూ ప్యానల్ సభ్యులు ఎక్కువ మంది బ్యాంకింగ్ రంగానికి చెందినవారే ఉంటారు. అలాంటి అను భవజ్ఞులైన నిపుణులను మెప్పించాలంటే.. దుస్తుల నుంచి మొదలు సబ్జెక్టు పరిజ్ఞానం వరకూ.. ప్రతి అంశంపైనా దృష్టి పెట్టాలి. అనే క జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి ధరించే దుస్తులు మొదటి ముద్ర వేస్తాయి. కాబట్టి ఫార్మల్ దుస్తులు హుందాగా ఉండేలా ధరించడం చాలా ముఖ్యం. పురుష అభ్యర్థులు ప్యాంట్, షర్ట్, టైతో వెళ్లొచ్చు. యువతులు సంప్రదాయ, ఫార్మల్ దుస్తులు అంటే.. చుడిదార్, చీర వంటి వాటిల్లో హాజరుకావచ్చు. అలవాటు లేకుండా సూట్ ధరిస్తే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ రోజు కొత్త దుస్తులు వేసుకునే కంటే.. ముందే ఉతికి, ఇస్త్రీ చేసిన వాటినే ధరించడం ఉత్తమం.

ముందు రోజు..

  • ఇంటర్వ్యూ ముందురోజు రాత్రి త్వరగా నిద్రపోవడం మంచిది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా బోర్డు నుంచి పిలుపు వస్తుంది. ఒక్కోసారి ఇంటర్వ్యూ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ రోజున తాజాగా, శక్తివంతంగా ఉండటం చాలా ముఖ్యం.
  • అభ్యర్థులు సర్టిఫికెట్లు అన్నీ ఒకే ఫోల్డర్‌లో పెట్టుకొని ఇంటర్వ్యూకు తీసుకువెళ్లాలి. ఇంటర్వ్యూకు జరగడానికి ఒక గంట ముందే సర్టిఫికెట్ల పరిశీలన(వెరిఫికేషన్) ఉంటుంది. అందువల్ల, కాల్ లెటర్‌లో సూచించిన విధంగా అన్ని పత్రాలు, జిరాక్స్‌లతో సహా తీసుకెళ్లడం తప్పనిసరి.
  • వీలైతే ఒక రోజు ముందే ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి వెళ్లి రావడం మంచిది. ఇంటర్వ్యూకు ఆలస్యంగా వెళ్లడం సరి కాదు. అది బోర్డులో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముందే ఇంటర్వ్యూ జరిగే ప్రదే శాన్ని చూసినట్టయితే.. మరుసటిరోజు ఇంటర్వ్యూకు త్వరగా వేళ్లడంతోపాటు, ఆ ప్రదే శానికి మనసు అలవాటు పడి ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
  • అభ్యర్థి తన బయోడేటాలోని ఏ అంశాన్ని వదలకుండా పూర్తిగా చదవుకోవాలి. ఇంటర్వ్యూయర్లు బయోడేటాలో మీరు పేర్కొన్న అంశాల ఆధారంగానే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా వెళ్లాలి. ఇంటర్వ్యూ రోజుకు ముందు వరకు కరెంట్ అఫైర్స్, బిజినెస్, బ్యాంకింగ్ రంగ వార్తలను తెలుసుకోవాలి.

 

ఇంకా చదవండి: part 3: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఇంటర్వూ రోజు ఈ పనులు చేస్తే ఇబ్బందులు పడతారు..?
#Tags