Skill Loan Scheme: ‘స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌’ పేరుతో కొత్త పథకం.. ఆయా ట్రేడ్స్‌లో యువతకు శిక్షణ

కేంద్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోణంలో.. కొత్తగా స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ పథకాన్ని ప్రకటించింది.

ఈ పథకం ద్వారా.. రానున్న అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ)లను విస్తరించనున్నారు. ఈ క్రమంలో వేయి ఐటీఐలను అప్‌గ్రేడ్‌ చేసి ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్‌ను అందించేలా చర్యలు తీసుకోనున్నారు. దీని ద్వారా రానున్న అయిదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఆయా ట్రేడ్స్‌లో శిక్షణ ఇవ్వడమే కాకుండా.. వారు సంబంధిత విభాగంలో ఉద్యోగ సాధనలో ముందంజలో నిలిచేలా చర్యలు చేపట్టనున్నారు. 

ప్రస్తుతం ఎంఎస్‌డీఈ గణాంకాల ప్రకారం.. 135 ఐటీఐ ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్‌ అనుబంధ ట్రేడ్‌లు (ఎలక్ట్రిషియన్, ఫిట్టర్‌ తదితర) 60 ఉంటే.. మిగిలివని నాన్‌–టెక్నికల్‌ (ఫ్యాషన్‌ డిజైన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌తదితర) ట్రేడ్‌లు. తాజా స్కీమ్‌ ప్రకారం.. ప్రస్తుతమున్న ట్రేడ్‌లతోపాటు నూతన ట్రేడ్‌లను అదే విధంగా స్వల్పకాలిక శిక్షణను అందించే విధంగానూ చర్యలు తీసుకోనున్నారు.  

మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌..
యువతకు ఉపాధి కల్పించే విషయంలో ఐటీఐలను విస్తరించడమే కాకుండా.. వృత్తి విద్య కోర్సులు చదివే వారికి రుణ సదుపాయం అందించే విధంగా.. మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌ను కూడా ప్రవేశ పెట్టారు. ఈ స్కీమ్‌ విధానాల ప్రకా­రం.. వృత్తి విద్య, ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు రూ.7.5 లక్షల వరకు రుణం అందిస్తారు. దీని ద్వారా ఏడాదికి 25 వేల మంది లబ్ధి పొందుతారని అంచనా వేశారు.  
 
2015లో స్కిల్‌ లోన్‌ స్కీమ్‌ పేరుతో..
వాస్తవానికి 2015లోనే స్కిల్‌ లోన్‌ స్కీమ్‌ పేరుతో ఒక పథకాన్ని రూపొందించారు. నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం వృత్తి విద్యకు సంబంధించి సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ చదువుతున్న వారికి వీటిని అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తం రూ.1.5 లక్షలే ఉండగా.. తాజాగా ప్రతిపాదించిన మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీమ్‌లో ఈ మొత్తాన్ని రూ.7.5 లక్షలకు పెంచారు.  

Fertilizer Subsidies: సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు.. మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!

ప్రాక్టికల్‌ నైపుణ్యాలు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోణంలో కొత్త పథకాన్ని రూపొందించడం, రుణ సదుపాయం, ఇంటర్న్‌షిప్‌ సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడాన్ని.. విద్యార్థులకు, యువతకు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్న్‌షిప్‌ పథకం విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 

గ్రామీణ స్థాయి నుంచే స్కిల్‌ డెవలప్‌మెంట్‌
స్కీమ్‌ ఫర్‌ స్కిల్లింగ్‌.. ప్రధాన ఉద్దేశం గ్రామీణ స్థాయి నుంచే విద్యార్థులు, యువతకు స్కిల్‌ డెవ­లప్‌మెంట్‌ కల్పించడం. ఇందుకోసం హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో ఐటీఐలు శిక్షణ కార్యక్రమాలు అందించనున్నాయి. అంటే.. ఐటీఐలు లేని ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమకు సమీపంలోని ఐటీఐలలో తమకు నచ్చిన ట్రేడ్‌/వృత్తులలో శిక్షణ పొందొచ్చు. వాటిలో నైపుణ్యం పొంది భవిష్యత్తులో జాబ్‌ మార్కెట్‌లో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవడం, అదే విధంగా స్వయం ఉపాధి కోణంలోనూ ముందంజలో నిలిచే ఆస్కారం లభించనుంది.  

బడ్జెట్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్యాంశాలు  
➤ 20 లక్షల మంది యువత లక్ష్యంగా స్కిల్‌ స్కీమ్‌ 
➤ అయిదేళ్లలో వేయి ఐటీఐల ఏర్పాటు 
➤ ఇంటర్న్‌షిప్‌ ఔత్సాహికులకు ఏడాదికి రూ.60 వేల ప్రోత్సాహకం 
➤ అయిదేళ్లలో కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ ప్రోత్సాహకాలు 
➤ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు  

Foreign Investments: గడిచిన ఐదేళ్లలో ఏపీలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు

#Tags