Skip to main content

Foreign Investments: గడిచిన ఐదేళ్లలో ఏపీలోకి రూ.7,371 కోట్ల విదేశీ పెట్టుబడులు

కోవిడ్‌ మహమ్మారితో రెండేళ్లు ప్రపంచం స్థంభించిపోయినప్పటికీ గడిచిన ఐదేళ్లలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గణనీయమైన సంఖ్యలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల)ను సాధించింది.
Investments by International Organizations in the Andhra Pradesh in the Last Five Years

2019 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి మధ్య కాలంలో రాష్ట్రంలోకి రూ.7,371.68 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. 

పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయ కంపెనీలు..
ఈ ఐదేళ్లలో వివిధ దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయి. జపాన్‌కు చెందిన యకహోమా, టోరో, దైకిన్, యూరోప్‌కు చెందిన పెట్రోగ్యాస్, కొరియాకు చెందిన ఎల్‌జీ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి. హిల్‌టాప్‌ సెజ్‌ (అడిదాస్‌), మాండలీజ్‌ చాక్లెట్స్‌ వంటి సంస్థలు భారీగా విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయి. 

వీటితోపాటు జర్మనీకి చెందిన పెప్పర్‌ మోషన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్‌ పెట్టడానికి ముందుకొచ్చింది. వాస్తవ రూపందాల్చిన పెట్టుబడులు, కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోకి రూ.35,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

ముందంజలో విశాఖ, నెల్లూరు జిల్లాలు
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ, నెల్లూరు జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఈ ఏడాది మొద‌టి మూడు నెలల్లో రాష్ట్రంలోకి రూ.64.49 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ పేర్కొంది. ఇందులో విశాఖ జిల్లాకు రూ.39.91 కోట్లు రాగా, నెల్లూరు జిల్లాకు 19.29 కోట్లు వచ్చాయని, మిగిలిన మొత్తం అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. 

2023–24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే రాష్ట్రంలోకి రూ.764.68 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్, వియత్నాం, అబుదాబీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 30 Jul 2024 09:38AM

Photo Stories