Inspirational Success Story : నేను అంధురాలిని... రోజు 4 కి.మీ వెళ్లివస్తూ చదివా.. చివరికి గ్రూప్-4 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
అడ్డంకులను అధిగమిస్తూ ఆత్మస్థైర్యంతో చదివి టీఎస్‌పీఎస్సీ గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికైంది. లోకాన్ని చూడలేకపోయినా.. తన లక్ష్యాన్ని మాత్రం చేరింది. మండలంలోని చీమలవారిగూడెంకు చెందిన అంధురాలు మద్దెబోయిన మానస యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మద్దెబోయిన మానస సక్సెస్ జర్నీ మీకోసం...
కుటుంబ నేపథ్యం :
చీమలవారిగూడెంకు చెందిన రైతు మద్దెబోయిన వెంకటనర్సయ్య–కళావతి దంపతులకు ఇద్దరు సంతానం. కుమారుడు మల్లేష్, కుమార్తె మానస ఇద్దరూ అంధత్వంతో జన్మించారు. అయినా పిల్లలను భారంగా భావించకుండా మూడెకరాల్లోనే వ్యవసాయం చేస్తూ, కూలి పనులకు వెళ్తూ చదివించారు. వీరిలో మల్లేష్ ఎంఏ, బీఈడీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఎడ్యుకేషన్ :
మానస 5వ తరగతి వరకు స్వగ్రామమైన చీమలవారిగూడెంలోనే చదివింది. ఆతర్వాత 6వ తరగతి నుంచి 10వతరగతి వరకు కారేపల్లి హైస్కూల్‌లో, ఇంటర్ సీఈసీ కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివింది.
రోజు 4 కిలోమీటర్లు నడిచి...
అయితే, గ్రామం నుంచి కారేపల్లికి నాలుగు కి.మీ. మేర సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు కూడా నడిచేవి కావు. అయినా స్నేహితురాళ్ల సాయంతో కాలినడకన వెళ్లివచ్చేది. కొన్నాళ్లకు చీమలవారిగూడెం–కారేపల్లి మధ్య తారురోడ్డు నిర్మాణం జరగడంతో ఆటోలు నడవటం మొదలైంది. దీంతో ఆటోలో వెళ్తూ కారేపల్లి వికాస్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.
ఇప్పటికే బ్యాంక్ జాబ్.. మళ్లీ ఇప్పుడు గ్రూప్-4 ఉద్యోగం..
తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలవారిగూడెంకు చెందిన అంధ విద్యార్థిని మద్దెబోయిన మానస తాజాగా విడుదలైన గ్రూప్–4 ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగంకు ఎంపికైంది.
ఖమ్మంలోని ఐడీసీఐ బ్యాంకు(ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తూనే ఆమె గ్రూప్స్‌కు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేసిన మానస సహాయకురాలి చేయూతతో పరీక్ష రాసింది. ఈ క్రమాన పరీక్షలో ప్రతిభ కనబరిచి అంధుల కోటాలో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికవడం విశేషం.
సొంతంగా చదివి..
ఇంటి వద్దే సొంతంగా ప్రిపేర్ అయి 2022లో ఐడీసీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపికైన మానస తన ప్రయత్నాలు మానకుండా ఇప్పుడు గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికవడంతో పలువురు అభినందిస్తున్నారు.