Intermediate Exams Fee: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
అమరావతి: మార్చి ఒకటో తేదీనుంచి జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ (Tatkal Scheme) కింద అవకాశం కల్పించారు. అభ్యర్థులు రూ.3 వేల ఆలస్య రుసుంతో మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
జనవరి నుంచి 1,48,923 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 475 కాలేజీల్లో 398 కాలేజీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు అప్పగించారు. మరో 77 కాలేజీలకు ఎన్‌జీవోల ద్వారా భోజనం సరఫరా చేయనున్నారు.
ఇదీ చదవండి: గురుకులాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన వివరాలు ఇవే..!
రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.100 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షాభియాన్ (పీఎం–ఉష)లో భాగంగా దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించింది. వర్సిటీలకు అవసరమైన ల్యాబ్స్, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత విద్యాసంవత్సరం (2023)లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది.
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు శిక్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ)లకు ఒక్కరోజు శిక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 45,124 పాఠశాలలకు సంబంధించి జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలోనూ, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలోనూ, 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలోనూ శిక్షణ నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు డీఈవోలను ఆదేశించారు. కాగా, జిల్లా స్థాయిలో 3,765 మందికి, మండల స్థాయిలో 93,643 మంది శిక్షణకు గానూ రూ.1,92,80,070 నిధులు మంజూరు చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్ పదోన్నతులు
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్యానల్ సంవత్సరానికి బోధనేతర సిబ్బందికి 10 శాతం కోటా కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జేఎల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆర్జేడీలను ఆదేశించారు.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు. వీటిపై ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి తుది సీనియారిటీ జాబితాను పంపించాలన్నారు. కాగా, ఇదే కేటగిరీ కింద ఇటీవల 24 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు.