Inter Exams 2024: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

అనంతపురం అర్బన్‌: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు 41,556 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఎథిక్స్‌ పరీక్షలు 143 జూనియర్‌ కళాశాలల్లో శుక్ర, శనివారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతాయన్నారు. ఈనెల 5 నుంచి 20 వరకూ 20 కేంద్రాల్లో ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్స్‌, ఈ నెల 11 నుంచి 20 వరకూ జనరల్‌ విద్యార్థులకు 70 కేంద్రాల్లో ప్రాక్టికల్స్‌ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.

చదవండి: AP Inter 1st Year Study Material

58 కేంద్రాల్లో థియరీ పరీక్షలు
జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాల్లో ఇంటర్‌ థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు 24,446 మంది, రెండో సంవత్సరం పరీక్షకు 17,110 మంది విద్యార్థులు మొత్తంగా 41,556 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. వైద్య శిబిరం నిర్వహించాలన్నారు. వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చదవండి: AP Inter 2nd Year Study Material

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
పరీక్షల నేపథ్యంలో అనంతపురం ప్రాంతీయ పర్యవేక్షణ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ (నం: 08554– 274256) ఏర్పాటు చేశామని ఇంటర్‌ పరీక్షల కన్వీనర్‌, డీవీఈఓ వెంకటరమణ నాయక్‌ తెలిపారు. విద్యార్థులు సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా హాల్‌టికెట్‌ మంజూరు చేయాలన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షల కోసం ప్రత్యేక రుసుం వసూలు చేయరాదన్నారు. ఎవరైనా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఈఓ నాగరాజు, డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, కార్మిక శాఖ డీసీఓ లక్ష్మి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

#Tags