AP EAPCET -2024 : ఏపీ ఈఏఎమ్‌సెట్‌–2024 రెండో విడత ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ అంతంత మాత్రమే..

AP EAPCET -2024 : ఏపీ ఈఏఎమ్‌సెట్‌–2024 రెండో విడత ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ అంతంత మాత్రమే..

తిరుపతి  : జిల్లాలో ఏపీ ఈఏఎమ్‌సెట్‌–2024 రెండో విడత ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే సుమారు 90 శాతం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వ, డీమ్డ్‌, అటానమస్‌ కళాశాలల్లో మాత్రం దాదాపు అన్ని కోర్సుల్లో అడ్మిషన్లు 80 శాతం పూర్తయ్యాయి. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీఈసీ, ఈసీఈ, ఈఈఈ కోర్సులు మినహా మిగిలి కోర్సుల్లో సింగిల్‌ డిజిట్‌ అడ్మిషన్లకే పరిమితం కావడం గమనార్హం. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల తీరుతెన్నులపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో ప్రభుత్వ, డీమ్డ్‌, అటానమస్‌, ప్రైవేటు కళాశాలల్లో ఈ ఏడాది పెంచిన సీట్లుతో కలిపి 34,355 సీట్లు ఉన్నాయి. ఇందులో తొలివిడతలో 23 వేల సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడత శనివారం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి 7,340 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. మిగిలిన 4045 సీట్లు ప్రైవేటు కళాశాలల్లో ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

గతం కంటే 15 శాతం తగ్గిన అడ్మిషన్లు

జిల్లాలో గతం కంటే సుమారు 15 శాతం ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు తగ్గినట్టు తెలుస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, తల్లిదండ్రులు పేరొందిన కళాశాలల వైపే మొగ్గు చూపుతూ ఆప్షన్లను ఎంపిక చేసుకున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికలోనూ ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులు, క్యాంపస్‌ డ్రైవ్‌లలో ఉద్యోగ అవకాశాల కల్పించే సంస్థల వైపు మొగ్గు చూపినట్లు మొదటి, రెండో విడత అడ్మిషన్ల సరళిని బట్టి స్పష్టమవుతోంది. జిల్లాలోని ఆరు ప్రైవేటు కళాశాలల్లో సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ సింగిల్‌ డిజిట్‌గా ఉండడం చూస్తుంటే ఈ ఏడాది భారీ ఎత్తున సీట్లు ఖాళీగా ఉండనున్నాయి.

ఎస్వీయూలో సివిల్‌, కెమికల్‌కు డిమాండ్‌

జిల్లాలో పద్మావతి మహిళా వర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ తదితర ప్రభుత్వ కళాశాలల్లో మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియలో 80 శాతం వరకు సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లకు భారీ ఎత్తున డిమాండ్‌ పెరిగింది. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియలోనే దాదాపు 96శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. వర్సిటీలో సీఈసీ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 396 సీట్లకు గాను 236సీట్లు మొదటి దశలో భర్తీ అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియలో వందశాతం సీట్లు భర్తీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:  Nikita Ketawat: హెడ్‌కానిస్టేబుల్‌ కుమార్తెకు ఆరు ఉద్యోగాలు

ముగిసిన ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ

తిరుపతి సిటీ: ఏపీ ఈఏఎంసెట్‌–2024 ఇంజినీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఎస్వీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో అన్ని బ్రాంచ్‌లకు కలిపి 396 సీట్లు ఉండగా 366 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో సివిల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లలో దాదాపు అన్ని సీట్లు భర్తీకాగా, సీఈసీ, ఈఈఈలో మాత్రం ఒక్కో బ్రాంచ్‌లో 66 సీట్లకు గాను 52 సీట్లు మాత్రమే భర్తీ కావడం విశేషం. మిగిలిన 30 సీట్లు వచ్చే ఏడాది ఈసెట్‌ ద్వారా డిప్లొమో విద్యార్థులకు లేటరల్‌ ఎంట్రీలో భాగంగా భర్తీ చేయనున్నారు. అలాగే తిరుపతి జిల్లాలో 20కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 34,355సీట్లకు గాను 31,287 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 3,068 సీట్లు మిగిలిపోయినట్లు సమాచారం. ఇందులో పేరొందిన వర్సిటీలు, డీమ్డ్‌, అటానమస్‌ కళాశాలల్లో దాదాపు పూర్తి స్థాయిలో సీట్లు భర్తీకాగా, కొన్ని ప్రైవేటు కళాశాలల్లో మాత్రం భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే సుమారు 15 శాతం అడ్మిషన్లు తగ్గినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

#Tags