10th Class Results: ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన సంస్కరణల ఫలాలు పదో తరగతి ఫలితాల్లో మరోసారి ప్రస్ఫుటించాయి.

ఒకప్పుడు కార్పొరేట్‌ విద్యా రంగానికే పరిమితమైన అత్యుత్తమ ఫలితాలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్‌ టీచర్లు, బైజూస్‌ కంటెంట్‌ ట్యాబ్‌లు, బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లతో అందించిన డిజిటల్‌ బోధన ఫలాలు టెన్త్‌ ఉత్తీర్ణతలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పదో తరగతి ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే 14.43 శాతం అధిక ఉత్తీర్ణతతో విద్యార్థులు సత్తాచాటారు. 2023–24 పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6,16,615 మంది విద్యార్థులు హాజరు కాగా 5,34,574 (86 69 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతలో మరోసారి బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలురు 84.32 శాతం పాసవగా బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

చదవండి: AP 10th Class Results 2024 - Available now

వంద శాతం ఉత్తీర్ణత పొందిన పాఠశాలలు గతేడాది 933 ఉండగా, ఈ ఏడాది ఏకంగా 2,803కు పెరిగాయి. 114 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 590కిపైగా మార్కులు సాధించారు. 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 18 వేల మంది వరకు ఉండటం విశేషం. సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల సంఖ్య 38 నుంచి 17కు తగ్గిపోవడం బలోపేతమైన విద్యా విధానానికి అద్దం పడుతోంది. వీటిల్లో ఒక్కటే ప్రభుత్వ పాఠశాల కాగా, 13 ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్, 3 ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి.

ఈసారి కూడా ఉత్తరాంధ్ర విద్యార్థులు అదరగొట్టారు. వరుసగా రెండో ఏడాది పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. 93.35 శాతంతో శ్రీకాకుళం రెండో స్థానంలో ఉంది. కర్నూలు జిల్లా 62.47 శాతం అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలోఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియక ముందే టెన్త్‌ ఫలితాలను విడుదల చేసి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరగ్గా, ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు మూల్యాంకనం చేసి విద్యా సంవత్సరం ముగింపునకు ఒక్కరోజు ముందే ఫలితాలను ప్రకటించింది. 

చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఏప్రిల్ 22న‌ విజయవాడలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మాస్‌ కాపీయింగ్, మాల్‌ ప్రాక్టీస్‌ కేసులేవీ నమోదు కాకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు.

ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణతతో విద్యార్థులు రికార్డు నెలకొల్పారని తెలిపారు. ఫలితాలను  https://education.sakshi.com/ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. నాలుగు రోజుల్లో పూర్తిస్థాయి మార్కుల జాబితా, మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో, విద్యార్థి డిజీలాకర్‌లో కూడా ఉంచుతామని చెప్పారు.

పరీక్షలో పాసవని విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వారికి విద్యా సంవత్సరం వృథా కాకుండా వచ్చే నెల 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1,000 రుసుమును చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  

#Tags