AP Ssc 10th Class Results State Topper: ఏపీ టెన్త్ ఫలితాల్లో స్టేట్ టాపర్ మనస్వికి 599 మార్కులు..ఆ ఒక్క మార్కు ఎందులో పోయిందంటే..
ఏపీ టెన్త్ ఫలితాల్లో స్టేట్ టాపర్ వెంకట నాగసాయి మనస్వి రికార్డు సృష్టించింది. మొతం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి అదుర్స్ అనిపించింది. హిందీ మినహా అన్ని సబ్జెక్టుల్లోనూ 100కి 100 మార్కులు సాధించి ఆశ్చర్యపరిచింది.
ఆకుల వెంకట నాగసాయి మనస్విది ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణం. ఈ అమ్మాయి పదోతరగతిలో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించింది. ఏటా ఎవరో ఒకరు ఈ రికార్డు సాధిస్తారు. కానీ ఇన్ని మార్కులు తెచ్చుకోవడం ఆమె సాధించిన మరో రికార్డు. 600కి ఒక్క మార్కు తక్కువగా 599 మార్కులతో ఉత్తీర్ణత సాధించడం పదవ తరగతి పరీక్షలకు కూడా రికార్డే.
మా నాన్నే హీరో!
చదువుకోవడమే జీవిత లక్ష్యం అన్నట్లు చదువుకుంటున్న మనస్వి నేపథ్యం కూడా పుస్తకాలమయమే. ఆమె తల్లి నాగ శైలజ, తండ్రి నాగ వరప్రసాదరావు ఇద్దరూ గవర్నమెంట్ స్కూల్ టీచర్‌లు. వెంకట నాగ సాయి మనస్వి వారి ఏకైక సంతానం. మనస్వికి క్లాసు పుస్తకాలు చదవడమే కాకుండా మంచి రీడింగ్ హ్యాబిట్ కూడా ఉంది. అయితే హాబీగా చదివే పుస్తకాలు కూడా కాలక్షేపం కోసం అన్నట్లు ఉండవు, మంచి సబ్జెక్టు ఉన్నవే కావడం విశేషం.
సిలబస్ ద్వారా తెలుసుకున్న విషయాలకు మరికొంత సమాచారాన్ని అందించేవిగా ఉంటాయి. ‘‘నా రోల్ మోడల్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్. స్పోర్ట్స్‌లో క్రికెట్ అంటే క్రేజ్. కానీ ఆడడానికి సమయం ఉండదు. మ్యాచ్ వస్తుంటే వీలయినంత సేపు చూస్తాను. విరాట్ కోహ్లీ ఆట నచ్చుతుంది. సినిమాలు చూస్తాను కానీ చాలా తక్కువ. నాకు నచ్చే హీరో రామ్ చరణ్. అందరికంటే ఈ ప్రపంచం లో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా నాన్న.
మా నాన్న కంటే బెస్ట్ హీరో మరెవరూ ఉండరు. ఆయన ఎప్పుడూ ఖాళీగా ఉండరు. నాన్న పాతికేళ్ల కిందట డీఎస్సీ రాశారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దాంతో ట్యూషన్‌లు చెప్పారు. వ్యవసాయం చేశారు. గత ఏడాది గవర్నమెంట్ చేసిన రిక్రూట్‌మెంట్‌లో నాన్నకు ఉద్యోగం వచ్చింది. తన చదువుకు తగిన ఉద్యోగం వచ్చే వరకు ఆయన నిరాశపడకుండా ఎదురుచూశారు’’ అని సంతోషంగా చెప్పింది మనస్విని.
ఇంతలో వాళ్ల తల్లి మాట్లాడుతూ ‘‘మనస్వి చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. పదవ తరగతిలో చాలా కష్టపడింది. ఇక చాలు నిద్రపొమ్మని చెప్పినా వినేది కాదు. అర్ధరాత్రి వరకు చదువుతూనే ఉండేది. సిలబస్ పూర్తికాకపోతే తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి చదువుకునేది. మంచి మార్కులు వస్తాయనుకున్నాం.
కానీ ఇన్ని మార్కులు తెచ్చుకుంటుందని, రికార్డు సాధిస్తుందని ఊహించ లేదు. తల్లిదండ్రులుగా మాకు ఇంతకంటే సంతోషం మరి ఏముంటుంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె. అత్యధిక మార్కుల సాధనలో మనస్వి రికార్డును భవిష్యత్తులో మరొకరు బ్రేక్ చేయడం అంత సులువు కాకపోవచ్చు. మనస్వి మార్కుల రికార్డు ఎప్పటికీ ఆమెకే ఉండిపోవచ్చు కూడా.
టెక్ట్స్ బుక్ చదివాను!
టెన్త్ క్లాస్ మార్కుల లిస్ట్ మనకు జీవితమంతా తోడు ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కోసం మాత్రమే కాదు మనకు చదువు మీద ఉండే ఇష్టానికి ప్రతిబింబం. అందుకే అంత ఎక్కువ కష్టపడ్డాను. మా అమ్మానాన్న నా కోసం తీసుకుంటున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. వారికి నేనివ్వగలిగిన గొప్ప బహుమతి మంచి మార్కులే. పరీక్షలకు ప్రిపరేషన్‌లో నేను గైడ్‌లు, నోట్స్ కంటే ఎక్కువగా టెక్ట్స్‌బుక్స్ చదివేదానిని. టాపర్ అనే లక్ష్యాన్ని పెట్టుకోలేదు. కానీ మంచి మార్కులు రావాలని కష్టపడ్డాను. మొత్తానికి నేను కోరుకున్నదానికంటే మించిన ఫలితాన్ని అందుకున్నాను. సంతోషంగా ఉంది. నాకు మ్యాథ్స్ ఇష్టం. ఐఐటీలో ఇంజినీరింగ్ చేసి జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలనేది నా లక్ష్యం.
– ఆకుల వెంకట నాగ సాయి మనస్వి, టెన్త్ క్లాస్ స్టేట్ టాపర్, ఆంధ్రప్రదేశ్.