Software jobs: ఇంటర్‌ విద్యతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

Software job

భీమవరంఇంటర్‌ పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగులుగా మారే సదవకాశం, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బిట్స్‌ పిలానీ, శాస్త్ర, అమిటీ లాంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువు కొనసాగించే సదావకాశం విద్యార్థులకు ఉందని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే. చంద్రశేఖర్‌ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విద్యార్థులకు ఈ మహత్తర అవకాశం లభిస్తుందని, రాష్ట్రంలో 75 శాతం మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసిన అన్ని గ్రూపుల నాన్‌ మ్యాథ్స్‌ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ బోర్డు, హెచ్‌సీఎల్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్‌ విద్యను 75 శాతం మార్కులతో పూర్తి చేసిన విద్యార్థులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.

ఈ ఉద్యోగాల కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 500 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకొన్నారని, వీరికి ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, హెచ్‌సీఎల్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న భీమవరంలోని ఆదిత్య జూనియర్‌ కళాశాలలో ఉదయం 9 నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు.

ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత క్యాట్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, చివరిగా ఇంగ్లీష్‌ వెర్షన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. బైపీసీ, సీఈసీ, హెచ్‌ఐసీ, ఒకేషనల్‌ గ్రూపులు చదివిన విద్యార్థులు డీపీఓ విభాగంలో ఉద్యోగం పొందవచ్చన్నారు.

ఉన్నత విద్యను కొనసాగించే సదవకాశాన్ని కూడా కల్పించడానికి హెచ్‌సీఎల్‌ సంస్థ ప్రణాళిక రూపొందించింది. అమిటీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉన్నత విద్యకు హెచ్‌సీఎల్‌ ఆర్థిక సహాయం అందిస్తుందని, సందేహాలు ఉంటే సాయి కిరణ్‌ను 9642973350 నెంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.

#Tags