Anganwadi vacancys 2024: అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీగా ఖాళీలు
అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న కేంద్రాల్లో సిబ్బందిని భర్తీ చేయడం ద్వారా వాటిని సమర్థవంతంగా నడిపించవచ్చని భావిస్తోంది. దీంతో ఉపాధ్యాయురాళ్లు, సహాయకుల పోస్టుల భర్తీపై నిరుద్యోగ యువతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో సంబంధిత సంక్షేమ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదల కాగానే వాటి భర్తీకి దరఖాస్తులు సేకరించేలా అధికారులు సమాయత్తం అవుతున్నారు.
5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో..
జిల్లాలో మొత్తం 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీలు ఉండగా వాటిలో 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో గర్భిణులు 6,080 మంది ఉండగా, బాలింతలు 4,380 మంది ఉన్నారు. ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 6 నెలలలోపు చిన్నారులు 4,561 మంది, 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 28,250 మంది ఉన్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 18,612 మంది ఉన్నారు.
ఇందుకుగాను మొత్తం 239 పోస్తులు భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం 1,209 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,126 మెయిన్, 83 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మినీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. వాటిల్లో లబ్ధిదారుల సంఖ్యకు తగినట్లుగా సిబ్బంది అందుబాటులో లేరు. ఇటీవల మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో సహాయకుల పోస్టులూ పెరిగాయి.
దీనిప్రకారం 59 ఉపాధ్యాయ పోస్టులు, 180 సహాయకుల (ఆయాల) పోస్టులు మొత్తం కలిపి 239 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని జిల్లా అధికారులు జాబితా రూపొందించారు. అయితే కొన్ని కేంద్రాల్లో టీచర్, ఆయా లేకపోవడంతో సమీప కేంద్రాల వారికి ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించారు.
దీంతో వాటి సేవల్లో అంతరాయం కలుగుతోంది. లబ్ధిదారులకు కూడా పోషకాహారం సరిగా అందకపోవడం, ఎన్‌హెచ్‌టీస్ (న్యూ హెల్త్ ట్రాకింగ్ సిస్టం) పోషణ ట్రాకర్‌లో వివరాల నమోదులో కూడా ఆలస్యం జరుగుతోంది. అంగన్‌వాడీల పోస్టుల భర్తీతో ఆయా సమస్యలు తీరడంతో పాటు యువతులకు నూతనంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఖాళీల జాబితా సిద్ధం చేస్తున్నాం
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే జాబితా సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం త్వరలో ఆయా ఉద్యోగ నియామకాల మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వులు, నియమ నిబంధనల ప్రకారం ఖాళీలను నింపేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.