Anganwadi childrens news: అంగన్‌వాడీ చిన్నారులకు ఆరోగ్య భద్రత

Anganwadi childrens news

అంగన్‌వాడీ కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాల మెరుగుకు చర్యలు చేపట్టారు. సొంత భవనాలతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఆటపాటలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తోంది.

మాతాశిశు సంక్షేమానికి భారీగా నిధులు ఇవ్వడం ద్వారా కొత్త విధానాలతో అంగన్‌వాడీ కేంద్రాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, పిల్లలు అనారోగ్యం బారిన పడినపుడు, చిన్నారులు ప్రమాదవశాత్తు గాయపడినపుడు వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలన్నింటికీ ప్రత్యేకంగా మెడికల్‌ కిట్లు అందజేస్తోంది.

జిల్లాలోని 3,214 అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రాథమిక చికిత్స కిట్లను విశాఖపట్నం సెంట్రల్‌ ఫార్మశీ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈనెల 20 తేదీ నుంచి సరఫరా ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటి వరకు కొయ్యూరు మండలంలోని 160 అంగన్‌వాడీలకు మందుల కిట్లు సరఫరా చేశారు. ప్రతి సంవత్సరం నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఈ కిట్లను అందజేసి, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు భద్రత కల్పిస్తున్నారు.

చిన్నారులు జ్వరం బారిన పడినా, ప్రమాదాలకు గురైనా వెంటనే వైద్యం అందించేలా కిట్లలో మందులను సమకూర్చారు. వీటిలో ఫస్ట్‌ఎయిడ్‌కు వినియోగించే ఔషధాలకు ప్రాధాన్యతనిచ్చారు. పారాసిటమాల్‌ సిరప్‌, ఐరన్‌ ట్యాబ్లెట్లు, సిల్వర్‌ సల్ఫాడైజీన్‌, క్లోరో ఫినరామిన్‌ మాలియాట్‌, ఫురాజోలిడిన్‌, హ్యాండ్‌ శానిటైజర్‌, రోలల్‌ బేండేజ్‌, నియోమైసిన్‌ ఆయింట్‌ మెంట్‌, కాటన్‌, సిప్రోప్లాక్సిన్‌ చుక్కల మందు, బెంజయిల్‌, బెంజోయేట్‌, మరికొన్ని సిరప్‌లు కిట్లలో ఉన్నాయి.

పిల్లలలో వచ్చే సాధారణ వ్యాధులు, ఏఏ మందులను ఎంతెంత మోతాదులో ఎలా వినియోగించాలో పేర్కొంటూ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం పేరుతో తెలుగులో సమాచారాన్ని కూడా స్పష్టంగా పంపించారు. మందుల వినియోగంపై వైద్య సిబ్బందితో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్తల పర్యవేక్షణ

ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయా కేంద్రాల పరిధిలో సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకొకసారి పర్యవేక్షణ చేయాల్సి ఉంది.

వీరు కేంద్రాల్లోని చిన్నారులకు పెరుగుదల, బరువుపై పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి మందులు అందించాలి. ఆయా కేంద్రాల్లో మెడికల్‌ కిట్లలో ఉన్న మందులు, ఇతర సామగ్రిని అవసరమైన వారికి అందిస్తారు.

కేంద్రాల్లోని చిన్నారులతోపాటు రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు.

 

జిల్లాలో వివరాలు

జిల్లాలో మొత్తం ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు : 19

మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు : 3,214

మెయిన్‌ కేంద్రాలు : 1,791

మినీ కేంద్రాలు : 1,423

గర్భిణులు : 9,816

బాలింతలు : 10,728

6 నెలల నుంచి ఏడాది లోపు చిన్నారులు : 13, 675

ఏడాది నుంచి మూడేళ్లలోపు పిల్లలు : 37, 984

మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు : 43, 523

 

పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ప్రతి మూడు రోజులకు ఒకసారి అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తారు. కేంద్రంలోని పిల్లల ఎదుగుదల, ఎత్తు, బరువు పరీక్షల నిర్వహణతోపాటు కిట్‌లోని మందులను అవసరమైన వారికి అందిస్తారు. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లోని మందులపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తారు.

– డి.శారద, సీడీపీవో, అరకులోయ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు

కిట్ల వల్ల చాలా ప్రయోజనం

అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్‌ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఈ కిట్లలో నాణ్యమైన, నిత్యం వినియోగించే మందులున్నాయి. పిల్లలకు జ్వరం, చిన్నపాటి గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ కిట్‌లోని మందులు ఉపయోగపడతాయి., పిల్లలల్లో సాధరణంగా వచ్చే చర్మ వ్యాధుల నిర్మూలనకు సంబంధించిన అయింట్‌మెంట్లు ఈ కిట్‌లో ఉంటాయి.

#Tags