IAS Officer kranthi Valluru Sucess Story: 24 ఏళ్లకే ఐఏఎస్ ఆఫీసర్‌గా..సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సక్సెస్ స్టోరీ
బాల్యం.. విద్యాభ్యాసం
వల్లూరు క్రాంతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ని కర్నూలు పట్టణం. తండ్రి డా.రంగారెడ్డి, తల్లి డాక్టర్ లక్ష్మి. ఇద్దరూ కూడా వైద్యులే. అక్క కూడా వైద్యురాలే, అమెరికాలో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కర్నూల్‌లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. బీటెక్ ఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.
మూడో ప్రయత్నంలోనే..
అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ వైపు వచ్చిన జాబ్‌ను వదలకుండా ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలిసారిగా 2013లో సివిల్స్‌కు హాజరై 562 ర్యాంకు రావటంతో (ఐఆర్‌టీఎస్) ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా నిరాశ చెందకుండా రెండోసారి 2014లో సివిల్స్ పరీక్ష రాసి 230 ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్ కావాలని పట్టుదల, నాన్న సూచన సలహా మేరకు 2015లో జరిగిన సివిల్స్‌లో 65 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించి యువ ఐఏఎస్‌గా నిలిచారు. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు ఎంపిక అయ్యారు.
శిక్షణలో క్షేత్రస్థాయి సమస్యలు
ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు ఓ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో నేర్పించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ట్రెక్కింగ్ నేర్పించారు.
ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. లక్ష్యం సాధించే వరకు అదే పనిగా ఉంటూ ఆత్మస్థైర్యం, నమ్మకంతో ఉండాలి. ప్రణాళికబద్ధంగా సిలబస్ ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. విజయం అనేది ఊరికే రాదు. ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.
అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..
ఇంట్లో అందరూ సైన్స్ పై ఎక్కువగా ఇష్టం.. తనకు మాత్రం మ్యాథ్స్‌పై ఇష్టం ఎక్కువ. తనకు చిన్నప్పటి నుంచే లీడర్ షిప్ లక్షణాలపై ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ప్రజాసేవ చేయగలుగుతామనే ఆలోచన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన మాట లు మ్యాథ్స్ ఉన్న ఇంట్రెస్ట్‌తోనే ఐఏఎస్ సాధించేలా చేశాయి. ప్రైవేటుగా ఉండి ఎంత సంపాదించినా సరైన విధంగా ప్రజాసేవ సాధ్యం కాదు. అందుకే ఉన్నతమైన ఐఏఎస్‌ను సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ట్రైనీగా, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జోగులాంబ కలెక్టర్‌గా నిర్వహించి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.
భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లు
వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. భర్త ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి పాప(ఆర్యన్) ఉంది.