Holidays List 2025 : వ‌చ్చే ఏడాది 2025లో 50 రోజులకు పైగా సెల‌వులు... ఎలా అంటే..? ఈ టెక్నిక్ పాటిస్తే...!

సాక్షి ఎడ్యుకేష‌న్ : వ‌చ్చే ఏడాది స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా సెల‌వులు రానున్నాయి. ఇప్పటికే 2025లో స్కూల్స్‌, కాలేజీలకు వచ్చే సెలవులను తెలుగు రాష్ట్రాల‌ ప్రభుత్వాలు ప్రకటించాయి.

అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సెలవులపైనా క్లారిటీ ఇచ్చాయి. ఇక పలు కార్పోరేట్ కంపనీలు కూడా 2025లో వచ్చే పండగలు, కీలకమైన రోజులను దృష్టిలో వుంచుకుని హాలిడేస్ లిస్ట్ రెడీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓసారి 2025 క్యాలండర్‌ను పరిశీలిస్తే..

కేవలం 12 రోజులు సెలవు పెడితే ఏకంగా 50 రోజుల సెలవులు...
స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులే కాదు ఉద్యోగాలు చేసే వారు కూడా సెలవులంటే ఎగిరి గంతేస్తారు. ముఖ్యంగా ఈ సెలవులు వీకెండ్‌తో కలిసి వస్తే వారి ఆనందానికి అవధులు వుండవు. మరి వచ్చే ఏడాది 2025 లో ఇలాంటి లాంగ్ వీకెండ్స్ ఎన్ని వచ్చాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. 

☛➤ Sankranti Holidays 2025 Problems : ఈసారి మీకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులో తెలుసా..?

సాధారణంగా కార్పోరేట్ సంస్థల ఉద్యోగులతో పాటు చాలా ప్రైవేట్ సంస్థలు శని,ఆదివారం రెండు రోజులు ఉద్యోగులకు సెలవులు ఇస్తాయి. అంటే ప్రతినెలా దాదాపు ఎనిమిది రోజులు సెలవే. వీటికి హాలిడేస్ తోడయినా, లాంగ్ వీకెండ్ కలిసివచ్చినా ఉద్యోగులకు పండగే. ఇక లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందంటే ఒకటి రెండ్రోజులు సెలవు పెట్టడానికి ఉద్యోగులు వెనకాడరు. ఇలా 2025 లో కేవలం 12 రోజులు సెలవు పెడితే ఏకంగా 50 రోజుల సెలవులు కలిసివస్తాయి. 

పాత సంవత్సరానికి మరికొద్ది రోజుల్లో స్వస్తిపలికి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఏ నెలలో ఎన్ని హాలిడేస్ వచ్చాయి? మనం లీవ్ పెడితే ఎలా కలిసివస్తాయో తెలుసుకుందాం.

జనవరి 2025  :
కొత్త సంవత్సరం సెలవుతోనే ప్రారంభం అవుతుంది. అలాగే ఈ నెలలో సంక్రాంతి పండగ వుంటుంది కాబట్టి మరికొన్ని సెలవులు కలిసివస్తాయి. ఇలా ప్రతి ఏడాదిలాగే 14న సంక్రాంతి సెలవు వుంటుంది. ఇది మంగళవారం వస్తోంది. శని, ఆదివారం ఎలాగూ హాలిడే వుంటుంది.. ఒక్క సోమవారం సెలవు పెడితే వరుసగా నాలుగురోజులు కలిసివస్తాయి. అంటే 11,12,13,14 తేదీలు సెలవు పొందవచ్చు. ఈ నాలుగు రోజులు హాయిగా సొంతూళ్లకు వెళ్ళి సంక్రాంతి పండగను హాయిగా కుటుంబంతో కలిసి జరుపుకోవచ్చు. 

☛➤ January Schools and Colleges Holidays 2025 : జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు సెల‌వులు ఇంతేనా..? కానీ వీళ్ల‌కు మాత్రం...

ఫిబ్రవరి 2025 : 
ఈ నెలలో ఓ వారం మొత్తం సెలవు తీసుకునే అవకాశం వస్తుంది. ఫిబ్రవరి 2025 లో 26 తేదీన మహా శివరాత్రి వుంటుంది. ఈ పండగ సరిగ్గా వీక్ మిడిల్లో అంటే బుధవారం వస్తోంది. కాబట్టి  దీనికి అటు,ఇటు ఓ నాలుగురోజులు సెలవు తీసుకుంటే వరుసగా తొమ్మిదిరోజులు కలిసివస్తాయి. ఫిబ్రవరి 22 శనివారం, 23 ఆదివారం సెలవే. ఆ తర్వాత 24 సోమవారం, 25 మంగళవారం లీవ్ పెట్టుకుంటే 26 న మళ్ళీ శివరాత్రి హాలిడే వస్తుంది. ఇక 27,28 గురు,శుక్రవారం లీవ్ తీసుకుంటే ఈ నెల ముగుస్తుంది. మళ్లీ మార్చి 1,2 తేదీలు వీకెండ్.. మరో రెండు సెలవులు కలిసివస్తాయి. ఇలా వరుసగా 9 రోజులు సెలవులు కలిసివస్తాయి. 
 
మార్చి 2025 :
ఈ నెలలో ఎలాంటి సెలవులు పెట్టకున్నా రెండుసార్లు లాంగ్ వీకెండ్ వస్తుంది. మార్చి 14, 2025 హోలీ పండగ శుక్రవారం వస్తోంది. కాబట్టి తర్వాతి రెండ్రోజులు 15,16 తేదీల్లో సెలవే. ఇక నెల చివర్లో మరో లాంగ్ వీకెండ్ వస్తుంది. 31 సోమవారం రంజాన్ పండగ. కాబట్టి వరుసగా 29,30,31 మూడురోజులు సెలవులు వుంటాయి. ముస్లిం ఉద్యోగులకు ఈ సెలవులు బాగా కలిసి వస్తున్నాయి.

ఏప్రిల్ 2025 :
ఈ నెలలో 18వ తేదీన గుడ్ ఫ్రైడే వుంది. ఆ తర్వాత రెండ్రోజులు వీకెండ్. ఇలా మార్చిలో 18,19,20 తేదీల్లో లాంగ్ వీకెండ్ వస్తుంది. ఇది పిల్లల పరీక్షల సమయం కాబట్టి టూరిస్ట్ ప్లేసెస్, దేవాలయాల్లో రద్దీ తక్కువగా వుంటుంది. మీరు బ్యాచిలర్స్ అయితే ఈ సెలవులు కలిసివస్తాయి.

మే 2025 : 
ఈ నెల ఆరంభమే లాంగ్ వీకెండ్. మేడే గురువారం వస్తోంది. ఆ రోజు ఎలాగూ హాలిడే వుంటుంది. శుక్రవారం ఒక్కరోజు లీవ్ తీసుకుంటే శని, ఆదివారం మళ్ళీ వీకెండ్ హాలిడేస్.ఇలా వరుసగా నాలుగు రోజులు సెలవులు తీసుకోవచ్చు. ఇక జూన్, జూలై పెద్దగా సెలవులేమీ లేవు. కేవలం శని, ఆదివారాల సెలవులు మాత్రమే. ఈ రెండు నెలలు ఉద్యోగులకు చాలా భారంగా గడుస్తాయి. 

 

ఆగస్టు 2025 : 
ఇక ఆగస్టులో అయితే ఓ నాలుగు రోజులు లీవ్ పెడితే ఏకంగా 12 రోజుల హాలిడే తీసుకోవచ్చు.  ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం శుక్రవారం.. ఆ తర్వాత 16,17 తేదీల్లో శని, ఆదివారం వీకెండ్. మూడు రోజుల వరుస సెలవులు వస్తాయి. ఇక 23,24 మరో వీకెండ్. ఆ తర్వాత రెండ్రోజుల లీవ్ తీసుకుంటే 27న వినాయక చవితి. బుధవారం పండగ సెలవు తర్వాత 28,29 తేదీలు లీవ్ తీసుకుంటే మరో వీకెండ్ వచ్చేస్తుంది. అంటే 30,31 శని, ఆదివారం ఎలాగూ సెలవే. ఇలా వరుసగా 9 రోజుల సెలవు పొందవచ్చు.  

అక్టోబర్ 2025 : 
అక్టోబర్ 2 గాంధీ జయంతి గురువారం వస్తోంది. ఇదే రోజు దసరా వస్తోంది. తర్వాతి రోజు శుక్రవారం లీవ్ తీసుకుంటే శని, ఆదివారం మళ్లీ సెలవులే. ఇలా వరుసగా నాలుగు రోజులు (2,3,4,5 తేదీలు) సెలవు పొందవచ్చు. మధ్యలో దసరాకు సెల‌వులు. అక్టోబర్ 20న దీపావళి సోమవారం వస్తోంది. ముందు రెండ్రోజులు 18, 19 శని, ఆదివారాలు వీకెండ్. ఇలా 2025 దీపావళికి మూడు రోజుల సెలవు వస్తోంది. 

డిసెంబర్ 2025 :  
డిసెంబర్ 26న సెలవు తీసుకుంటే క్రిస్మస్‌కు నాలుగు రోజులు కలిసివస్తాయి. 25 గురువారం క్రిస్మస్ కాబట్టి తర్వాతరోజు శుక్రవారం లీవ్ తీసుకుంటే శని, ఆదివారం కలిసివస్తాయి.

#Tags