Non-local quota- విద్యాసంస్థల్లో ఈ ఏడాది వరకే 'నాన్‌ లోకల్‌ కోటా'

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంస్థల్లో స్థానికేతరులకు ఇచ్చే 15 శాతం నాన్‌–లోకల్‌ కోటాను ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా సంస్థలకు అనుమతినిచ్చింది. దీంతో ఈ ఏడాది ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా చేపట్టే నియామకాల్లో తెలంగాణేతరులకు 15 శాతం సీట్లు ఇవ్వనున్నారు. దీనిపై ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది.

స్థానికేతర కోటా.. ఎప్పటివరకు
ఉమ్మడి రాష్ట్రంలోనూ నాన్‌–లోకల్‌ విద్యార్థులకు రాష్ట్ర విద్యా సంస్థల్లో 15 శాతం కేటాయించేవారు. విభజన జరిగినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదేళ్లపాటు స్థానికేతర కోటా అమలు చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే 2024 మే నాటికి ఈ గడువు పూర్తవుతుంది.

ఈ ఏడాది అమలు అవుతుందా? లేదా?
ఈ నేపథ్యంలో ఈ ఏడాది నాన్‌–లోకల్‌ కోటా అమలు చేయాలా.. వద్దా అని ఉన్నత విద్యా మండలి సంశయంలో పడింది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో కోటా అమలుకు రంగం సిద్ధం చేశారు. పోటీ పరీక్షల నోటిఫికేషన్లన్నీ మే నెలకన్నా ముందే విడుదలవుతున్నాయి. కాబట్టి ఈ ఏడాది వరకూ అమలు చేయడం సరైన నిర్ణయమని ప్రభుత్వం భావించింది. 
 

#Tags