National Scholarship: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం అప్లై చేశారా? నేడే చివరి తేదీ

యలమంచిలి: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) అమలు చేస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌ 2024–25వ విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 5వ తేదీన ప్రారంభం కాగా ఈ నెల 24వ తేదీ వరకు అవకాశాన్ని కల్పిస్తు చివరి తేదీని పొడిగించినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.


ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ నిమిత్తం నెలకు రూ.1000 చప్పున ఏడాదికి రూ.12,000 అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్‌షిప్‌ అందుతుంది. నగదును ప్రతి సంవత్సరం విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు
ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, పురపాలక, ఎయిడెడ్‌, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3,50,000 మించకూడదు. పాఠశాలలో రెగ్యులర్‌ విధానంలో చదువుతుండాలి. రాత పరీక్షల ద్వారా స్కాలర్‌షిప్‌ పొందడానికి విద్యార్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఓసీ, బీసీ విద్యార్థులైతే పరీక్షల రుసుము రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే పరీక్ష రుసుము రూ.50 చెల్లించాల్సి ఉంది.

ఆన్‌లైన్‌లో ఈనెల 24వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షా రుసుంను ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఇచ్చిన ఎస్‌బీఐ కలెక్ట్‌ లింకు ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంది. దరఖాస్తులను ప్రభుత్వ వెబ్‌ సైట్‌ www.bse.ap.gov.in నందు నమోదు చేసుకోవచ్చును. దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి ఆధార్‌ కార్డులో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేది, తండ్రి పేర్లను నమోదు చేయాల్సి ఉంది.

దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) ద్వారా విద్యార్థులు ఉపకార వేతనాలను పొందడానికి మంచి అవకాశం. 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ పరీక్షల్లో ప్రతిభ చాటితే నాలుగేళ్లు పాటు ఉపకార వేతనం అందిస్తారు. చదువుకు ఆటంకం కల్గించే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– కనుమూరు వెంకట రామకృష్ణంరాజు, ఎంఈఓ–2, యలమంచిలి

#Tags