MHT CET 2024 Results Out: మహారాష్ట్ర టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో విక్రమ్ షాకు 100 పర్సంటైల్.. కుటుంబంలో అందరూ డాక్టర్లే..
మహారాష్ట్ర టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (MHT CET) పరీక్షలో సన్మయ్ విక్రమ్ షా అనే విద్యార్థి 100 పర్సంటైల్ సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. నిన్న(ఆదివారం)విడుదలైన రాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) ఫలితాల్లో విక్రమ్ షా వంద శాతం మార్కులు సాధించాడు. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉన్న విక్రమ్ షా ICSE పదో తరగతి ఫలితాల్లో ఆల్ ఇండియాలో 3వ ర్యాంకును సాధించాడు.
12వ తరగతిలోనూ 92.5 శాతం స్కోర్ చేశాడు. అంతేకాకుండా తాజాగా విడుదలైన నీట్ యూజీ ఫలితాల్లోనూ 720 మార్కులకు 715 మార్కులు సాధించి ఆల్‌ఇండియాలో 110వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. తన తల్లితండ్రుల్లాగే డాక్టర్ అవ్వాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు.
కాగా విక్రమ్ తండ్రి గైనకాలజిస్ట్ కాగా, తల్లి పిడియాట్రిషియన్‌గా సేవలు అందిస్తున్నారు. విక్రమ్ సోదరి కూడా డాక్టరే. తన సక్సెస్ జర్నీలో కుటుంబసభ్యులతో పాటు ప్రొఫెసర్ల పాత్ర ఎంతో ఉందని, వారి గైడెన్స్‌తోనే ఇంతదాకా వచ్చానని పేర్కొన్నాడు. కష్టపడి చదవడం ఎంత ముఖ్యమో అందుకు తగ్గట్లు మంచి డైట్, లైఫ్‌స్టైల్ పాటించడం కూడా అంతే ముఖ్యం.
ప్రతిరోజూ ఒక టైంటేబుల్ ప్రకారం చదువుకుంటా, 7గంటల పాటు నిద్రకు కేటాయిస్తా. ఖాళీ సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతా. లేదంటే టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, లేదా సంగీతం వినడం లాంటివి చేస్తుంటా. ముఖ్యంగా ప్రతిరోజూ యోగా చేయడం వల్ల ఒత్తిడికి గురికాకుండా, ఏకాగ్రత మరింత పెరుగుతుంది.