Jagananna Vidya Deevena: నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

కాకినాడ సిటీ: నిరుపేద విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా వివిధ చర్యలు చేపట్టారు. ఆ మేరకు జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్‌), జగనన్న వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఏడాది జగనన్న విద్యాదీవెన నాలుగో విడత కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఏటా ప్రతి మూడు నెలలకోసారి నాలుగు దఫాలుగా విద్యార్థులకు సంబంధించిన కాలేజీ ఫీజులను ప్రభుత్వ చెల్లిస్తుంది. అమ్మ ఒడి తరహాలో విద్యార్థుల తల్లుల ఖాతాలకు నిధులను ప్రభుత్వం జమ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడికల్‌ వంటి కోర్సులు చదువుతున్న 34,234 మంది విద్యార్థులకు సంబంధించి.. 31,291 మంది తల్లుల ఖాతాల్లో విద్యా దీవెన నిధులు రూ.23,24,87,357 జమ చేయనుంది.

జవాబుదారీ కోసం
కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గతంలో ఇబ్బందులకు గురి చేసేవి. ఈ ఇబ్బందులను తప్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. పేద విద్యార్థుల ఫీజులను ఆయా కాలేజీలకు చెల్లించకుండా తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నారు. దీనివలన ఫీజులు చెల్లించడానికి తల్లులు కాలేజీకి వెళ్లినప్పుడు.. తమ బిడ్డలు ఎలా చదువుతున్నారో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. కళాశాలలో చదువులు, వసతులు ఎలా ఉన్నాయో కూడా పరిశీలించవచ్చు. ఏవైనా లోపాలుంటే కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించేలా జవాబుదారీతనాన్ని పెంచాలనేదే ప్రభుత్వ ధ్యేయం. ఈ విధానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల భీమవరంలో ప్రారంభించనున్నముఖ్యమంత్రి జగన్‌ జిల్లాలో 34,234 మంది విద్యార్థులకు రూ.23,24,87,357 లబ్ధి 31,291 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగనన్న విద్యా దీవెన కింద జిల్లాలోని విద్యార్థులకు చేకూరుతున్న లబ్ధి (రూ.కోట్లలో)

సామాజిక వర్గం విద్యార్థులు లబ్ధి
ఎస్సీ 6,796 4,99,89,325
ఎస్టీ 244 12,88,731
బీసీ 14,982 9,62,24,133
ఈబీసీ 2,272 1,83,48,517
ముస్లిం 456 31,21,938
కాపు 9,386 6,27,30,358
క్రిస్టియన్‌ 98 7,84,355

సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అందజేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏడాది నాలుగో విడత నగదు విద్యార్థుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుంది. ఈ డబ్బును ఫీజు కింద విద్యార్థి చదువుతున్న కాలేజీలో చెల్లించాలి.
– డీవీ రమణమూర్తి, జాయింట్‌ డైరెక్టర్‌, సాంఘిక సంక్షేమ శాఖ, కాకినాడ జిల్లా

#Tags