Gurukul School Admissions: బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి తీవ్ర పోటీలు..
అనంతపురం: నాణ్యమైన బోధనతో పాటు అన్ని రకాల వసతులు కల్పిస్తుండడంతో బీసీ గురుకుల పాఠశాలల్లో సీట్లకు తీవ్ర పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరం 6,7,8,9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తే పోటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 63 సీట్లకు ఏకంగా 1,301 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నార్పల బీసీ గురుకుల పాఠశాలలో ఈనెల 20, 21 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. 20న 6,8 తరగతులకు, 21న 7,9వ తరగతులకు పరీక్ష ఉంటుంది.
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తరగతే కాకుండా పూర్వపు తరగతి పాఠ్యాంశాలపై కూడా ప్రశ్నలుంటాయి. 100 మార్కులకు రాత పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. జవాబులను ఓఎంఆర్ షీట్‌లో గుర్తించాలి. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని బీసీ గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ పీఎంకే సంగీతకుమారి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 90008 61117 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.