ITI Counselling 2024: ప్రభుత్వ, ప్రవేట్ ఐటీఐలో ప్రవేశానికి ఈనెల 19న కౌన్సెలింగ్.. ర్యాంకుల ఆధారంగా ఇలా..
అనంతపురం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 19 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, స్టడీ, కుల ధ్రువీకరణ, ఫొటో, ఆధార్‌కార్డు ఒరిజినల్స్ తీసుకు రావాలని సూచించారు.
19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ ఉంటుందని, రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగుతుందన్నారు. 19న జీపీఏ 10 నుంచి 7 వరకు (ర్యాంకు 1 నుంచి 271 వరకు), 20న జీపీఏ 6.8 నుంచి 5 వరకు (ర్యాంకు 272 నుంచి 574), 21న జీపీఏ 4.8 నుంచి 0 వరకు (ర్యాంకు 575 నుంచి 897) కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 98667 82452 నంబరులో సంప్రదించాలని సూచించారు.