Collector Inspection: పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు..

మచిలీపట్నంటౌన్‌: కృష్ణాజిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ గురువారం స్థానిక కాలేఖాన్‌ పేట మున్సిపల్‌ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన, ఫలితాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు సంబంధిత రికార్డులు, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలను కలెక్టర్‌ పరిశీలించారు. బయోలాజికల్‌ సైన్స్‌ లాబరేటరీ ఎక్విప్‌మెంట్‌ను పరిశీలించడంతోపాటు లైబ్రరీలో ఉన్న పుస్తకాల వివరాలపై ఆరా తీశారు.

లైబ్రరీ రిజిస్టర్‌ తనిఖీ చేసి విద్యార్థులు ఎటువంటి పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపుతున్నారని అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి ఇంగ్లిష్‌భాషపై వారికి ఉన్న ఆసక్తి, ప్రావీణ్యం పరిశీలనకై పాఠ్యపుస్తకం చదివించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. వీడియో పాఠ్యాంశాల బోధనను పరిశీలించారు.

విద్యార్థులు నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పొందేందుకు రాసే పరీక్షకు వారిని సిద్ధం చేసేందుకు వినియోగిస్తున్న పుస్తకాల వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులను విద్యార్థులతో బాగా ప్రాక్టీస్‌ చేయించి, మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ సూచించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేసి మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. అన్నం పలుకుగా ఉందని, ఇంకాస్త ఉడికించాలని సూచించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట మండల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌, ఎంఈవో–2 గురు ప్రసాద్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.శోభారాణి ఉన్నారు.
 

#Tags