APAAR All You Need To Know- ఆధార్‌ తరహాలోనే అపార్‌ కార్డు.. కేజీ నుంచి పీజీ వరకు, అన్ని వివరాలు ఒకే నెంబర్‌తో

ఆటోమేటెడ్‌ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(APAAR) పేరుతో ఆధార్‌ తరహాలోనే విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) పేరుతో 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనున్నారు.

విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఇంత​​కీ అపార్‌ కార్డు అంటే ఏమిటి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఈ ​కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


APAAR వల్ల కలిగే ప్రయోజనాలు?
అపార్‌ విధానంలో దేశంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. పాఠశాలలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు విద్యార్ధులు తమ అకడమిక్ క్రెడిట్స్ ను ఒకే చోట నమోదు చేయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

సర్టిఫికెట్లన్నీ డిజిటల్‌ రూపంలో..
అపార్‌ నంబర్‌ను విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. దీంట్లో విద్యార్థి అకడమిక్‌ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తం అయ్యి ఉంటాయి. తాజా విధానం వల్ల ఫిజికల్ గా సర్టిఫికెట్లను దాచుకునే పాత విధానం స్ధానంలో సులభతరమైన డిజిటల్ క్రెడిట్స్ అందుబాటులోకి వస్తాయి.

ఇలా ఒకే చోట సర్టిఫికెట్లన్నీ అకడమిక్ క్రెడిట్స్ రూపంలో స్టూడెంట్ ఐడీతో ఉంటే విద్యాసంస్ధలు కూడా వాటిని సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనుంది. ఆపార్‌ నెంబర్‌ను ఆధార్‌తో ధృవీకరించడంతో పాటు డిజీ లాకర్‌కు లింక్ చేస్తారు. 


APAAR వల్ల లాభాలు

  • విద్యార్థుల జీవిత కాల గుర్తింపు కార్డుగా అపార్ కార్డు ఉపయోగపడుతుంది.
  • అకడమిక్ డేటాను ఒకేచోట నిల్వచేస్తుంది.
  • దేశంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ సంస్థల్లో అయినా ప్రవేశం పొందడం చాలా సులభం. 
  • విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్‌షిప్స్ తదితర వివరాలన్నీ  ఒకే నెంబర్‌తో తెలుసుకోవచ్చు. 
  • వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణపత్రాలను భౌతికంగా కాకుండా, డిజిటల్‌లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది.


అపార్‌ గురించి పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ https://www.education.gov.in/nep/ncrf-apaarను సంప్రదించండి. 

#Tags