4-Year Degree Courses: సరికొత్తగా రూపుదిద్దుకున్న డిగ్రీ కోర్సులు.. ఉద్యోగం గ్యారెంటీ..

డిగ్రీ చదువు..

  • సరికొత్తగా రూపుదిద్దుకున్న డిగ్రీ కోర్సులు 
  • ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల వ్యవధి కోర్సులు అమలు 
  • ఐటీ, పరిశ్రమలు, స్వయం ఉపాధి అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ 
  • జిల్లాలో 6450 మంది విద్యార్థులకు ఉపయుక్తం

కొత్త కోర్సులివే..
శ్రీకాకుళం న్యూకాలనీ: చదువుకు సార్థకత లభించాలంటే ఉద్యోగం రావాల్సిందే. అయితే సాధారణ డిగ్రీ కోర్సులకు ఉద్యోగ అవకాశాలు అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో డిగ్రీ చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన విద్యా సంస్కరణలో భాగంగా డిగ్రీ పూర్తయ్యేలోపు ఉద్యోగం, ఉపాధి అందించాలనే దిశగా విద్యా ప్రణాళికను అమలుచేస్తోంది. తాజాగా డిగ్రీ విద్యతో ఉద్యోగం, ఉపాధి కల్పించే కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) సూచన మేరకు కళాశాలలు నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి.


ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు..
డిగ్రీ ఆనర్స్‌, ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌ డిగ్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషులు, మహిళల కళాశాలలు, ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, బారువ, పాతపట్నం, పొందూరు, తొగరాంలో మొత్తం 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఉన్నత విద్యా విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం వసతులు ఉన్న కాలేజీల్లో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. దీంతో జిల్లాలో దాదాపు 6,450 మంది విద్యార్థులకు ఈ కోర్సులు ఉపయుక్తం కానున్నాయి. కొన్ని ప్రైవేటు కళాశాలల్లోను కోర్సులు అందిస్తున్నారు.

అవగాహన సదస్సులు..
ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించారు. అధ్యాపకులు వెబెక్స్‌ ద్వారా విద్యార్థులను కోర్సులపై చైతన్యపరుస్తూ నూతన డిగ్రీ కోర్సుల అభ్యసనం వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. కోర్సు పూర్తి చేస్తే దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెబుతున్నారు.

APPSC Group-4 Jobs: కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష తేదీ ఇదే!


డిగ్రీతో ఉద్యోగం గ్యారెంటీ..
ఐటీ, పారిశ్రామిక సంస్థలు, ఇతర గిరాకీ ఉన్న అవసరాలకు అనుగుణంగా నూతన సిలబస్‌లను ప్రవేశ పెట్టారు. కళాశాల నుంచి కొలువులు దక్కేలా ప్రత్యేక నైపుణ్యాలపై దృష్టి పెట్టేలా చేస్తున్నారు. ఇందుకోసం ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశారు. బీటెక్‌ కోర్సులకు దీటుగా డిగ్రీ విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు నాంది పలికింది. ఇందుకోసం సిలబస్‌లను రూపకల్పన చేసింది.

విద్యార్థులకు ఉపయోగం..
విద్యార్థుల భవిత కోసం ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది. డిగ్రీ చదువు ద్వారా ఉద్యోగం గ్యారెంటీ అనే రీతిలో ఆనర్స్‌ కోర్సులను డిజైన్‌ చేశారు. సిలబస్‌లను మార్పులు చేశారు. నాలుగేళ్ల యూజీ కోర్సు పూర్తిచేస్తే దేశంలో ఎక్కడైనా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నాలుగేళ్లు చదివితే డిగ్రీతోపాటు పీజీ మొదటి సంవత్సరం చేసినట్లు సర్టిఫికెట్‌ వస్తుంది. తర్వాత ఆసక్తి కలిగినవారు పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు. డిగ్రీలో మూడేళ్లు చదివాక నాలుగో ఏడాది బీఈడీ చదువుకోవచ్చు.
– డాక్టర్‌ కణితి శ్రీరాములు, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాతపట్నం

బీఏ ఆనర్స్‌: హిస్టరీ, టూరిజం మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, స్పెషల్‌ ఇంగ్లిష్‌, స్పెషల్‌ తెలుగు మేజర్‌ సబ్జెక్టులగా ఉంటాయి. సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సైకాలజీ మైనర్‌ సబ్జెక్టులుగా ఉంటాయి.
బీకాం ఆనర్స్‌: బీకాం జనరల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బీబీఏ డిజిటల్‌ మార్కెంటింగ్‌, బ్యాంకింగ్‌ ఇన్సూరెన్స్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, అకౌంట్స్‌ ట్యాక్సెస్‌ మేజర్‌ సబ్జెక్టులుగా ఉంటాయి.
బీఎస్సీ ఆనర్స్‌: కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, నానో టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, బోటనీ, హార్టికల్చర్‌, జువాలజీ, అగ్రికల్చర్‌, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ మేజర్‌ సబ్జెక్టులుగా ఉంటాయి. మైనర్‌ సబ్జెక్టులుగా ఫుడ్‌ టెక్నాలజీ ఉంటుంది. ఎంపిక చేసుకున్న కోర్సుకు ఆధారంగా మరికొన్ని మైనర్‌ సబ్జెక్టులుగా ఉంటాయి.

AP Medical Seats 2023 : ఈ వైద్య కళాశాలల్లో 35% సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు.. మిగిలిన‌వి మాత్రం..

డిగ్రీతోపాటు బీఈడీ..
నూతన విద్యావిధానంలో బీఈడీ కోర్సును సైతం ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. న్యూజిలాండ్‌, అమెరికా, కెనడా తదితర దేశాల్లో అధ్యయనం చేసి ఈ కోర్సును అమల్లోకి తెచ్చినట్టు తెలిసింది. డిగ్రీ మూడేళ్లు, బీఎడ్‌ రెండేళ్లు చదవాల్సిన అవసరం లేకుండా.. కేవలం నాలుగేళ్లలోనే (ఒక సంవత్సరం వ్యవధి తగ్గబోతుంది) మొత్తం కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం డీఎస్సీ రాసే అర్హత లభించనుంది.

యూజీ ఆనర్స్‌: మొదటి సంవత్సరం పూర్తి చేస్తే సర్టిఫికెట్‌ ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసిన వారికి డిప్లొమో వస్తుంది. మూడేళ్లు పూర్తిచేస్తే డిగ్రీ, నాలుగో ఏడాది ఉత్తీర్ణులైతే ఆనర్స్‌ పట్టా పొందుతారు. నాలుగేళ్లు ఆనర్స్‌ పూర్తి చేసిన తరువాత పీజీ ఏడాది చదివితే నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది.

#Tags