ESE 2022: కేంద్రంలో ఇంజనీరింగ్‌ కొలువు.. నెలకు రూ.55 వేలకు పైగా వేతనం

బీటెక్‌ పూర్తి చేశారా.. సుస్థిర కెరీర్‌ కోసం అన్వేషిస్తున్నారా.. ఉన్నత హోదా, ఆకర్షణీయమైన వేతనం గురించి ఆలోచిస్తున్నారా.. మీకు సరైన మార్గం.. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(ఈఎస్‌ఈ)!! మూడంచెల ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని.. పలు శాఖల్లో గ్రూప్‌–ఏ, గ్రూప్‌–బీ స్థాయిలో.. ఇంజనీర్లుగా సర్కారీ కొలువు సొంతం చేసుకోవచ్చు! ఆపై అనుభవం, సర్వీస్‌ నిబంధనల ప్రకారం–చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయికి ఎదగొచ్చు!! యూపీఎస్‌సీ ఇటీవల ఈఎస్‌ఈ–2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియ.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్‌ గైడెన్స్‌...
Preparation Guidance
  • ఈఎస్‌ఈ 2022 నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ
  • మొత్తం 247 పోస్టుల భర్తీకి మూడంచెల ఎంపిక ప్రక్రియ
  • కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు కేటగిరీల్లో గెజిటెడ్‌ ర్యాంకు ఉద్యోగం
  • ప్రారంభంలోనే నెలకు రూ.55 వేలకుపైగా వేతనం


యూపీఎస్‌సీ ప్రతి ఏటా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. దీనికి నాలుగు విభాగాల అభ్యర్థులు అర్హులు. అవి.. సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌. ఎంపిక ప్రక్రియలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి..ఇండియన్‌ రైల్వే, టెలికం, డిఫెన్స్‌ సర్వీస్‌ సహా.. దాదాపు 40కి పైగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో గ్రూప్‌–ఏ, గ్రూప్‌–బీ స్థాయి ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీని చేపడతారు.

మొత్తం పోస్టుల సంఖ్య 247

  • ఈఎస్‌ఈ–2022 ద్వారా మొత్తం నాలుగు విభాగాల్లో 247 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.
  • అర్హత: సంబంధిత బ్రాంచ్‌తో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ∙వయో పరిమితి: 01.01.2022 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

  • ఈఎస్‌ఈ ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తారు. అవి..స్టేజ్‌–1(ప్రిలిమినరీ పరీక్ష), స్టేజ్‌–2 (మెయిన్‌), స్టేజ్‌–3 (పర్సనాలిటీ టెస్ట్‌).

స్టేజ్‌–1.. ఆబ్జెక్టివ్‌ విధానం

  • స్టేజ్‌–1గా పిలిచే ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. అవి..
  • పేపర్‌–1 (జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఆప్టిట్యూడ్‌)
  • పేపర్‌–2(సంబంధిత ఇంజనీరింగ్‌ పేపర్‌)
  • పేపర్‌–1ను 200 మార్కులకు, పేపర్‌–2ను 300 మార్కులకు నిర్వహిస్తారు.
  • ప్రిలిమినరీలోని పేపర్‌–1 అన్ని విభాగాల అభ్యర్థులకు ఒకే మాదిరిగా ఉంటుంది.
  • ప్రిలిమినరీ పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు.
  • స్టేజ్‌–1లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఏడు నుంచి ఎనిమిది మంది చొప్పున మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

స్టేజ్‌–2(మెయిన్‌)

  • మెయిన్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది.
  • అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి రెండు పేపర్లలో ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • మెయిన్‌లో ప్రతి పేపర్‌కు కేటాయించిన మార్కులు 300. అంటే మొత్తం 600 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
  • మెయిన్‌లో ప్రతిభ చూపిన వారిని 1:2 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

స్టేజ్‌–3(పర్సనాలిటీ టెస్ట్‌)

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో తుది దశ పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వూ్య). ఇది 200 మార్కులకు జరుగుతుంది. అభ్యర్థులకు ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పట్ల ఉన్న ఆసక్తి, ప్రభుత్వ రంగంలో చేరడానికి కారణాలు, సబ్జెక్ట్‌ నాలెడ్జ్, వ్యక్తిత్వ లక్షణాలు వంటి అంశాలను ఇంటర్వూ్య సందర్భంగా పరిశీలిస్తారు.

విజయం సాధించాలంటే

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. తొలుత సిలబస్‌పై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. సబ్జెక్ట్‌ పేపర్‌లో పూర్తి పట్టు సాధించేలా కృషి చేయాలి.

ప్రిలిమ్స్‌

  • ప్రిలిమ్స్‌ పేపర్‌–1(జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అప్టిట్యూడ్‌)లో.. మొత్తం పది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో మొదటి టాపిక్‌గా పేర్కొన్న జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య సమకాలీన అంశాలు; ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిని మినహాయిస్తే.. మిగతా తొమ్మిది టాపిక్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు తమ అకడమిక్స్‌లో చదివినే. కాబట్టి అకడమిక్‌ సబ్జెక్టుల బేసిక్స్‌పై పట్టుతోపాటు అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌ పెంచుకుంటే ఈ పేపర్‌లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు.
  • ప్రిలిమ్స్‌ పేపర్‌–2లో.. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ సబ్జెక్ట్‌లపై పూర్తి అవగాహన పెంచుకుంటే..సులభంగానే ఈ పేపర్‌ను గట్టెక్కొచ్చు.

మెయిన్‌కు ఇలా

ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఆరు నుంచి ఏడుగురు అభ్యర్థులను (1:6 లేదా 1:7 నిష్పత్తిలో) మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షకు అభ్యర్థులు పూర్తిగా అనలిటికల్‌ అప్రోచ్, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ముందుకు సాగాలి. ఆయా టెక్నికల్‌ టాపిక్స్‌కు సంబంధించి తాజా పరిస్థితులను అన్వయిస్తూ చదవడం ఉపకరిస్తుంది. ఉదాహరణకు సివిల్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌నే పరిగణనలోకి తీసుకుంటే..ఇటీవల కాలంలో ఈ రంగంలో కీలకంగా మారుతున్న టెక్నాలజీని అకడమిక్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో రోబోటిక్స్‌కు సంబంధించిన తాజా డెవలప్‌మెంట్స్‌ను అధ్యయనం చేయాలి. ఇదే వ్యూహాన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ అభ్యర్థులు కూడా అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రిలిమ్స్‌ తర్వాతే మెయిన్స్‌ వైపు

ప్రిలిమ్స్‌లోని పేపర్‌–2, మెయిన్‌లోని రెండు పేపర్లు పూర్తిగా ఇంజనీరింగ్‌ సబ్జెక్ట్‌లకు సంబంధించినవే. వీటిని అనుసంధానం చేసుకుంటూ చదివే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్‌ గట్టెక్కే విధంగా ప్రిపరేషన్‌ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. యూపీఎస్‌సీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం–ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్‌కు దాదాపు ఆరు నెలల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ప్రిలిమ్స్‌ ముగిసాక మెయిన్‌పై దృష్టిసారించడం మేలు చేస్తుంది.

కాన్సెప్ట్‌లపై స్పష్టత

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలో విజయానికి ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌ కాన్సెప్టులపై స్పష్టత పెంచుకోవాలని గత టాపర్లు పేర్కొంటున్నారు. దీంతోపాటు ప్రీవియస్‌ పేపర్లను సాధన చేయడం, మాక్‌ టెస్ట్‌లకు హాజరవడం కూడా మేలు చేస్తుంది. ప్రిలిమ్స్‌లో నెగెటివ్‌ మార్కుల విధానం ఉందనే విషయాన్ని గుర్తించాలి. మెయిన్‌ ప్రిపరేషన్‌లో భాగంగా అకడమిక్‌గా ఇప్పటికే తమకు పట్టున్న టాపిక్స్‌పై మరింత అవగాహన పెంచుకోవాలి.

ఈఎస్‌ఈ–2022 ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్‌ 12, 2021
ప్రిలిమినరీ(స్టేజ్‌–1) పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20, 2022
మెయిన్‌(స్టేజ్‌–2) పరీక్ష తేదీ: జూన్‌ 26, 2022
పర్సనాలిటీ టెస్ట్‌ తేదీలు:ఆగస్ట్‌/సెప్టెంబర్‌ 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/
ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

 

సునిశిత విశ్లేషణ

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌లో విజయానికి క్రిటికల్‌ థింకింగ్‌ ఎంతో మేలు చేస్తుంది. విషయాన్ని సునిశితంగా, తులనాత్మకంగా పరిశీలించడం.. అందులోని కీ పాయింట్లను గుర్తించడం చాలా ముఖ్యం. క్రిటికల్‌ థింకింగ్‌ ద్వారా పరీక్షలో సమాధానాలు ఇవ్వడం సులభమవుతుంది.
– ఎం.వి.రెడ్డి, గేట్, ఐఈఎస్‌ కోర్స్‌ డైరెక్టర్, టైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌

చ‌దవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

#Tags