Unemployment: జూన్ త్రైమాసికంలో తగ్గిన నిరుద్యోగం
- నిరుద్యోగ రేటు 6.6 శాతానికి
- జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం వెల్లడి
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 7.6 శాతంగా ఉన్నట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌వో) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 19వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను విడుదల చేసింది. 15 ఏళ్ల పైన వయసుండి, పనిచేసే అర్హతలు కలిగిన వారిలో, ఉపాధి లేమిని ఈ రేటు సూచిస్తుంటుంది.
చదవండి: AP Skill Development: 13న డోన్‌లో జాబ్ మేళా
2023 జనవరి–మార్చి కాలంలో నిరుద్యోగం 6.8 శాతంగా, 2022 జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్‌లో 7.2 శాతంగా నిరుద్యోగ రేటు ఉండడం గమనించొచ్చు. పట్టణాల్లో 15 ఏళ్లకు పైన మహిళల్లో నిరుద్యోగం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది ఇది 9.2 శాతంగా ఉంది.
పురుషుల్లో నిరుద్యోగ రేటు జూన్ త్రైమాసికంలో 5.9 శాతానికి క్షీణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.1 శాతంగా ఉంటే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 6 శాతంగా ఉండడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.8 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది పట్టణాల్లో 48.5 శాతంగా ఉంది.