NCC training: ఎన్‌సీసీ శిక్షణ భవితకు భరోసా
కూడేరు: ఎన్‌సీసీలో శిక్షణ పొందితే ఉజ్వల భవిత ఉంటుందని తెలుగు రాష్ట్రాల ఎన్‌సీసీ జనరల్ డిప్యూటీ డైరెక్టర్ వీఎం రెడ్డి అన్నారు. కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎన్.రమేష్, ప్రణాళిక–సహకార అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ సంజయ్ గుప్తాతో కలసి బుధవారం ఆయన కూడేరు మండలంలోని ఎన్‌సీసీ నగర్‌ను సందర్శించారు. సీఏటీసీ–6వ ఆంధ్రా బెటాలియన్ శిక్షణా తరగతులు, మౌలిక వసతులు పరిశీలించారు. మ్యాప్‌రీడింగ్, ఆఫ్ట్సికల్, ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లను అభినందించారు.
శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశమూ క్యాడెట్ల బంగారు భవిష్యత్‌కు దోహదపడుతుందన్నారు. ఎన్‌సీసీ ఏ, బీ, సీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయం ఉంటుందన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌సీసీ కేంద్రాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలో ఢిల్లీలో జరిగే తల్ సైనిక్ క్యాంప్‌లో పాల్గొనే క్యాడెట్లను ఇక్కడ శిక్షణ పొందుతున్న వారి నుంచే ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ సందీప్ ముంద్రా, ఎన్‌సీసీ అధికారులు, శ్రీసత్యాసాయి, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన క్యాడెట్లు పాల్గొన్నారు.