IT News: ‘ఐటీ’కి మెటబాలిక్ సిండ్రోమ్!
- ఉద్యోగుల్లో సగం మందికి షుగర్ నుంచి గుండె జబ్బులదాకా అనారోగ్య సమస్యలు
- జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి
- ఎక్కువ సేపు కూర్చునే ఉండటం, వ్యాయామం లేకపోవడంతో సమస్యలు
- తీవ్ర ఒత్తిడి, జంక్ ఫుడ్, సరైన పోషకాలు అందకపోవడం వంటివీ కారణమే..
- ఐటీ సంస్థలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచన
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందిలో మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) పేర్కొంది. ఉద్యోగ హడావుడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె జబ్బుల బారినపడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని.. సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతోపాటు వ్యాయామాలు చేయించడం, ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను చేపట్టడం మంచిదని సూచించింది. –సాక్షి హైదరాబాద్
ఐసీఎంఆర్ నేతృత్వంలో..
భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) నేతృత్వంలో ఎన్‌ఐఎన్ ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో ప్రముఖ ఐటీ హబ్ అయిన హైదరాబాద్‌లో పెద్ద, మధ్య తరహా, చిన్న ఐటీ కంపెనీల్లో విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఉద్యోగాల తీరుతెన్నులు, వాటిలో పనిచేస్తున్నవారి ఆహార అలవాట్లు, జీవనశైలి, వారి ఆరోగ్యం వంటి వివరాలను సేకరించి విశ్లేషించింది. వారిలో 46శాతం మందికిపైగా మెటబాలిక్ సిండ్రోమ్ బారినపడినట్టు గుర్తించింది.
చాలా మందిలో హెచ్‌డీఎల్ (మంచి) కొవ్వులు తక్కువగా ఉండటం, రక్తపోటు, నడుము చుట్టుకొలత వంటివి ఎక్కువగా ఉండటాన్ని గమనించింది. ఐటీ ఉద్యోగులు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు కూర్చునే ఉంటున్నారని.. 22 శాతం మంది మాత్రమే వారానికి కనీసం 150 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలన్న సూత్రాన్ని పాటిస్తున్నారని తేల్చింది.
వ్యాయామం లేకపోవడం, తీవ్ర ఒత్తిడి, పోషకాలు లేని జంక్ ఫుడ్ తీసుకోవడం వంటివి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణం అవుతున్నాయని.. ఇది కాలం గడిచిన కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారితీస్తోందని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్లు మాత్రమేనని.. చిన్నవయసులోనే సమస్యల బారినపడుతున్నారని వివరించారు.
ఏమిటీ మెటబాలిక్ సిండ్రోమ్!
మన శరీరంలో క్రమంకొద్దీ జరగాల్సిన జీవక్రియల్లో తేడాలు రావడం, లోపాలు చోటు చేసుకోవడమే మెటబాలిక్ సిండ్రోమ్. ఊబకాయం, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డీఎల్, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు.. అనే ఐదు ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్లను బట్టి దీన్ని నిర్ధారిస్తారు. నడుము చుట్టుకొలత, అధిక బరువు ఊబకాయాన్ని సూచిస్తాయి.
వైద్య నిపుణుల సూచనల ప్రకారం.. నడుము చుట్టుకొలత పురుషుల్లోనైతే 90 సెంటీమీటర్లకన్నా, మహిళలకు 80 సెంటీమీటర్లకన్నా ఎక్కువగా ఉండటం ఊబకాయానికి సూచిక. ఇక రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 150ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువ ఉండటం అనారోగ్యకరం. ఆరోగ్యకరమైన కొవ్వులైన హెచ్‌డీఎల్ (హైడెన్సిటీ లిపిడ్స్) పురుషుల్లోనైతే 40 ఎంజీ/డెసిలీటర్ కంటే, మహిళల్లో 50 ఎంజీ/డెసిలీటర్ కంటే ఎక్కువగా ఉండాలి.
రక్తపోటు 135/85 కన్నా తక్కువగా ఉండాలి. కనీసం ఎనిమిది గంటలకన్నా ఎక్కువ సమయం ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్నాక రక్తంలో గ్లూకోజు స్థాయిలు 100 ఎంజీ/డెసిలీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ ఐదింటిలో ఏ మూడు వ్యతిరేకంగా ఉన్నా.. సదరు వ్యక్తులు మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టేనని వైద్యులు చెప్తున్నారు.
జీవన శైలిలో మార్పులే పరిష్కారం
- మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారు. తరచూ బయటి ఆహారం (ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్) తినడం తగ్గించుకోవాలని.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలని, వీలైనంత వరకూ కాయగూరలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు.
- ఐటీ ఉద్యోగులు చాలామంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదని వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.సుబ్బారావు గవరవరపు తెలిపారు. దీనికితోడు ఒత్తిడికి లోనవుతుండటం మెటబాలిక్ సిండ్రోమ్‌కు గురయ్యేందుకు దారితీస్తోందని వివరించారు.
- అధ్యయనంలో పాల్గొన్న వారి సంఖ్య తక్కువే అయినా.. సగటున అందరు ఉద్యోగుల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి దాదాపు ఒకేలా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్య నుంచి ఐటీ ఉద్యోగులు బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలనివేదికను ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్‌రెడ్డితో కలసి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
- న్యూట్రియంట్స్’ఆన్‌లైన్ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.