టైలరింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, చదవటం, రాయటం తెలిసిన వారు ఆగస్టు నాలుగో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐదో తేదీ నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 95534 10809, 79933 40407 నంబర్లను సంప్రదించాలి.
వర్షాలకు కూలిన గోడ
సారవకోట: బుడితి గ్రామంలోని గొడగల వీధికి చెందిన ముంజేటి సింహాచలం ఇంటి గోడ వర్షాలకు బుధవారం కూలి పోయింది. నాలుగు రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో గోడ నానిపోయి కూలి పోయినట్లు బాధితుడు తెలిపాడు. గోడ కూలిన సమయంలో ఎవ్వరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది.
కొండచిలువ హతం
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ పరిధి బెల్లుపడ గ్రామంలో భారీ కొండచిలువ బుధవారం హల్‌చల్ చేసింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రినాథపేట కాలనీ సమీపంలోని కొండపై నుంచి సుమారు ఏడడుగుల కొండచిలువ బెల్లుపడ గ్రామంలోకి చొరబడింది. ఓ ఇంట్లోకి వెళ్లిన కొండచిలువ అక్కడ ఉన్న కోళ్లను మిగేందుకు ప్రయత్నించగా.. అవి అరవడంతో ఇంట్లో ఉన్నవారు వచ్చి చూడగా కొండచిలువ కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కొంతమంది ధైర్యం చేసి అక్కడ నుంచి కొండచిలువను తరిమేసేందుకు ప్రయత్నించగా వారిపై తిరగబడడంతో చేసేదిలేక కర్రలతో కొట్టి హతమార్చారు.
నేడు కిసాన్ సమృద్ధి కేంద్రాల ఏర్పాటు
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న కిసాన్ సమృద్ధి కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభిస్తున్నట్టు బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సమ్మాన్ నిధిని దేశప్రధాని నరేంద్రమోదీ గురువారం రైతు ఖాతాల్లో జమ చేస్తారన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 144 రైతు సమృద్ధి కేంద్రాలు తొలి విడతగా గుర్తింపబడ్డాయన్నారు. ఇకపై అయా కేంద్రాల్లో రైతుకు సంబంధించిన అన్ని పనిముట్లు ఒకే వేదిక ద్వారా రైతుకు అందించడం కిసాన్ సమృద్ధి కేంద్రాల ప్రధాన ఉద్దేశమన్నారు. శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్‌లో హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఒకటిన సామూహిక
సత్యనారాయణ వ్రతాలు
ఎచ్చెర్ల క్యాంపస్: చిన్నకొంగరాం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటో తేదీన సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు ప్రొగ్రాం ఆర్గనైజర్ ఎం.లలితకుమారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామంలోని రామాలయంలో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వ్రతాలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి ఉన్న దంపతులు పూజా సామగ్రితో హాజరు కావాలని, సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98669 14160, 95537 45950 నంబర్లను సంప్రదించాలి.
వేధిస్తున్నారని ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: తన భర్త కట్నం కోసం వేధిస్తున్నారని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెందిన మహిళ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ బలివాడ గణేష్ బుధవారం తెలిపారు. విశాఖపట్నం ఎన్టీపీసీఎస్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న తన భర్తకు ఇది వరకే వివాహమైందని.. ఆ విషయాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకోవడమేకాకుండా.. కట్నం తెమ్మంటూ మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
నేడు వర్సిటీలో ప్లేస్‌మెంట్ డ్రైవ్
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల27, 31వ తేదీల్లో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వర్సిటీలో బుధవారం వివరాలు వెల్లడించారు. గురువారం ఏట్రోడ్ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందని, ఎంపికై న అభ్యర్థులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుందని, సీఎస్‌ఈ, ఈసీఐ, ఎంసీఏ పూర్తిచేసిన వారు అర్హులని వివరించారు. 31న ఏప్రోనిక్స్ సంస్థ నిర్వహించే ఇంటర్వ్యూలకు డిప్లమా, ఇంజినీరింగ్, బీఎస్సీ పూర్తిచేసిన వారు అర్హులని, ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి గల వారు వర్సిటీ ప్లేస్‌మెంట్ అధికారి కె.విద్యాసాగర్ (9848819969)ను సంప్రదించాలని సూచించారు.