Skip to main content

Ukraine : మన వారు ఉక్రెయిన్‌ బాట పట్టడానికి కారణం ఇదే..!

ఎప్పుడు ఎటు వైపు నుంచి ఏ క్షిపణి దూసుకువస్తుందో తెలీదు. ఏ క్షణాన ఏ బాంబు నెత్తి మీద పడుతుందో ఊహించలేం.
Ukraine Education
Ukraine Education

ఉక్రెయిన్‌లో మన విద్యార్థులు క్షణక్షణం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడుపుతున్నారు. కేంద్రం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక విమానాల్లో వెనక్కి తీసుకొస్తున్నా మరో 14 వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుబడ్డారు. సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. కర్ణాటకకు చెందిన విద్యార్థి బాంబు దాడికి బలవడంతో భయపడిపోతున్నారు. వైద్య విద్య కోసం వేలాదిగా ఉక్రెయిన్‌ ఎందుకు వెళ్తున్నారని ప్రశి్నస్తే, తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత అన్న సమాధానమే వస్తోంది... 

వైద్య విద్యలో నాణ్యత : 

Education


ఉక్రెయిన్‌ వైద్య విద్యకు ప్రసిద్ధి చెందింది. ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనివర్సిటీలకు నాణ్యమైన విద్య అందిస్తాయని పేరుంది. వైద్యవిద్యలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో అత్యధిక విద్యార్థులు చదివే దేశాల జాబితాలో యూరప్‌లో ఉక్రెయిన్‌ నాలుగో స్థానంలో ఉంది. అందుకే తల్లిదండ్రులు ఎక్కువగా ఉక్రెయిన్‌ వైపు మొగ్గుచూపిస్తున్నారు. 

ప్రపంచ స్థాయి గుర్తింపు : 
ఉక్రెయిన్‌ మెడికల్‌ కాలేజీల డిగ్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. యునెస్కో, డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థల గుర్తింపు ఉక్రెయిన్‌ కళాశాలలకు ఉంది. వరల్డ్‌ హెల్త్‌ కౌన్సిల్‌ సహా వివిధ దేశాలు ఈ డిగ్రీని గుర్తించాయి. దీంతో యూరప్‌ దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనేవారికి ఉక్రెయిన్‌లో చదవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. 

ఫీజులు తక్కువ.. 
ఉక్రెయిన్‌లో తక్కువ ఖర్చుతోనే మెడిసన్‌ పూర్తవుతుంది. భారత్‌లో దండిగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు కాలేజీల్లో చదివించడం కంటే ఉక్రెయిన్‌లో ప్రభుత్వ కాలేజీల్లో సీటొస్తే అక్కడకి పంపించడానికే తల్లిదండ్రులు సుముఖత చూపిస్తున్నారు. ఆరేళ్ల మెడిసిన్‌ కోర్సుకు ఉక్రెయిన్‌లో ఏడాదికి రూ.4–5 లక్షలు అవుతుంది. అంటే  రూ.17–20 లక్షలు ఖర్చు చేస్తే డిగ్రీ చేతికొస్తుంది. ఖర్చులన్నీ కలుపుకున్నా 25 లక్షలు దాటదు. అదే మన దేశంలో ప్రైవేటు కాలేజీలో ఏడాదికి కనీసం రూ.10–12 లక్షల పై మాటే. నాలుగున్నరేళ్ల కోర్సుకి రూ.50 లక్షల నుంచి 70 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.        

ప్రవేశ పరీక్ష అవసరం లేదు.. 
మన దేశంలో మెడిసిన్‌ సీటుకు తీవ్రమైన పోటీ ఉంటుంది. లక్షలాది మందితో పోటీ పడి జాతీయ స్థాయిలో నీట్‌ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 84 వేల వరకు ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. గతేడాది 16.1 లక్షల మంది నీట్‌ పరీక్ష రాశారు. అంత పోటీని తట్టుకొని సీటు సాధించడం సులువు కాదు. కానీ ఉక్రెయిన్‌లో సీటు కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షా రాయాల్సిన పని లేదు. బోధన ఇంగ్లిష్‌లో ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాల్లో మాదిరిగా ప్రత్యేకంగా విదేశీ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా వైద్య విద్య పూర్తవుతుంది. 

భారత్‌లో ప్రాక్టీసుకు లైసెన్స్‌.. 
విదేశీ ఎంబీబీఎస్‌ డిగ్రీతో మన దేశంలో ప్రాక్టీస్‌ చేయాలంటే నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ) పాసవ్వాల్సి ఉంటుంది. ఏటా సగటున ఉక్రెయిన్‌ నుంచి 4 వేల మంది మెడికల్‌ డిగ్రీలతో వచ్చి ఈ పరీక్షలు రాస్తారు. వీరిలో 700 మంది దాకానే ఉత్తీర్ణులవుతారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌ యూనివర్సిటీలకు భారత్‌ విద్యార్థుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది.

ఏడాదికి  54.2 కోట్ల డాలర్ల ఆదాయం.. ఇంకా
సోవియట్‌ యూనియన్‌ విచి్ఛన్నం కాకముందు అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీలన్నీ ఉక్రెయిన్‌లో ఉండేవి. విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి, తమ ఆదాయం పెంచుకోవడానికి ఇటీవల ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. యూనివర్సిటీ డీన్‌లు భారత్‌ సహా వివిధ దేశాల్లో పర్యటించి విద్యార్థుల్ని ఆకర్షించేలా ప్రచారం చేశారు. ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని దేశానికి రప్పించారు. విదేశీ విద్యార్థుల ద్వారా ఉక్రెయిన్‌కు ఏడాదికి 54.2 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది.’’ 
                                     – యుక్తి బెల్వాల్, బుక్‌మైయూనివర్సిటీ, భారతీయ విద్యా కన్సల్టింగ్ సంస్థ 

ఉక్రెయిన్‌లో విదేశీ.. 

విద్యార్థుల సంఖ్య : 80 వేలు 
ఎన్ని దేశాల నుంచి.. : 155                             
భారతీయ విద్యార్థులు : 18,095 
విదేశీయుల్లో భారతీయ విద్యార్థుల శాతం : 24%  
ప్రతీ ఏడాది వెళ్లే విద్యార్థులు : దాదాపుగా 4 వేలు

Published date : 02 Mar 2022 03:09PM

Photo Stories