Heavy Rains: 'భారీ వర్షాలు, సంక్రాంతి పండుగ'.. విద్యార్థులకు సెలవులు.. ఎక్కడ, ఎన్నిరోజులంటే..
రాజధాని చెన్నైతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జనవరి 7వ(ఆదివారం) తేదీ సాయంత్రం భారీ వర్షం కురవడంతో పలు నగరాలు నీట మునిగాయి. దీంతో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ వర్షం కారణంగా రాజధాని చెన్నై నగరంలో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, నాగపట్టణం, విల్లుపురం, కడలూరు, కళ్లకుర్చి, రాణిపే, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తుండంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాణిపేట, వేలూరు, తిరువణ్ణామలై, నాగపట్నం, కిల్వేలూరు తాలుకా, విల్లుపురం, కడలూరు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలతోపాటు అన్ని రకాల విద్యాసంస్థలకు జనవరి 8(సోమవారం) అధికారులు సెలవు ప్రకటించారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, జూనియర్ కాలేజీ విద్యార్థులకు జనవరి 14 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది.
వచ్చే వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
వర్షాల కారణంగా పాత కుర్తాళం జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడాన్ని నిషేధించామని అధికారులు తెలిపారు. తమిళనాడులోని నాగపట్నంలో జనవరి 7వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి జనవరి 8వ తేదీ ఉదయం 5.30 గంటల మధ్య అత్యధికంగా 167 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణశాఖ తెలిపింది.