Schools Holidays: దేశంలో కరోనా కలకలం.. స్కూళ్లకు సెలవులు
గడిచిన 24 గంటల్లో 366 కోవిడ్-19 కొత్త పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 18,67,572కి చేరింది. ఢిల్లీలోని స్కూల్స్‌లో కరోనా బీభత్సం సృష్టించింది. ఇప్పటికే కరోనా సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఏప్రిల్16వ తేదీన(శనివారం) మరో 14 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు మార్గదర‍్శకాలను జారీ చేసింది.
వేరే మార్గం లేకనే..
ఈ సందర్బంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఢిల్లీ స్కూల్స్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. అందుకే వేరే మార్గం లేక పాఠశాలలను మూసివేస్తున్నట్టు చెప్పారు.
వేసవి సెలవులను..
రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేదు. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు పూర్తి కాగానే వారికి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని జగన్ సర్కారు యోచిస్తోంది. మరోవైపు ఏపీలోని జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులుగా ప్రకటించారు. తిరిగి జూన్ 13న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి.