School Re Union : 75 ఏళ్ల వయసులో పాఠశాల స్నేహితులతో సందడి.. తిరిగి బాల్యంలోకి..
చౌడేపల్లె: చౌడేపల్లె ఉన్నత పాఠశాలలో 1965–66లో వారంతా ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివారు. ప్రస్తుతం వారి వయస్సు 75 ఏళ్లు. కాలగమనంలో వారంతా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. తమ పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. మరికొందరి మనవలు, మనవరాళ్లకు సైతం వివాహాలయ్యాయి. మునిమనవలు, మునిమనవరాళ్లతో కాలం గడుపుతున్న ఆ వయోజనులు మళ్లీ తమ బాల్యం జ్ఞాపకాలు పేజీలు తిరగేస్తూ తమ సహచరుల కోసం అన్వేషించారు. ఏడాది పాటు శ్రమించారు. అప్పట్లో చదివిన వందమందిలో అతికష్టం మీద 39 మంది వివరాలు సేకరించారు.
వృద్ధాప్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడుతున్నా తమ సహచరుల్ని చూడాలనే బలీయమైన కోరిక ముందు వాటిని లెక్కచేయలేదు. అందరూ రెక్కలు కట్టుకుని వాలిపోయారు. అరేయ్..ఒరేయ్..ఏమ్మే..అంటూ పలకరింపుల ఆనందానుభూతుల వెల్లువలో తడిసి ముద్దయ్యారు. తాము పారేసుకున్న బాల్యం మిగిల్చిన జ్ఞాపకాల్లోకి విహరించారు. ఆదివారం దీనికి విజయవాణి నగర్ వేదికైంది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నాయుని చంద్రశేఖర్ మూర్తి అయ్యారు. తన స్నేహితుడు కేసీ నాయుడు సహకారంతో అప్పటి తమ ఎస్‌ఎస్‌ఎల్‌సీ బ్యాచ్ మిత్రుల చిరునామాలు సేకరించారు.
ఆదివారం అందరూ కలవాలని నిర్ణయించుకున్నారు. కుప్పం, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ప్రొద్దుటూరు..తదితర ప్రాంతాల నుంచి మొత్తం 39మంది పూర్వ విద్యార్థులు వచ్చారు. వీరిలో చాలామంది వివిధ రంగాల్లో ఉద్యోగ విరమణ పొందిన వారే. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. పరస్పర పరిచయాలయ్యాక తమ గురుదేవులకు, భౌతికంగా లేని సహచరులకు నివాళులు అర్పించారు.
US and Japan: అమెరికా-జపాన్ సైనిక ఒప్పందం.. ఇక చైనాకు..
అనంతరం ఛలోక్తులు విసురుకుంటూ రోజంతా సందడి చేశారు. ఆరు దశాబ్దాల ‘కాలం’ తెచ్చిన మార్పులు, పరిణామాలను అవలోకనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరినీ చంద్రశేఖర్ నాయుడు జ్ఞాపిక, శాలువతో సత్కరించి తమ స్నేహ పరిమళాన్ని, ఆత్మీయతను పంచారు. ఇన్నేళ్ల తర్వాత తాము కలవడం చెప్పలేనంత సంతోషానికి గురి చేసిందంటూ అందరూ జ్ఞాపకాలతో రీచార్జ్ అయి సాయంత్రం స్వస్థలాలకు పయనమయ్యారు.