APSCHE Chairman: న్యాయ విద్యార్థులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి
జేకేసీ కళాశాలరోడ్డులోని జాగర్లమూడి చంద్రమౌళి (జేసీ) న్యాయ కళాశాలలో మూడవ జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలను శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ పోటీలతో ప్రతిభకు మెరుగులు దిద్దుకోవచ్చని అన్నారు. భావి న్యాయవాదులుగా ఎదిగే విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు అందించినప్పుడు కలిగే మానసిక ఆనందం మాటలకు అందనిదని పేర్కొన్నారు. పుస్తక పఠనం ద్వారా అపరిమిత పరిజ్ఞానాన్ని పొందవచ్చని, కళాశాలలో గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. కళాశాల కార్యదర్శి వేమన కుప్పుస్వామి మాట్లాడుతూ న్యాయవాదులకు నిశిత పరిశీలన అవసరమని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టినేని సుధాకర్‌బాబు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లోని 32 కళాశాలల నుంచి న్యాయ విద్యార్థులు పోటీలకు హాజర య్యారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షుడు జాగర్లమూడి మురళీమోహన్, నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.