Skip to main content

JNTUA: జేఎన్‌టీయూఏ క్యాంపస్‌లో కొత్తగా ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు..

JNTUA

అనంతపురం: మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిశ్రమల అవసరాలకు దీటుగా మానవ వనరులను అందించే క్రమంలో జేఎన్‌టీయూఏ క్యాంపస్‌ కళాశాలలో సరికొత్త కోర్సును అమలు చేసేందుకు సన్నాహాకాలు సాగుతున్నాయి. 78 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన జేఎన్‌టీయూఏ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రతిష్టాత్మక బ్రాంచ్‌లతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులూ ఉన్నారు.

ఈ క్రమంలో బీటెక్‌లో కొత్త కోర్సు అమలుకు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) అనుమతులు జారీ చేసింది. దీంతో బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సు అమలుకు మార్గం సుగమమైంది.

ఇది వరకు జేఎన్‌టీయూఏ క్యాంసస్‌ కళాశాలలో మెకానికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌ కోర్సులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సుతో 7 బ్రాంచ్‌లు కానున్నాయి.


మెరుగైన ఉపాధి అవకాశాలు..
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కించుకున్న జేఎన్‌టీయూఏ క్యాంపస్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేయాలనే ఆకాంక్ష ఎంతో మంది విద్యార్థులకు ఉంది. ఏటా క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా పేరెన్నిక గల బహుళజాతి సంస్థల్లో 350 మందికి పైగా విద్యార్థులు కొలువులు దక్కించుకుంటున్నారు. దీంతో ఈ కళాశాలలో ఇంజినీరింగ్‌ అడ్మిషన్లకు భారీగా డిమాండ్‌ నెలకొంది.

CSE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా.. లాభాలు ఇవే..!

అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులు తమ తొలి ఆప్షన్‌ను జేఎన్‌టీయూఏ క్యాంపస్‌ కళాశాలకే ఇస్తుండడం ఇందుకు నిదర్శనం. దీంతో ఏపీఈఏపీసెట్‌ (గతంలో ఎంసెట్‌) గణనీయమైన ర్యాంకులు దక్కిన వారికే జేఎన్‌టీయూఏ క్యాంపస్‌ కళాశాలలో సీటు దక్కుతుంది. ఈ క్రమంలో బీటెక్‌లో అదనంగా ఓ బ్రాంచ్‌ ఏర్పడితే గొప్ప సదావకాశంగా భావిస్తారు.

సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగంలో మొత్తం 360 ఇంజినీరింగ్‌ సీట్లు ఉన్నాయి. తాజాగా కొత్త బ్రాంచ్‌ ఏర్పడితే మరో 60 ఇంజినీరింగ్‌ సీట్లు వస్తాయి. ప్రస్తుత మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సును జేఎన్‌టీయూఏ క్యాంపస్‌ కళాశాలలో ప్రవేశపెడితే రాయలసీమ ప్రాంత విద్యార్థులకు గొప్ప అవకాశం దక్కినట్లే.


విదేశీ విద్యార్థులకు ఆహ్వానం..
జేఎన్‌టీయూఏకు న్యాక్‌ –ఏ గ్రేడ్‌ హోదా దక్కడం, అన్ని విభాగాలకు ఎన్‌బీఏ గుర్తింపుతో పాటు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంక్‌ కలిగి ఉండడంతో విదేశీ విద్యార్థులు సైతం ఇక్కడ చదువుకోవడానికి వీలు కలుగుతోంది. ఈ విషయంగా విదేశీ విద్యార్థులకు ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌) అండగా నిలుస్తోంది.

ఆసక్తి గల విద్యార్థులు వర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ ఉపకారవేతనాలు అందుతాయి. విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటే పరస్పర ఆలోచనా మార్పిడి, పరిశోధన, అధ్యయనంలో ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందడంతో పాటు సంస్కృతీసంప్రదాయాలపై మరింత గౌరవ భావం పెరుగుతుంది.

JEE Advanced Answer Key: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఆన్సర్ కీ విడుదల..

ఈ ఉద్ధేశ్యంతో విదేశీ విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 30 మంది విదేశీ విద్యార్థులు జేఎన్‌టీయూఏలో బీటెక్‌, ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తు చేసుకున్నారు.

Published date : 03 Jun 2024 04:21PM

Photo Stories