Skip to main content

AP CM YS Jagan : 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన..ఫీజుల చెల్లింపు వివ‌రాలు ఇలా..

సాక్షి, అమరావతి: కరోనా సమయంలో కూడా విద్యార్థుల చదువులకు ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట మేరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లిస్తున్నారు.
AP CM YS Jagan Mohan Reddy
AP CM YS Jagan Mohan Reddy

అందులో భాగంగా ఈ ఏడాది మూడో విడతగా 11.03 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద రూ.686 కోట్లు న‌వంబ‌ర్ 30వ తేదీన‌ సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేశారు.

కుటుంబంలో ఎంతమంది ఉన్నా..
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 'ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం. 2021 ఏప్రిల్‌ 19న మొదటి విడత.. జూలై​ 29న జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో జమచేశాం. పేదరికం చదువుకు అవరోధం కారాదు. ఉన్నత చదువులు అభ్యసిస్తేనే తల రాతలు మారుతాయి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నాం. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న ఫీజులు కాలేజీలకు తప్పకుండా కట్టాలి. లేకుంటే నేరుగా కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది' అని సీఎం జగన్‌ అన్నారు. 

సీఎం జగన్‌ మాటల్లోని ముఖ్యాంశాలు..
►నాన్నగారు ఫీజు రియంబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఈ పథకాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. కాలేజీలకు ఏళ్లతరబడి బకాయి పెట్టారు. దీనివల్ల కాలేజీల్లో నాణ్యతను అడిగే పరిస్థితి ఎలా వస్తుంది?. కాలేజీకి రావొద్దని, పరీక్షలు రాయనివ్వమని అన్న ఘటనలు కూడా మనం చూశాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. అలాంటి పరిణామాల నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాదయాత్రలో నాకు ఎదురైంది. ఇలాంటి పరిస్థితులు ఎవ్వరికీ రాకూడదనే అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకేశాం. 

►అర్హులైన విద్యార్థులందరికీ కూడా వందకు వందశాతం పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా.. వారికి పూర్తిగా ఫీజు రియంబర్స్‌మెంట్‌ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఐటీఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌.. ఈకోర్సులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. తల్లిదండ్రుల ఖాతాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జమచేస్తున్నాం. కాలేజీలకు పిల్లల తల్లులే వెళ్లి కాలేజీల పరిస్థితులను, వసతులను చూసి.. కాలేజీలకు ఫీజులు చెల్లించే బాధ్యతలను తల్లిదండ్రులకే అప్పగిస్తున్నాం. లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను వాళ్లు ప్రశ్నించగలుగుతారు. దీనివల్ల కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుంది.

దయచేసి ప్రతి తల్లీ కూడా..
మీ ఖాతాల్లో జమ అయిన సొమ్మును వారం రోజుల్లోపు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు కాలేజీలకు ఇవ్వకపోతే.. మీ ఖాతాలకు కాకుండా.. ఆ ఫీజుల సొమ్మును ఇవ్వక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. దయచేసి ప్రతి తల్లీ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో మెరిట్ ఉన్నా.. ఆర్థిక భారం కారణంగా ప్రైవేట్‌ కాలేజీలు, ప్రైవేటు యూనివర్శిటీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు పొందలేని పరిస్థితి గతంలో ఉండేది. వీటిలో మార్పులు తీసుకు వచ్చాం. అన్ని ప్రైవేటు యూనివర్శిటీల్లో మెడికల్, డెంటల్‌ అయితే కచ్చితంగా యాభైశాతం, ఇతర కోర్సుల్లో అయితే 35 శాతం సీట్లు గవర్నమెంటు కోటాలో భర్తీ చేయాలని మార్పులు తీసుకు వచ్చి చట్టం చేశాం. ఇంతకుముందు అవకాశంలేని పేద విద్యార్థులకు అవకాశం వస్తోంది. ఈ ఏడాది దాదాపు 2118 విద్యార్థులకు అవకాశం వచ్చింది. వీరికి పూర్తి ఫీజు రియంబర్స్‌ మెంట్‌ఇస్తున్నాం. ప్రతిభ ఉన్న అర్హులైన పేదవిద్యార్థులకు గతానికి భిన్నంగా చదువుకునే అవకాశం లభించింది. మనసున్న ప్రభుత్వంగా మనం ఇవన్నీ చేస్తున్నాం.

జగనన్న వసతి దీవెన కింద..
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనల ద్వారా చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సర్వే రిపోర్టులో మన రాష్ట్రంలో ఉన్నత విద్యకోసం కాలేజీల్లో చేరే విద్యార్థల జీఈఆర్‌ రేష్యో 2020 నాటికి 35.2 శాతానికి పెరిగింది. 2018 –19 తో పోలిస్తే.. 2019–20 మధ్య పెరుగుదల దేశవ్యాప్తంగా 3.04 అయితే, మన రాష్ట్రంలో 8.6శాతంగా నమోదయ్యింది. జీఈఆర్‌ దేశవ్యాప్తంగా ఎస్సీల్లో 1.7శాతం, ఎస్టీల్లో 4.5 శాతం, బాలికల్లో 2.28శాతం  ఉంటే.. మన రాష్ట్రంలో ఎస్సీల్లో 7.5, ఎస్టీల్లో 9.5శాతం.. విద్యార్థినుల్లో 11.03శాతంగా నమోదయ్యింది. చదువుల కోసం భారం ఉండకూడదు. గొప్ప చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలి. దేశం కన్నా మనం మెరుగ్గా ఉన్నాం ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయతో ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్‌ చదివేవాళ్లకి రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి రూ.20వేలు ఇస్తున్నాం. ఇప్పటివరకూ 2,267 కోట్ల రూపాయలు ఇచ్చాం. మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నాం. విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాలకి కలిపి ఈ రెండు ఏళ్లలో రూ.8,500 కోట్లకుపైగా ఇచ్చాం.

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు..
►విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్టీయూ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం
►ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని తీసుకువస్తున్నాం
►కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీని తీసుకువస్తున్నాం
►కురుపాంలో ఇంజినీరింగ్‌కాలేజీ, సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ తీసుకువస్తున్నాం
►2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం
►నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీకాలేజీల్లో 880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నాం
►మరో 2 సంవత్సరాల్లో ఇవన్నీకూడా పూర్తిగా పనులు అవుతాయి
►డిగ్రీ కోర్సుల్లో కూడా మార్పులకు శ్రీకారం చుట్టాం
►ఇంగ్లీష్‌ మీడియం వైపు అడుగులువేస్తున్నాం
►టెక్ట్స్‌ బుక్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ తెలుగు ముద్రిస్తున్నాం
►ఉద్యోగాలు ఇచ్చే కోర్సులుగా వీటిని తీర్చిదిద్దుతున్నాం
►ఏకంగా 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నాం
►ఒక స్కిల్‌ యూనివర్శిటీని కూడా తీసుకువస్తున్నాం

కాగా, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్ల బకాయిలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.6,259 కోట్లు ఫీజు చెల్లించారు. ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ విద్యా పథకాల కింద 1,97,38,694 మంది విద్యార్థులకు రూ.34,753.17 కోట్ల వ్యయం చేశారు.   

పేదరికం విద్యకు అడ్డు కాకూడదు: మంత్రి ఆదిమూలపు సురేష్‌
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. 'పేదరికం విద్యకు అడ్డు కాకూడదు. టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడిచింది. కానీ మన ప్రభుత్వం కోవిడ్‌ పరిస్థితుల్లోనూ జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నామని' ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Published date : 30 Nov 2021 12:57PM

Photo Stories