Skip to main content

Intermediate: కష్టాల్లో ఇంటర్‌ విద్య..!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2020తో పోలిస్తే ఈసారి 10 శాతం మేర ప్రవేశాలు పెరిగాయి.
Intermediate
కష్టాల్లో ఇంటర్‌ విద్య..!

సెప్టెంబర్ మొదటి వారానికే 1.10 లక్షల మంది సర్కారీ కాలేజీల్లో చేరారు. అడ్మిషన్ గడువు అక్టోబర్ 20 వరకూ పొడిగించడంతో విద్యార్థుల సంఖ్య ఇంకా పెరిగే వీలుంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, కొన్ని వర్గాల ఆదాయం పడిపోవడం, ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన వసతులు, క్రీడా స్థలాలు అభివృద్ధి చెందడంతో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఇదో గొప్ప మార్పుగా అధికారులు చెప్పుకున్నారు. అయితే ఈ సంతోషం ఎక్కువకాలం ఉండేలా కనిపించట్లేదు. బోర్డు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పరిష్కారం దిశగా ఏ ప్రయత్నమూ చేయట్లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

భారమైన బోధన...

రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలోకొచ్చినా ఇప్పటివరకూ అధ్యాపకుల కొరత వెంటాడుతూనే ఉంది. దాదాపు 1,700 మంది అతిథి అధ్యాపకుల సేవల పొడిగింపుపై ఇంతవరకూ నిర్ణయం వెలువడలేదు. గత నెల నుంచి ప్రత్యక్ష తరగతులు మొదలైనప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. గతేడాది మూడు నెలలపాటు చేసిన సేవలకు ఇంకా వేతనాలు ఇవ్వలేదని గెస్ట్ లెక్చరర్లు లబోదిబోమంటున్నారు. బోర్డు నిర్లక్ష్యం వల్ల గెస్ట్ లెక్చరర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళన చేపడతామని తెలంగాణ అతిథి అధ్యాపకుల జేఏసీ ఆదివారం సమావేశమై నిర్ణయించినట్లు జేఏసీ ప్రతినిధి దేవేందర్ కుంట తెలిపారు.

గుర్తింపు గోల...

రాష్ట్రంలో దాదాపు 1,500 ప్రైవేటు కాలేజీలుంటే ఇంకా 400 కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. కానీ కాలేజీలు మాత్రం విద్యార్థుల దగ్గర రూ. వేలల్లో ఫీజులు దండుకున్నాయి. అయితే నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లో పరిస్థితులు లేవనేది బోర్డు వాదన. అగ్నిప్రమాదం జరిగినా విద్యార్థులను రక్షించలేని దుస్థితిలో ఉన్న వాటికే గుర్తింపు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇది నిజమే అయినప్పటికీ కాలేజీల్లో చేరిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి? దాదాపు లక్ష మంది విద్యార్థుల భవిష్యత్ ఏమిటనే దానిపై బోర్డు స్పష్టత ఇవ్వట్లేదు.

చదివే వేళ పరీక్షల గోల...

ఇంటర్ క్లాసులు ఇప్పుడిప్పుడే అరకొరగా మొదలయ్యాయి. ఇదే సమయంలో బోర్డు ఫస్టియర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. కరోనా వల్ల ప్రమోట్ చేసిన 4.75 లక్షల మంది విద్యార్థులకు ఈ నెల 25 నుంచి పరీక్షలు పెడతామని టైంటేబుల్ ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో చదివే వారు లక్ష మందికిపైనే ఉంటారు. పరీక్షల అనంతరం స్పాట్ వ్యాల్యుయేషన్ లోనే లెక్చరర్లు నిమగ్నమైతే బోధన సాగేదెలా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అధ్యాపకుల కొరత కారణంగా సెకండియర్లోనే కాదు.. ఈసారి ఫస్టియర్ విద్యార్థులకూ బోధన కష్టంగా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం కష్టమని విద్యార్థులు అంటున్నారు. గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఇది కూడా విద్యార్థులకు శాపమైంది. ప్రత్యక్ష తరగతులకు వెళ్లడం సమస్యగా మారింది. మరోవైపు మొదటి, రెండో ఏడాది ఇంటర్లో 30 శాతం సిలబస్ తగ్గిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఆ పాఠాలు ఏమిటనేది చెబితే తప్ప బోధన సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.

గందరగోళం సృష్టిస్తున్నారు...

ఇప్పుడిప్పుడే ఇంటర్ విద్య గాడిలో పడుతోంది. ప్రభుత్వ కాలేజీలను నమ్మి పేద విద్యార్థులు చేరుతున్నారు. అధ్యాపకుల కొరత వెంటాడుతుంటే ఇంటర్ ఫస్టియర్ పరీక్షల పేరుతో అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారు. సమస్యల పరిష్కారం దిశగా అన్ని సంఘాలతో ఉన్నతాధికారులు చర్చిస్తే బాగుటుంది.

– మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్

Published date : 04 Oct 2021 04:46PM

Photo Stories