Skip to main content

పల్లెటూరి పిడుగులు.. ఆటల్లో అదుర్స్..!

పల్లెటూరి అమ్మాయిలు.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.. రైతు బిడ్డలు ఆటల్లో రాణిస్తూ రాజసం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీల్లో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తాచాటి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే ఏపీ జట్టుకు ఎంపికయ్యారు. దీంతో అక్టోబర్‌ 27 నుంచి గుజరాత్‌లో ప్రారంభమైన జాతీయస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు క్రీడాకారులు వెళ్లారు. వీరంతా రైతుబిడ్డలే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..
పల్లెటూరి పిడుగులు.. ఆటల్లో అదుర్స్..!
పల్లెటూరి పిడుగులు.. ఆటల్లో అదుర్స్..!

అక్టోబర్ 23, 24 తేదీల్లో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన 39వ రాష్ట్రస్థాయి అండర్–19, సబ్ జూనియర్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. అండర్–19 విభాగంలో వైఎస్ఆర్ జిల్లా జట్టు వరుస విజయాలను సాధిస్తూ సెమీఫైనల్కు చేరుకుంది. సెమీస్లో ఓడిపోవడంతో నాల్గవ స్థానంలో నిలిచింది. కాగా అండర్–19 మహిళల విభాగంలో జిల్లాకు చెందిన వి. గౌతమి, రాధికలు రాణించడంతో జిల్లా జట్టు వరుసగా మూడు విజయాలు సాధించింది. దీంతో వీరి ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు వీరిని అండర్–19 ఏపీ మహిళల జట్టుకు ఎంపికచేశారు. అదే విధంగా అండర్–19 పురుషుల విభాగంలో ఎస్. రెహమాన్, సబ్ జూనియర్ విభాగంలో టి. సుష్మితలను ఏపీ జట్టుకు ఎంపిక చేశారు. దీంతో వీరంతా ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు గుజరాత్లో నిర్వహించనున్న 39వ జాతీయస్థాయి షూటింగ్బాల్ పోటీల్లో పాల్గొంటున్నారు. జిల్లా క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచి నాల్గవ స్థానంలో నిలవడంతో పాటు జాతీయ స్థాయిలో పాల్గొనే ఏపీ జట్టుకు నలుగురు క్రీడాకారులు ఎంపికవడం పట్ల జిల్లా షూటింగ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాదినేని నిత్యపూజయ్య సంతోషం వ్యక్తం చేశారు.

‘వీర’ గౌతమి..Gouthami.jpg

వీరబల్లికి చెందిన సాధారణ రైతు వెంకటయ్య, చిన్నమ్మిల కుమార్తె అయిన వి. గౌతమి ఏపీ షూటింగ్బాల్ జట్టుకు ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆమె సర్వీస్ చేస్తే ప్రత్యర్థులు పాయింట్ కోల్పోవాల్సిందే అనే విధంగా ఆమె సర్వీస్ ఉండటంతో ఏపీ జట్టులో తొలిపేరు ఆమెదే ఉండటం విశేషం. వీరబల్లి ఎస్.డి.కె.ఆర్. డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈమె వాలీబాల్ క్రీడలో సైతం రాణించారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది.

‘రాణి’స్తున్న రాధిక..radhika

చిన్నమండెం మండలం, మల్లూరు పంచాయతీకి చెందిన ఎం.సుబ్బారెడ్డి, మహారాణి దంపతులు కుమార్తె అయిన ఈమె తొలుత త్రోబాల్ క్రీడలో రాణించింది. అనంతరం జిల్లాలో షూటింగ్బాల్కు చక్కటి ప్రోత్సాహం ఇస్తుండటంతో ఈమె షూటింగ్బాల్లో పాల్గొంది. రాష్ట్రస్థాయి పోటీల్లో మూడోస్థానం కోసం నిర్వహించిన పోటీల్లో ఈమె చక్కటి ప్రతిభ కనబరచడంతో ఈమెను ఏపీ అండర్–19 మహిళల జట్టుకు ఎంపిక చేశారు. ఈమె కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతోంది.

‘షూటింగ్బాల్’ సుస్మిత..susmitha

చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లెలోని శ్రీ వెంకటేశ్వర ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న టి. సుస్మిత షూటింగ్బాల్లో రాణిస్తోంది. ఇప్పటి వరకు 6 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా తాజాగా నిర్వహించిన ఎంపికల్లో చక్కటి ప్రతిభ కనబరిచి సబ్జూనియర్ విభాగంలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే ఏపీ సబ్జూనియర్ బాలికల జట్టుకు ఎంపికైంది. రైతు కుటుంబానికి చెందిన టి. నాగరాజు, పార్వతిల కుమార్తె అయిన ఈమె జాతీయస్థాయిలో రాణించడమే తన లక్ష్యమంటోంది.

‘రైజింగ్’ రెహమాన్..rehaman

చింతకొమ్మదిన్నె మండలం ఆర్.టి.పల్లెకు చెందిన సాధారణ రైతు ఖాదర్వల్లి, ఆరీఫీ దంపతుల కుమారుడైన ఎస్.రెహమాన్ షూటింగ్బాల్లో రైజింగ్ క్రీడాకారుడుగా ఎదుగుతున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరచడంతో ఏపీ అండర్–19 బాలుర జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక జిల్లా క్రీడాకారుడు ఈయన కావడం విశేషం. కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న ఈ యువ క్రీడాకారుడు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

Published date : 05 Oct 2021 04:11PM

Photo Stories