English Medium: ఆంగ్ల మాధ్యమంతోనే భవిష్యత్తు
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక విద్య స్థాయి నుంచి ప్రవేశపెట్టడం ముఖ్యమంత్రి దార్శనికత, దూరదృష్టికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలోని మీడియా అకాడమీ కార్యాలయంలో ‘విద్య ఉపాధి అవకాశాలు–ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత అనే అంశం’పై గురువారం సదస్సు జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే తరానికి ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించే ఇంగ్లిషు మీడియం విద్యను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు పేద పిల్లలను ప్రభుత్వం అందించే ఇంగ్లిష్ మీడియం విధానాన్ని వ్యతిరేకించడం తగదన్నారు. ఇంగ్లిష్ విద్యను ప్రోత్సహించడం అంటే తెలుగు భాషకు ద్రోహం చేస్తున్నట్టు కాదని స్పష్టం చేశారు.
చదవండి: English Language: విద్యార్థుల్లో ఇంగ్లిష్ నైపుణ్యానికి మరో ముందడుగు
ఆంగ్లంతోనే మనుగడ..
నవరత్నాల అమలు, పర్యవేక్షణ కమిటీ వైస్ చైర్మన్ ఏఏన్.నారాయణమూర్తి మాట్లాడుతూ ఆంగ్ల భాష ప్రపంచ వ్యాప్తంగా అనుసంధానమైందన్నారు. ఆంగ్ల భాషను నేర్పించడం ద్వారా ఒక తరం బాగుపడేలా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రొఫెసర్ ఎస్‌ఏ రహమాన్ సాహెబ్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో విద్యార్థుల భవిష్యత్తు అంతా ఆంగ్లం భాషపై వారికున్న ప్రావీణ్యంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రచయిత పూలబాల వెంకట్ రచించించిన ఇండియన్ సొనెటీర్ పుస్తకాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు, మీడియా అకాడమీ కార్యదర్శి మామిళ్లపల్లి బాల గంగాధర్ తిలక్, డాక్టర్ వెంకట్‌నారాయణ, దేవరకొండ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం పుస్తక రచయత వెంకట్‌ను సత్కరించారు.
ఏపీ మీడియా అకాడమీ చైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావు