Educational Standards: బడి బలోపేతమే లక్ష్యం
మదనపల్లె సిటీ: పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో సంస్కరణలను చేపట్టింది. బోధన...సకాలంలో సిలబస్ పూర్తి చేయడం.. పరీక్షల నిర్వహణ.. ఉపాధ్యాయుల విధులు... తదితరాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్య, పూర్తిస్థాయిలో వసతుల కల్పనే లక్ష్యంగా ప్రతి మండలానికి ఇద్దరు ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించింది. వీరికి పని విభజన కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మరింత మెరుగుపడుతున్నాయి.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం, వర్చువల్ బోధన, టోఫెల్ విధానంలో పరీక్షలు, సీఈఎస్‌ఈ సిలబస్, విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ తదితరాలను పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రభుత్వ పాఠశాలల్లోనూ పకడ్బందీగా అమలయ్యేలా ఇద్దరు ఎంఈఓలు పర్యవేక్షించనున్నారు.
ఇష్టారాజ్యానికి చెక్
పరీక్షల నిర్వహణలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక నుంచి వీరి ఆటలు సాగేందుకు అవకాశం ఉండదు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన నిబంధనల మేరకు పరీక్షలు, బోధన తదితరాలను పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి అకడమిక్ పుస్తకాలతో విద్యాబోధన సాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా తరగతులకు ఫార్మెటివ్,సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అకడమిక్ పుస్తకాలను వినియోగించకుండా సొంత మెటీరియల్‌ను విద్యార్థులకు అంటగట్టి ఇష్టారాజ్యంగా బోధన సాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారాలను చక్కదిద్దేందుకుగానూ ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నియమించింది.
చదవండి: Govt Schools: డిజిటల్ పాఠాలు
ఎంఈఓల విధులు ఇలా...
జిల్లాలో 30 మండలాలకు గానూ 30 మంది ఎంఈఓలను అదనంగా నియమించారు. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలను సందర్శించడం, తనిఖీ, ఉపాధ్యాయుల శిక్షణ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన కార్యక్రమాలు అమలయ్యేలా పర్యవేక్షణ.. పాఠశాలల్లో అవసరమైన వాటిని అంచనా వేసి బాధ్యత ఎంఈఓ–1కు కేటాయించారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా పాఠశాలల స్థాపన , గుర్తింపు,బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సర్వీస్ అంశాలతో పాటు అధికారులు కేటాయించిన ఇతర విధులను వీరు నిర్వహించనున్నారు.
పాఠశాలల్లో సంసిద్ధత
ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్, బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం,ఒకేషనల్ ఎడ్యుకేషన్, ప్రత్యేకావసరాలు గల పిల్లలకు సంబంధించి విషయాలు .చైల్డ్ డేటా బేస్ యూ డైస్ నిర్వహణ తదితరాలను ఎంఈఓ–2 పర్యవేక్షించాల్సి ఉంటుంది. నాడు–నేడు, ఇన్‌ఫ్రాస్టక్చర్,లెర్నింగ్ మెటీరియల్ టు స్టూడెంట్స్, మధ్యాహ్న బోధన విధులు, పారిశుధ్యం, ప్రభుత్వ పథకాలు, పాఠశాలల భద్రతతో పాటు అధికారులు కేటాయించిన ఇతర విధులను వీరు నిర్వర్తించాలి.
ఫలితమిస్తున్న ఇద్దరు ఎంఈఓల ఫార్ములా బోధన, నిర్వహణపై తరచూ తనిఖీలు ప్రభుత్వ విధానాలు అమలయ్యేలా చర్యలు పర్యవేక్షణ పెరుగుతుంది
ఎంఈఓ–1,2 కు విధులు కేటాయింపులో పాఠశాలలపై పర్యవేక్షణ పెరుగుతుంది. అకడమిక్, పాఠశాలల నిర్వహణను ఇద్దరు ఎంఈఓలు పర్యవేక్షించనున్నారు. వీరికి విధుల కేటాయింపుతో విద్యార్థుల ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తాయి. ఎంఈఓలు ఆయా మండలాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అకడమిక్ క్యాలెండర్, ప్రభుత్వ పథకాలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.
–శ్రీరాం పురుషోత్తం, డీఈఓ, అన్నమయ్య జిల్లా