Board Exams Twice In A Year: ఇకపై ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలు..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు 10, 12 తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2020లో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)లో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా.. విద్యార్థులపై అకాడమిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఏడాదిలో రెండుసార్లు టెన్త్, ఇంటర్ బోర్డ్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.
ఏడాదిలో రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్..
ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలను రాసే వీలు ఉంటుంది. అందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సిఎఫ్) ప్రకారం, విద్యార్థులు మంచి పనితీరు కనబరచడానికి తగినంత సమయం మరియు అవకాశం ఉంటుందని తెలిపారు.
10 రోజులు బ్యాగ్‌లెస్ డే..
“విద్యార్థులను ఒత్తిడి లేకుండా ఉంచడం, నాణ్యమైన విద్యతో వారిని సుసంపన్నం చేయడం, విద్యార్థులను సంస్కృతితో అనుసంధానం చేయడం, భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడం కోసం ప్రధాని మోదీ ఆలోచించి.. ఎన్ఈపీని తీసుకొచ్చారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఫార్ములా ఇదే,” అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతేకాకుండా ఏడాదిలో 10 రోజులు బ్యాగ్‌లెస్ డేను ప్రవేశపెట్టాలని, పిల్లలను క్రీడల్లో నిమగ్నం చేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.