Z Space Centre: జెడ్ స్పేస్ సెంటర్‌తో ఆర్ట్స్ కళాశాల ఒప్పందం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలోని ప్రభుత్వ అటానమస్ కళాశాల నూతన మైలురాయిని చేరుకుంది. ముంబైలోని ఐడీఏ బిజినెస్ సొల్యూషన్స్‌తో భాగస్వామి అయ్యేలా శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కళాశాల రసాయన శాస్త్ర విభాగంలో జెడ్ స్పేస్ ఇన్‌స్పైర్ ప్రో లాప్టాప్ స్టేషన్ ఏర్పాటుకు ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జెడ్ స్పేస్ ఇన్‌స్పైర్ ప్రో లాప్టాప్ స్టేషన్‌లో వీఐవీఐడీ కెమిస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఈ–కంటెంట్ రూపొందించడంపై రసాయన శాస్త్ర అధ్యాపకులకు ప్రయోగాత్మక శిక్షణను నిర్వహించారు. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ ఆదేశం మేరకు బోధన, అభ్యసన ప్రక్రియలోకి ఈ సాంకేతికతను తీసుకుని వచ్చారు. దీనికి అవసరమైన వర్క్ స్టేషన్ పరికరాలు సమకూర్చుకునేందుకు కళాశాల నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా రూ.10 లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామచంద్ర మాట్లాడుతూ, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత అభ్యసనం విద్యార్థుల్లో ఉత్సుకతను పెంపొందించడానికి సహకరిస్తుందని అన్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సాంకేతికతల ద్వారా శిక్షణ రూపకల్పన, విజువలైజేషన్ అనుభవాలను మెరుగుపరచుకోవడానికి ఉపకరిస్తుందని వివరించారు. జెడ్ స్పేస్ ఇంక్ ప్రతినిధి సచిన్ మహేందు మాట్లాడుతూ, మిక్స్‌డ్ రియాలిటీ, ఏఆర్, వీఆర్ ద్వారా విద్యార్థుల అభ్యసన అనుభవాలను జెడ్ స్పేస్ శక్తిమంతం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల నైపుణ్య కేంద్రం కో ఆర్డినేటర్ వెంకటరావు, వైస్ ప్రిన్సిపాల్ శాస్త్రి, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్, ఐక్యూ ఏసీ కో ఆర్డినేటర్ డాక్టర్ అన్నపూర్ణ, రసాయన శాస్త్ర విభాగాధిపతి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.