Andhra Pradesh : అర్హులైన ఎస్జీటీలకు పదోన్నతితో పాటు.. నెలకు రూ. 2,500 చొప్పున..
నూతన విధానంలోని స్కూళ్లలో 3వ తరగతి నుంచి సబ్జెక్టుల బోధనకు సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీలు)కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని భావించింది. దీనికోసం తగిన అర్హతలున్న 2,095 మంది ఎస్జీటీలతోపాటు మరో 3,714 మంది మొత్తం 5,809 మంది ఎస్జీటీలకు పదోన్నతి ఇవ్వడానికి జీవో నంబర్లు 117, 128 ను విడుదల చేసింది. వీటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. కోర్టు ఆదేశాలతో పదోన్నతుల ప్రక్రియ పూర్తికాలేదు. అయితే విద్యార్థులకు సబ్జెక్టు బోధనకు వీలుగా పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. 5,809 మందినీ తాత్కాలికంగా సబ్జెక్టు బోధన చేసేలా చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమై, వీరికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చే వరకు సబ్జెక్టు బోధన చేస్తారు. ఇందుకు వీరికి నెలకు రూ. 2,500 చొప్పున సబ్జెక్టు టీచర్ అలవెన్స్ ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మెమో జారీచేశారు.