Scholarship Scheme : దీన్ దయాళ్ స్పర్శ్ యోజన – ఫిలాటలి స్కాలర్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..
కడప: తపాలా బిళ్లల సేకరణ (ఫిలాటలి) అభిరుచిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత తపాలా శాఖ ద్వారా ప్రవేశపెట్టిన ‘దీన్ దయాళ్ స్పర్శ్ యోజన’ – ఫిలాటలీ స్కాలర్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని కడప పోస్టల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏటా చదువులో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూనే ఫిలాటలిని అభిరుచిగా కొనసాగించే 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు సర్కిల్ స్థాయిలో ఫిలాటలి ప్రాజెక్ట్, ఫిలాటలి క్విజ్/పరీక్ష ఆధారంగా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 2024–25 సంవత్సరానికి దీన్ దయాళ్ స్పర్శ్ యోజన – ఫిలాటలి స్కాలర్‌షిప్ పథకం నోటిఫికేషన్‌ను భారత తపాలా శాఖ విడుదల చేసిందన్నారు. అభ్యర్థి 2023–24లో జరిగిన చివరి పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్/గ్రేడ్ పాయింట్‌లు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టల్ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని వివరించారు.