Skip to main content

న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగంలో మౌలిక అంశం

భారత రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు సమప్రాధాన్యం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ తనకున్న న్యాయ సమీక్షాధికారం, క్రియాశీలతలతో చురుగ్గా పనిచేస్తూ మిగిలిన రెండు వ్యవస్థల పనితీరును పర్యవేక్షిస్తోంది. ఆ క్రమంలో న్యాయవ్యవస్థ తనకున్న సమీక్షాధికారంతో సమాజానికి, ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా తీర్పులు ఇస్తూ, మిగతా వ్యవస్థలకూ మార్గనిర్దేశం చేస్తోన్న తీరుతెన్నుల గురించి టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, ఉస్మానియా న్యాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జి.బి.రెడ్డి విశ్లేషణ..
న్యాయ వ్యవస్థకు గల న్యాయ సమీక్షాధికారం భారత రాజ్యాంగంలో ఓ ముఖ్యాంశం. మన న్యాయ వ్యవస్థ రూపురేఖలు, అధికారాల గురించి విశ్లేషించేటప్పుడు ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలకు(సుప్రీంకోర్టు, హైకోర్టులకు) గల ప్రత్యేక న్యాయ సమీక్షాధికారం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. రాజ్యానికి ముఖ్యం గా శాసన, కార్యనిర్వాహక, జ్యుడీషియరీ (న్యాయ) అనే మూడు వ్యవస్థలు ఉన్నాయి. అధికారాల విభజన (Separation of powers) ప్రకారం - ఒక వ్యవస్థ పనితీరులో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు. అయితే న్యాయ సమీక్షాధికారాన్ని వీటికి మినహాయింపుగా చెప్పుకోవచ్చు.

న్యాయ సమీక్షాధికారం - నేపథ్యం
ఇంగ్లండ్‌లోని ప్రముఖ న్యాయమూర్తి ఎడ్వర్‌‌డ కోక్ 1610లో ఓ కేసులో తీర్పునిస్తూ.. ప్రభుత్వం చేసిన ఏ చట్టం అయినా/చేపట్టిన ఏ అధికారిక చర్య అయినా సహజసిద్ధంగా వచ్చే హక్కులకు (Natural Rights), కారణాలకు (Natural Reason) వ్యతిరేకంగా ఉంటే అలాంటి వాటిని న్యాయ స్థానాలు కొట్టేయొచ్చన్నారు. ఈ తీర్పును న్యాయ సమీక్షాధికారానికి నాందిగా పేర్కొంటారు. కానీ ఆ తీర్పు అప్పటి గ్రేట్ బ్రిటన్‌లో నిలవలేకపోయింది. అక్కడ వచ్చిన విప్లవాలు తదితర కారణాలతో 1688 తర్వాత బ్రిటన్‌లో పార్లమెంట్ ఆధిక్యత వచ్చింది.

మార్బురి వర్సెస్ మాడిసన్ కేసు
1803లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మార్బురి వర్సెస్ మాడిసన్ కేసులో సుప్రీంకోర్టు ప్రస్ఫుటంగా న్యాయ సమీక్ష సిద్ధాంతాన్ని గుర్తించింది. రెండు రోజుల్లో పదవీ కాలం ముగిసిపోతున్న అమెరికా అధ్యక్షుడు.. జ్యుడీషియరీ యాక్ట్ ఆఫ్ 1801ను కాంగ్రెస్‌లో ఆమోదించి, తద్వారా కొత్తగా కోర్టులను ఏర్పాటు చేసి 40 మంది న్యాయమూర్తులను నియమించారు. నియమితులైన న్యాయమూర్తులకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ నియామక పత్రాలను జారీ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల నలుగురికి మాత్రం ఇవ్వలేకపోయాడు. తర్వాత అధ్యక్షుడైన థామస్ జెఫర్సన్ ఆ నలుగురికి ఎలాంటి అపాయింట్‌మెంట్ ఆర్డరూ జారీ చేయొద్దని తన సెక్రటరీ ఆఫ్ స్టేట్ - మాడిసన్‌ను ఆదేశించాడు.దీంతో ఆ నలుగురిలో ఒకరైన విలియం మార్బురి.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సెనేట్ ఆమోదంతో రాజ్యాంగబద్ధంగా నియమితుడినైన తనకు నియామక పత్రం పొందే హక్కు ఉందనీ, ఆ హక్కును ప్రస్తుత ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. అప్పటి అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ ఈ కేసులో మూడు వివాదాస్పద అంశాలను గుర్తించాడు. అవి..
  • మార్బురికి అపాయింట్‌మెంట్ ఆర్డర్ పొందే హక్కు ఉందా? లేదా?
  • సెక్రటరీ ఆఫ్ స్టేట్ - జేమ్స్ మాడిసన్‌కు ఆర్డర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా? లేదా?
  • ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు ఉన్న అధికారం ఏమిటి?

అపాయింట్‌మెంట్ ఆర్డర్ పొందే హక్కు మార్బురికి, ఆర్డర్ ఇవ్వాల్సిన బాధ్యత మాడిసన్‌కు ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టుకు మాత్రం ఇందుకు సంబంధించి తీర్పునిచ్చే అధికారం లేదని న్యాయమూర్తి జాన్ మార్షల్ తెలిపారు. ఏ చట్టం ద్వారా పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడో అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం మాత్రమే అత్యున్నత చట్టం. దాని హోదాను, విశిష్టతను రక్షించాల్సిన బాధ్యత కోర్టుపై ఉంది. అందుకే ఏ చట్టం కింద పిటిషన్ దాఖలు చేశారో అది రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఈ చట్టాన్ని కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ బాధ్యత, అధికార పరిధి ప్రకారం- రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా, దానికి వ్యతిరేకంగా చట్టాలు చేసినా.. వాటిని కొట్టేసే అధికారం కోర్టుకు ఉందని స్పష్టం చేశారు. ఈ తీర్పును న్యాయ సమీక్షాధికారానికి నాందిగా, జాన్ మార్షల్‌ను న్యాయ సమీక్షాధికారానికి పితామహుడిగా పేర్కొంటారు. అమెరికాలో ఈ సమీక్షాధికారానికి కొన్ని పరిమితులున్నాయి. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షాధికారం గురించి ప్రస్తావన లేనప్పటికీ.. కొన్ని ఆర్టికల్స్ ద్వారా ఈ అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు సంక్రమించింది.
  • ఆర్టికల్ 13(1) ప్రకారం- రాజ్యాంగం అమల్లోకి రాకముందున్న చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంటే అవి చెల్లవు.
  • ఆర్టికల్ 13(2) ప్రకారం-ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా రాజ్యం ఎలాంటి చట్టాన్నీ చేయకూడదు. ఒకవేళ చేస్తే అది చెల్లదు.
  • ఆర్టికల్-32 ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కూడా న్యాయసమీక్షాధికారాన్ని ఉపయోగిస్తారు.

అదే విధంగా ఆర్టికల్ 226 కింద రిట్లు వేసే అధికారం కూడా న్యాయ సమీక్షాధికార పరిధిలోకే వస్తుంది. ఆర్టికల్ 131 ప్రకారం - అంతర్రాష్ట్ర వివాదాల వంటివి న్యాయ సమీక్షాధికారంలో భాగంగానే ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానాలు చట్టాల రాజ్యాంగ బద్ధతను మాత్రమే న్యాయసమీక్ష ద్వారా పరీక్షిస్తాయి. ప్రస్తుతం చట్టాలకే పరిమితం కాకుండా.. అధికార చర్యలకు కూడా వీటిని విస్తృతపరిచారు. దీంతో కోర్టుకు చట్టాలను, ఆర్డినెన్స్‌లను, పరిపాలన చర్యలను సమీక్షించే అధికారం ఉంది. న్యాయ సమీక్షాధికారాన్ని సుప్రీంకోర్టు ఓ మౌలిక స్వరూపంగా (Basic feature) పరిగణించింది.

తీర్పులు
1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు; ఇందిరా గాంధీ వర్సెస్ రాజ్ నరైన్ కేసు తీర్పుల్లోనూ సుప్రీంకోర్టు న్యాయ సమీక్షాధికారాన్ని మౌలిక స్వరూపంగానే పేర్కొంది. అదేవిధంగా ఆర్టికల్ 31(బి) ప్రకారం- 9వ షెడ్యూల్‌లో ఏదైనా చట్టాన్ని చేరిస్తే అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ప్రశ్నించే అధికారం గానీ, న్యాయ సమీక్షాధికారం గానీ కోర్టులకు ఉండేది కాదు. కానీ 2007లో ఐ.ఆర్.కోయిల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. 1973, ఏప్రిల్ 24 (basic structures doctrine was propounded) తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాల రాజ్యాంగ బద్ధతను కూడా కోర్టులు సమీక్షించొచ్చని తీర్పునిచ్చింది.

అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ చట్టం 1985 ప్రకారం- అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ మాత్రమే వేయొచ్చు. సంబంధిత రాష్ట్ర హైకోర్టులకు అప్పీళ్లను వినే అధికారం కూడా లేదు. కానీ 1997లో ఎల్.చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి న్యాయ సమీక్షాధికారం అనేది మౌలిక అంశం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను కూడా హైకోర్టు ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం ఒక రిట్ పిటిషన్ ద్వారా సమీక్షించొచ్చని తీర్పునిచ్చింది.
  • ఇలాంటి తీర్పుల నేపథ్యంలో న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగపరంగా, కోర్టు తీర్పుల పరంగా రాజ్యాంగంలోని ఒక మౌలిక అంశంగా మారిపోయింది. మన దేశంలో న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ సవరణలను కూడా కొట్టేసే విధంగా ఉంది. ఉదాహరణకు తాజాగా జాతీయ న్యాయ నియామక కమిషన్(ఎన్‌జేఏసీ)కి సంబంధించిన 99వ రాజ్యాంగ సవరణను కొట్టేశారు. 2014లో వచ్చిన జాతీయ న్యాయ నియామకాల చట్టాన్ని కూడా కొట్టేశారు. ప్రపంచంలో ఇలాంటి విస్తృత న్యాయ సమీక్షాధికారం భారత న్యాయస్థానాలకు మాత్రమే ఉంది.

న్యాయ వ్యవస్థ క్రియాశీలత
న్యాయ వ్యవస్థ క్రియాశీలత (Judicial Activism) న్యాయ సమీక్ష అధికారంలో అంతర్భాగం. న్యాయ వ్యవస్థ క్రియాశీలత అంటే న్యాయ వ్యవస్థ తన విధులను, అధికారాలను మరింత చొరవగా, క్రియాశీలకంగా, ఉదారంగా వినియోగించడం! శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు అధికార విభజన అనుసరిస్తే ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆధునిక ప్రజాస్వామ్య, సంక్షేమ రాజ్యాల్లో ఆయా వ్యవస్థల విధులు విస్తృతం కావడంతో ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ రాజ్యాంగం ప్రకారం- మూడు వ్యవస్థలకు సమప్రాధాన్యం ఉంటుంది. ఈ సమ ప్రాధాన్యం గురించి కింది ఉదాహరణ స్పష్టం చేస్తుంది. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు టి.టి.కృష్ణామాచారి మూడు వ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ పరిధిలోని none of them can be an empire with in an empire అని వ్యాఖ్యానించారు. భారత్ లో న్యాయవ్యవస్థ క్రియాశీలత 1980కి ముందు తక్కువగా ఉండేది. కొన్ని అరుదైన కేసుల్లో మాత్రమే న్యాయ స్థానాలు తమ అధికారాన్ని ప్రదర్శించాయి. కానీ 1980 తర్వాత న్యాయవ్యవస్థ క్రియాశీలత పెరిగింది.

క్రియాశీలత ఎప్పుడు?
  • శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తాము చేయాల్సిన విధులను విస్మరించినప్పుడు లేదా వైఫల్యం చెందినప్పుడు న్యాయ వ్యవస్థ క్రియాశీలత ప్రదర్శిస్తుంది.
  • వివిధ కారణాల వల్ల నిర్మాణాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రజల కనీస అవసరాలు కూడా మెరుగుపరచలేని స్థితిలో ప్రభుత్వాలు కొనసాగితే న్యాయ వ్యవస్థ తన క్రియాశీలతను కనబరుస్తుంది.
  • న్యాయ స్థానాలు స్వయం ప్రేరిత (సుమోటో) కేసులను ప్రవేశపెట్టి ప్రజల హక్కుల కోసం తగిన ఆదేశాలను జారీ చేయడం.
  • స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలు ప్రజా ప్రయోజనాలున్న కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టుల దృష్టికి తీసుకురావడం వల్ల కోర్టులు క్రియాశీలత చూపిస్తున్నాయి.
  • సంకీర్ణ, బలహీన, అస్థిర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా పని చేస్తుంది.

క్రియాశీలత రూపాలు
ప్రజాప్రయోజన వ్యాజ్యం:
పేదరికం, నిస్సహాయత, అవగాహనలేమి లాంటి వివిధ కారణాలతో కోర్టును ఆశ్రయించలేని వారు ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపంలో కోర్టు మెట్లు ఎక్కవచ్చు. అలాగే మూడో వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించడం జ్యుడీషియల్ యాక్టివిజం ముఖ్య రూపం.
న్యాయ వ్యవస్థ క్రియాశీలత ద్వారా ఆర్టికల్ 21 ప్రకారం- ప్రాథమిక హక్కుల పరిధిని పెంచారు. ఉదాహరణకు జీవించే హక్కు అంటే right to live with basic human dignity అని కోర్టులు నిర్వచించాయి. 14 ఏళ్ల లోపు వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వం బాధ్యత అని చెబుతూ దాన్ని ఆర్టికల్ 21(ఎ)లో చేర్చారు. ఈ విధంగా ఉచిత న్యాయ సలహా పొందే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు మొదలైన వాటిని న్యాయ వ్యవస్థ తన క్రియాశీలతతో ప్రాథమిక హక్కుల్లోకి తీసుకొచ్చింది.
రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం కూడా న్యాయ క్రియాశీలతే. ఉదాహరణకు 99వ రాజ్యాంగ సవరణను కొట్టేయడాన్ని న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు శిఖరాగ్రంగా చెప్పొచ్చు. పర్యావరణ హక్కుల్ని రక్షించడంలో న్యాయ వ్యవస్థ పాత్ర కీలకం. ఆగ్రా నుంచి దాదాపు 300 కంపెనీలను తాజ్‌మహల్‌కు దూరంగా తరలించడం కూడా న్యాయ వ్వవస్థ క్రియాశీలత వల్లే సాధ్యపడింది.

విమర్శ
న్యాయ వ్యవస్థ క్రియాశీలత పేరుతో న్యాయమూర్తులు వారి పరిధి దాటుతున్నారనే విమర్శ ఉంది. సంబంధంలేని విషయాలపై ఆదేశాలు జారీచేస్తున్నారని, విధానపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని జస్టిస్ మార్కండే య కట్జూ, జస్టిస్ మాథూర్ లాంటి న్యాయమూర్తులు ఓ తీర్పులో పేర్కొన్నారు. అలాగే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ లాంటి న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ క్రియాశీలతను సమర్థిస్తున్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరు మెరుగ్గా లేకుంటే సాధారణ వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయిస్తారు. అందుకే న్యాయ వ్యవస్థ క్రియాశీలకం అని చెప్పొచ్చు. అలాగే నల్లధనానికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేయడం, సల్వాజుడుం కేసు మొదలైన వాటిల్లో న్యాయ వ్యవస్థ క్రియాశీలతతోనే ఫలితాలు వచ్చాయి. నార్కో అనాలసిస్.. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కుకు వ్యతిరేకమని కోర్టు తీర్పునిచ్చింది. న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు కొన్ని పరిధులు ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం- న్యాయ వ్యవస్థ అత్యున్నతం కాదు. రాజ్యాంగం మాత్రమే అత్యున్నతమైంది. న్యాయ శాఖ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తూ శాసన, కార్యనిర్వాహక అంగాలు పనిచేసేలా చూడాలి!!
Published date : 13 Nov 2015 05:36PM

Photo Stories