Skip to main content

నిర్దిష్ట ప్రణాళికతో గ్రూప్ 2లో విజయం

కొత్త సంవత్సరం వస్తూనే కొలువుల కాంతులు వెదజల్లింది. లక్షలాది మంది యువత ఆశల నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌తోపాటు పరీక్ష తేదీలను సైతం ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా ఐదు విభాగాల్లో 439 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. గ్రూప్ పరీక్షలకు పోటీ ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధంకావాలి. గ్రూప్-2 నోటిఫికేషన్ వివరాలు.. పరీక్షల్లో విజయానికి నిపుణుల సలహాలు.. సూచనలు...
గ్రూప్-2 నోటిఫికేషన్ సమాచారం
మొత్తం పోస్ట్‌లు:
439
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు సంబంధించి అదనంగా లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు నిర్దేశ శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

కేటగిరీ వారీగా పోస్టుల వివరాలు

పోస్టులు

ఖాళీలు

వయోపరిమితి (జూలై 1, 2015 నాటికి)

మునిసిపల్ కమిషనర్ గ్రేడ్-3

19

18-44

అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్

110

18-44

సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2

23

20-44

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్)

67

18-44

ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్

220

18-28


దరఖాస్తు సమాచారం
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 9, 2016
  • పరీక్ష తేదీ: ఏప్రిల్ 24, 25 - 2016

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇలా..
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే టీఎస్‌పీఎస్సీ ఐడీ లభిస్తుంది. ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని, టీఎస్‌పీఎస్సీ ఐడీ ఉన్న అభ్యర్థులు నేరుగా టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లోని అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ గ్రూప్-2 సర్వీసెస్ లింక్‌పై క్లిక్ చేసి, ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయొచ్చు. టీఎస్‌పీఎస్సీ ఐడీ లేని అభ్యర్థులు మాత్రం ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడీ పొందాలి. దీని కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, ఆన్‌లైన్ ఫాంను పూర్తి చేయాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tspsc.gov.in

విజయానికి విలువైన సూచనలు
‘గ్రూప్స్’.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులందరికీ సుపరిచితమైన పదం. గ్రూప్-1, 2, 3, 4 స్థాయి ఏదైనా పోటీ లక్షల్లోనే ఉంటుంది. అయితే విజయ ప్రణాళికలతో తీవ్ర పోటీలోనూ లక్షణంగా ఉద్యోగం సాధించొచ్చు.

సమయ పాలన
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 తాజా నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు అత్యంత అనుకూలించే అంశం పరీక్ష తేదీలను ముందుగానే ప్రకటించడం. ఫలితంగా అభ్యర్థులు ప్రిపరేషన్ పరంగా స్పష్టమైన అవగాహనకు రావొచ్చు. సమయం, సిలబస్‌లోని అంశాలను బేరీజు వేసుకుంటూ టైంప్లాన్ రూపొందించుకోవాలి.

నాలుగు పేపర్లలో.. నైపుణ్యం
కొత్త విధానం ప్రకారం గ్రూప్-2 పరీక్షను-నాలుగు పేపర్లతో 600 మార్కులకు నిర్వహిస్తున్నారు. ప్రతి పేపర్‌లో పేర్కొన్న విభాగాలకు సంబంధించి సమగ్ర అవగాహనతో పరీక్షల్లో విజయం సాధించవచ్చు. అభ్యర్థులు ప్రధానంగా కొత్త సిలబస్‌లోని హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీలకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రాముఖ్యమున్న అంశాలపై పట్టు సాధించాలి.

పేపర్-1 (జనరల్ స్టడీస్)
పేపర్-1గా ఉండే జనరల్ స్టడీస్‌లో రాణించడానికి కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ సంబంధిత జీకే, కరెంట్ అఫైర్స్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి. టీఎస్‌పీఎస్సీ ఇప్పటి వరకు స్పెషలైజ్డ్ డిగ్రీలు అర్హతగా తొమ్మిది పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్‌కు సంబంధించి సగటున 40- 45 శాతం ప్రశ్నలు తెలంగాణ ప్రాంత సంబంధ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. జాతీయ స్థాయి అంశాలు కూడా తెలంగాణతో ముడిపడి ఉన్నాయా? అనే కోణంలో చదవాలి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమయంలో జాతీయ స్థాయి పరిణామాలు, రాష్ట్ర ఏర్పాటుకు వీలు కల్పించిన రాజ్యాంగ అధికరణలపై దృష్టి పెట్టాలి. జనరల్ స్టడీస్‌లోని మిగతా అంశాల్లోనూ చరిత్ర, భౌగోళిక శాస్త్రంలోని ప్రాథమిక అంశాలు మినహాయిస్తే అధిక శాతం కరెంట్ అఫైర్స్ సమ్మేళనంగా సన్నద్ధం కావాలి. ప్రస్తుత సిలబస్‌లో ప్రత్యేకంగా రెండు అంశాలను పేర్కొనొచ్చు. అవి.. తెలంగాణ రాష్ట్ర విధానాలు; సామాజిక వివక్ష, హక్కుల అంశాలు, సమ్మిళిత విధానాలు. ఇందులో రాష్ట్ర విధానాలకు సంబంధించి ముఖ్యమైన పథకాలు-లక్ష్యాలు; ఆయా వర్గాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రత్యేక పథకాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి. సామాజిక వివక్ష, హక్కులు, అంశాలు, సమ్మిళిత విధానాల కోసం రాజ్యాంగంలో సంబంధిత అధికరణలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

పేపర్-2.. ప్రత్యేక దృష్టితో
గ్రూప్-2లోని పేపర్-2 కోసం ప్రత్యేక దృష్టితో సన్నద్ధం కావాలి. కొత్త సిలబస్ ప్రకారం.. పేపర్-2లో మూడు విభాగాలు (చరిత్ర, భారత రాజ్యాంగం-సమీక్ష, సామాజిక స్వరూపం, పబ్లిక్ పాలసీలు) ఉన్నాయి.

సెక్షన్-1: ఇండియన్ హిస్టరీ
ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ రెండిటినీ మూడు భాగాలుగా (ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక) విభజించుకొని చదవాలి.
  • ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారత దేశ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో వలసవాదం దశలు, 1857 తిరుగుబాటు-ప్రభావం, భారతదేశంలో జాతీయవాదం పెరుగుదల, గాంధీ శకం ప్రాధాన్యం, దేశ స్వాతంత్య్రానంతరం ముఖ్య ఘట్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • సింధు నాగరికత, వేద కాలం నాగరికత, మత పరమైన ఉద్యమాలు (బౌద్ధం, జైనం తదితర), ఇస్లాం మతం-ప్రభావం, భక్తి ఉద్యమాలు-స్వభావం, లలిత కళలు, మొగల్ సామ్రాజ్యం తదితర అంశాలను బాగా చదవాలి.
  • తెలంగాణ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలలో ఆయా రాజ్య వంశాలు, వాటి హయాంలో జరిగిన సామాజిక ఆర్థిక అభివృద్ధి, పరిస్థితులపై అవగాహన (ఉదా: కాకతీయుల కాలంలో ప్రత్యేకత ఉన్న నీటి పారుదల వ్యవస్థ) పెంచుకోవాలి.
  • ఆధునిక తెలంగాణ చరిత్రలో నిజాం సంస్కరణలు, శిస్తులు-విధానాలు, ఆయా రంగాల అభివృద్ధి చర్యలు(ఉదాహరణకు విద్యా రంగం, పారిశ్రామిక అభివృద్ధి). అసఫ్‌జాహీల కాలంలో ప్రధాన ఉద్యమాలైన ఆర్య సమాజ్, ఆది హిందూ ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

సెక్షన్-2: పాలిటీ
  • ఈ విభాగంలో తప్పక చదవాల్సిన అంశాలు.. రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, భారత సమాఖ్య, విశిష్ట లక్షణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన, శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రలు. పంచాయతీరాజ్ వ్యవస్థ; 73,74 రాజ్యాంగ సవరణలు వాటి ప్రాముఖ్యత, సంక్షేమపాలన, మహిళలు, షెడ్యూల్డ్‌కులాలు, తెగలు- ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు, ఏకసభ, ద్విసభ, శాసన వ్యవస్థలు.

సెక్షన్-3: సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్
  • ఈ విభాగం సామాజిక పరిస్థితులు, స్థితిగతులకు సంబంధించింది.
  • దేశంలో మత వ్యవస్థ ఆయా మతాలు - లక్షణాలు, కుల వ్యవస్థ - లక్షణాలు- కుల వ్యవస్థలో మార్పులు - వాటికి కారణాలు, నిరుద్యోగం, పేదరికం, బాల కార్మిక, వెట్టి చాకిరీ వ్యవస్థలు, జోగిని, దేవదాసీ వ్యవస్థలు, వాటి నేపథ్యం- వీటి పేరుతో మహిళలపై జరిగిన అకృత్యాలు, సమకాలీన సమస్యల్లో భాగం ఫ్లోరోసిస్ సమస్య, వలసలు - కారణాలు, తెలంగాణలో రైతు ఉద్యమాలు, దళిత, వెనుక బడిన వర్గాల ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.

పేపర్ - 3 (ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి)
సెక్షన్-1: ఇండియన్ ఎకానమీ
  • ప్రధానాంశాలు... ఆర్థిక వృద్ధి, భావనల నిర్వచనాలు, జాతీయాదాయ భావనలు - కొలిచే ప్రమాణాలు, నిరుద్యోగం, పేదరికం భావనలు - వాటి నిర్వచనాలు, నిరుద్యోగ నిర్మూలనకు చేపడుతున్న పథకాలు, పంచవర్ష ప్రణాళికలు... ఆయా ప్రణాళికల లక్ష్యాలు తదితరాలు.

సెక్షన్-2: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ - అభివృద్ధి
  • తెలంగాణ రాష్ట్రం- భౌతిక వనరులు, పట్టణీకరణ భావనలు, గ్రామీణ ప్రాంత పరిస్థితులు, అక్షరాస్యత రేటు (స్త్రీ-పురుష అక్షరాస్యత రేటు, పట్టణ-గ్రామీణ ప్రాంత అక్షరాస్యత రేటు) చదవాలి.
  • వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలపై అవగాహన, వ్యవసాయ అనుబంధ రంగాలైన పశు పోషణ, మత్స్య సంపదల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మైనింగ్, తయారీ, సహజ ఇంధన వనరుల లభ్యత, నీటిపారుదల వ్యవస్థలపై అధ్యయనం చేయాలి. సేవా రంగంలో భాగంగా రాష్ట్రంలోని బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల కార్యకలాపాలు, రవాణా సదుపాయాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

సెక్షన్ -3: అభివృద్ధి సమస్యలు - మార్పులు
  • సామాజిక అసమానతలు, కుల, వర్ణ, మత పరమైన వివక్షలు, కారణాల విశ్లేషణతో పాటు ప్రధానంగా ఈ విభాగంలో ఆర్థిక సంస్కరణల గురించి అధ్యయనం చేయాలి. ఆర్థిక సంస్కరణల వల్ల కలిగిన ఫలాలు, సామాజిక అభివృద్ధి అంశాల గురించి తెలుసుకోవాలి.

పేపర్-4 (ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం)
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభ్యర్థుల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఆవిర్భావం అందుకు కారణాలపై అవగాహనను పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఈ పేపర్ ప్రవేశ పెట్టారు.
  • సెక్షన్-1లో పేర్కొన్న ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70) కోసం ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు కారణాలు, దారి తీసిన పరిస్థితులు. ఈ కాలంలో ముఖ్యమైన ఉద్యమాలను చదవాలి. హైదరాబాద్‌పై పోలీస్ చర్య, ముఖ్యమైన పరిణామాలు, భూదానోద్యమ ముఖ్య పరిణామాలు- కారణమైన పరిస్థితులు, 1956లోని పెద్ద మనుషుల ఒప్పదం-అందులో ముఖ్యాంశాలు-తీర్మానాలు 1969లో జై తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన సంఘటనల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • సెక్షన్-2 గా పేర్కొన్న సమీకరణ దశ (1971-1990)కు సంబంధించి ముఖ్యమైన అంశాలు.. 1972లో జై ఆంధ్ర ఉద్యమం, 1973లో రాష్ర్టపతి పాలన, ఆరు సూత్రాల పథకం, తెలంగాణకు వ్యతిరేకంగా జరిగిన చర్యలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష దిశగా ఏర్పడిన సంస్థలు/ పార్టీలు, ముల్కీ ఉద్యమాలు, నిబంధనలు వంటి వాటిపై అధ్యయనం చేయాలి.
  • సెక్షన్-3లో పేర్కొన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1990-2014) కోసం.. ఆయా రాజకీయ పార్టీల ఏర్పాటు-అందుకు దారి తీసిన పరిస్థితులు, ఈ దశలో జరిగిన నిరసన కార్యక్రమాలు(మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకల జనుల సమ్మె వంటివి) వాటి పర్యవసానాలు.
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ముఖ్యమైన కమిటీలు, రిపోర్ట్‌లను అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపర్చిన, తెలంగాణ సంబంధ అంశాలు.

బహుముఖ వ్యూహం
అభ్యర్థులు ఆయా పేపర్లు, నిర్దేశిత సిలబస్ అంశాలపై అవగాహన పొందడంలో బహుముఖ వ్యూహం పాటించాలి. ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో (నేపథ్యం, పర్యవసానం, పరిష్కారం, ఫలితం) అధ్యయనం చేయాలి. అప్పుడే పూర్తి స్థాయిలో సన్నద్ధత లభించి ప్రశ్న ఎలా అడిగినా సమాధానం ఇచ్చే నేర్పు సొంతమవుతుంది.
Published date : 07 Jan 2016 05:31PM

Photo Stories