Skip to main content

TSPSC Jr Lecturer Exam Pattern: జూనియర్‌ లెక్చరర్‌ పేపర్‌–2కు ఇలా సన్నద్ధమవ్వండి

తెలంగాణ జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షకు సంబంధించి పేపర్‌–2లో 300 మార్కులకు సంబంధించి 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. మొదట సిలబస్‌ను వివరంగా చదివి విశ్లేషించండి. మీరు డిగ్రీ, పీజీల్లో చదివిన సిలబస్‌ను గమనించండి. ఏవైనా అంశాలు ఇంతకుముందు తెలియనివి లేదా చదివివుండనివి ఉన్నాయేమో చూడండి.
TSPSC Jr Lecturer

ఇలాంటివి వేరుచేయండి. వివిధ యూనివర్సిటీల్లో సిలబస్‌ వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి జూనియర్‌ లెక్చరర్‌ పోటీ పరీక్షలో ఉండే సిలబస్‌లో కొంత భాగం మీకు కొత్తగా అనిపించొచ్చు. సబ్జెకు పేపర్‌లోని కొత్త అంశాలను ముందుగా చదువుతూ నోట్సు రాసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టు మీద పట్టు వస్తుంది.
కష్టపడితేనే ఫలితం ఉంటుంది....
రెండు లేదా మూడు సంవత్సరాల కిందట పీజీ పూర్తిచేసి ఇతర వృత్తుల్లో ఉన్నట్లయితే వీరి సన్నద్ధత వేరుగా ఉండాలి. వీరు పేపర్‌–1తోపాటుగా పేపర్‌–2లోని కొత్త అంశాలను చదవాలి. పీజీ వరకూ నేర్చుకున్న సిలబస్‌ కంటే ఈ పరీక్షలో సిలబస్‌ ఎక్కువ. కాబట్టి అన్ని అంశాలనూ క్షుణ్నంగా చదవాలి. ఇప్పటికే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) లేదా స్టేట్‌ లెక్చరర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (స్లెట్‌) లాంటివి చదివివున్నవారికి ఈ సిలబస్‌ కొంత తేలిగ్గా ఉంటుంది. ఇటీవల పీజీ పూర్తిచేసినవారు సబ్జెక్టు పేపర్‌లో పట్టు సాధించాలంటే మాత్రం ఎక్కువగానే కష్టపడాలి.
టీచింగ్‌ ఫీల్డ్‌లో ఉన్నవారు ఇలా చేయండి....
కొద్ది సంవత్సరాల నుంచీ ఇంటర్, డిగ్రీ లేదా పీజీ స్థాయిలో బోధిస్తున్నవారు సబ్జెక్టు పేపర్‌ సన్నద్ధతను తేలిగ్గా భావిస్తుంటారు. అతి ఆత్మవిశ్వాసం పనికిరాదు. వీరు బోధిస్తున్నదాని కంటే ఈ పరీక్షలో భిన్నమైన సిలబస్‌ ఉంటుంది. సిలబస్‌లో ఉన్న అన్ని అంశాల్లో మీకు పట్టుందో లేదో పరీక్షించుకోవాలి. బోధనకూ, పరీక్ష రాయడానికీ తేడా ఉంటుంది. ఇప్పటికే వివిధ స్థాయుల్లో బోధన వృత్తిలో ఉన్నవారికి పేపర్‌–2 కలిసివచ్చే విధంగా ఉంటుంది. వీరు ముందుగా బోధించని అంశాలను చదివితే, ఆపై సిలబస్‌లోని అన్ని అంశాలపైనా పట్టు సాధించవచ్చు.
తెలుగు మీడియం విద్యార్థులు ఇలా చేయండి...
పేపర్‌–1 ప్రశ్నలు తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఉన్నందున ఏ సమస్యా ఉండదు. కానీ సబ్జెక్టు పేపర్‌ (పేపర్‌–2) ప్రశ్నలు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. దీంతో వీరికి ప్రశ్నలను అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉండొచ్చు. అందుకని సన్నద్ధత సమయంలో తమకు తెలియని సబ్జెక్టు పదాల తెలుగు అర్థాన్ని లేదా తెలుగు పదం ఆంగ్ల రూపాన్ని రాసుకోవాలి. ఇంటర్, డిగ్రీ స్థాయుల్లోని తెలుగు మీడియం పుస్తకాల్లో తెలుగుపదంతో పాటుగా ఉన్న ఆంగ్ల పదాలను నోట్‌ చేసుకోవాలి. తెలుగు అకాడమీ ప్రచురించిన సబ్జెక్టు సంబంధిత ప్రత్యేక నిఘంటువు సహాయం తీసుకోవచ్చు.

Published date : 13 Dec 2022 03:54PM

Photo Stories